BRS Office in Nagpur: మహారాష్ట్రలో తొలి బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభం - నాగ్‌పూర్‌లో కేసీఆర్ చేతుల మీదుగా
పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముందు బీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. ఆ తర్వాత రిబ్బన్ కట్ చేసి పార్టీ ఆఫీసులోకి ఇతర నేతలతో కలిసి ప్రవేశించారు.

భారత రాష్ట్ర సమితి విస్తరణలో భాగంగా మహారాష్ట్రలో మొదటి కార్యాలయాన్ని ప్రారంభించారు. నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం (జూన్ 15) ప్రారంభించారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముందు బీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. ఆ తర్వాత రిబ్బన్ కట్ చేసి పార్టీ ఆఫీసులోకి ఇతర నేతలతో కలిసి ప్రవేశించారు. కార్యాలయంలో వేద పండితులు లోపల నిర్వహించిన అమ్మవారి పూజలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, సంతోష్ కుమార్, బీబీ పాటిల్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దానం నాగేందర్, ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధుల, మహారాష్టకు చెందిన ఇటీవల బీఆర్ఎస్ లో చేరిన స్థానిక నేతలు పాల్గొన్నారు.
#BRS Party National President & #Telangana CM #KCR cut the ribbon of #Nagpur BRS Party office and entered the office. pic.twitter.com/aTxItr3Pb8
— Iqbal Hussain⭐ اقبال حسین (@iqbalbroadcast) June 15, 2023
మహారాష్ట్రలోని విదర్భ సహా రాష్ట్రంలోనే బీఆర్ఎస్ పార్టీ మొదటి కార్యాలయం ఇదే. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ తన ఉనికిని విస్తరించుకునేందుకు కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అక్కడి కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం నిర్వహించి మాస్ బేస్ పెంచేలా దిశా నిర్దేశం చేయనున్నారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో బీఆర్‌ఎస్ ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తోంది. ఈ నినాదంతో రైతులను తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీఆర్‌ఎస్ ప్లాన్ చేసింది.
ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో కేసీఆర్ నాగ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వార్ధా రోడ్డులోని సాయి మందిరం సమీపంలోని పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. వందలాది మంది పార్టీ కార్యకర్తలు, విదర్భలోని వివిధ రాజకీయ పార్టీల ప్రముఖుల సమక్షంలో, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం దాటాక రేషింబాగ్‌లోని కవివర్య సురేష్ భట్ ఆడిటోరియంలో సభ ప్రారంభమవుతుంది. అక్కడ జరిగే సభలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ముచ్చటించనున్నారు. ప్రజలంతా పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీఆర్‌ఎస్ విదర్భ కోఆర్డినేటర్ జ్ఞానేష్ వకుద్కర్ కోరారు.





















