Podu Lands KCR : "పోడు" భూముల పట్టాలివ్వడానికి ఎన్నో చట్ట బంధనాలు - కేసీఆర్ ఎలా పరిష్కరిస్తారు ?
పోడు వ్యవసాయం చేసుకునే వారికి పట్టాలిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అది సాధ్యమేనా ?
![Podu Lands KCR : KCR has announced that those who do Podu farming should be punished. Is that possible? Podu Lands KCR :](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/10/1223958b2064f3429a11b4e9298e787a1676027318624228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Podu Lands KCR : పోడు భూముల సమస్యలపై అసెంబ్లీ కేసీఆర్ మరోసారి ప్రకటన చేశారు. గతంలోనూ ఆయన ఇదే తరహా ప్రకటన చేశారు. కానీ ఈ సారి ఫిబ్రవరి నెలాఖరు నుంచే పట్టాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ అంశంపై అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని.. అన్ని పార్టీలు అంగీకరించాలని ఆయన వ్యాఖ్యానించారు.ఇప్పటి వరకూ ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాల్లో అఖిలక్ష సమావేశాలు పెట్టింది లేదు. కానీ పోడు సమస్యపై మాత్రం అఖిలపక్షం పెట్టాలనుకుంటున్నారు. ఎందుకంటే.. పోడు భూముల సమస్య అంత తేలికగా పరిష్కారమయ్యేది కాదు.
పోడు భూములంటే ఏమిటంటే ?
అటవీ ప్రాంతంలో నివాసం ఉండే గిరిజనులు కొంతమేర అడవిని కొట్టి.. వివిధ రకాలు పంటలు పండించుకుంటారు. ఇవే కొంతమందికి ప్రధాన జీవనాధారం. అడవులు, కొండ వాలుల్లో చిన్న చిన్న చెట్లను, పొదలను నరికి చేసుకునే వ్యవసాయాన్నే పోడు వ్యవసాయంగా పిలుస్తారు. ఇలాంటి పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుని తెలంగాణ లో లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి. అయితే ఈ భూములపై వారికి ఎలాంటి హక్కు లేదు. అవన్నీ ప్రభఉతవ భూములే. వీటికి హక్కులు కల్పించాలని చాలా ఏళ్లుగా పోరాటం జరుగుతుంది.
అటవీ భూముల చట్టం ఏం చెబుతోందంటే ?
2006లో అమల్లోకి వచ్చిన అటవీ చట్టం ప్రకారం.. 2005 డిసెంబర్ 13 కంటే ముందు అటవీ భూములను సాగు చేస్తున్న గిరిజనులందరికీ భూమిపై హక్కు కల్పిస్తూ పత్రాలివ్వాలి. గరిష్ఠంగా నాలుగు హెక్టర్లు ఇవ్వాలి. ఆ తర్వాత సాగు చేసుకుంటున్న వారికి ఎలాంటి పరిస్థితుల్లోనూ పట్టాలివ్వడానికి అవకాశం లేదు. మరోవైపు 1/70 చట్టంపైనా ఇప్పుడు చర్చ నడుస్తోంది. అడవుల్లో ఆదివాసులకే ఆస్తి హక్కు ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఐదో షెడ్యూల్లో చేర్చి 1/70 చట్టాన్ని తెచ్చింది. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడం, అంతరించి పోతున్న తెగలను కాపాడలనే ఉద్దేశంతో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్నీ అమలు చేయాల్సి ఉంది.
గతంలోనే హామీ ఇచ్చిన కేసీఆర్ !
పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని కేసీఆర్ గత ముందస్తు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. తానే బయల్దేరతానని.. అన్ని చోట్లకూ స్వయంగా పోతానని చెప్పారు. మంత్రివర్గం, అధికార గణం అందర్నీ తీసుకెళ్లి.. ప్రజా దర్బారు పెట్టి పోడు పట్టాలు ఇచ్చేస్తామన్నారు. ఆ తర్వాత ఒక ఇంచు కూడా ఆక్రమణ కానివ్వమని స్పష్టం చేశారు. అప్పటి నుంచి ఇంకా పోడు భూముల సమస్య పరిష్కారం కాలేదు.
ఇప్పటికే పోడు భూములకు పట్టాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు !
తెలంగాణలో రెండు వేల 845 గ్రామ పంచాయతీల నుంచి 4 లక్షల 14వేల 353 దరఖాస్తులు పోడు భూములకు పట్టాల కోసం ప్రభుత్వానికి వచ్చాయి. ఆ భూమి చూసుకుంటే.. 12లక్షల 46వేల 846 ఎకరాలుగా ఉంది. పోడు సమస్యను పరిష్కరించి 11 లక్షల ఎకరాలకు పట్టాలిస్తామని కేసీఆర్ ప్రకటించారు. కానీ చట్టం ప్రకారం 2005కి ముందు వాటికే అంటే.. లక్షా 60 వేల ఎకరాలు మాత్రమే హక్కులు కల్పించేందుకు అర్హత ఉంది.అంటే.. చట్టానికంటే ఎక్కువగా దాదాపుగా పది లక్షల ఎకరాలకు పట్టాలివ్వాల్సి ఉంటుంది. కేసీఆర్ ఎలా సాధ్యం చేస్తారన్నది ఇప్పుడు కీలకం!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)