MLA KCR Oath : ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం - ప్రతిపక్ష నేతగా బాధ్యతల స్వీకరణ
KCR : తెలంగాణ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్నారు. స్పీకర్ చాంబర్‌లో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.
MLA KCR Oath : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ చేత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. బాత్ రూంలో జారి పడటంతో తుంటికి గాయమైన కేసీఆర్ స్టిక్ సాయంతో మెల్లగా నడుస్తున్నారు. కొత్ బెంజ్ కారులో వచ్చిన ఆయనకు అసెంబ్లీ వద్ద పార్టీ నేతలు స్వాగతం పలికారు. సీఆర్ వెంట బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనాచారి, మల్లారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కేసీఆర్ తన చాంబర్ లో ప్రత్యేక పూజల అనంతరం స్పీకర్ కార్యాలయంకు వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ వెంటనే ప్రమాదవ శాత్తూ కేసీఆర్ గాయపడటంతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం ఆరు నుంచి ఎనిమిది వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయన రెండు నెలలుపాటు గజ్వేల్ వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడు కర్ర సాయంతో వైద్యుల పర్యవేక్షణలో నెమ్మదిగా నడుస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో కేసీఆర్ అసెంబ్లీకి చేరుకొని, శాసనసభాపక్ష నేతగా ఆయనకు కేటాయించిన చాంబర్ లో కేసీఆర్ ముందుగా పూజలు చేశారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్ కు చేరుకొని మధ్యాహ్నం 12.40 గంటలకు కేసీఆర్ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు.
అసెంబ్లీ స్పీకర్ సమక్షంలో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.
— BRS Party (@BRSparty) February 1, 2024
ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. pic.twitter.com/0q66RkFZkL
అసెంబ్లీకి కేసీఆర్ వస్తున్నారన్న వార్త నేపథ్యంలో బీఆర్‌ఎస్, కేసీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో, అసెంబ్లీ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కేసీఆర్ అసెంబ్లీ లో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపడతారా లేదా అన్న అంశంపై బీఆర్ఎస్ వర్గాల్లో రకరకాల ప్రచారం జరిగింది. ఆయన మెదక్ ఎంపీ సీటుకు పోటీ చేస్తారని అనుకున్నారు. రేవంత్ రెడ్డి సభా నాయకుడిగా ఉంటే ప్రతిపక్ష నేతగా ఉండటానికి కేసీఆర్ ఇష్టపడరని అనుకున్నారు. కానీ ఇటీవలి కాలంలో కేసీఆర్ కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని ప్రకటిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తారని కాంగ్రెస్ సంగతి తేలుస్తారని అంటున్నారు. ఫిబ్రవరిలో పులి బయటకు వస్తుందని కేటీఆర్ తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే.. ఫిబ్రవరి ఒకటో తేదీనే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. తర్వాత కేటీఆర్ చెప్పినట్లుగా రాజకీయం మారుతుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.