Telangana Assembly Meeting : కేంద్రం వల్ల తెలంగాణకు రూ. 40వేల కోట్ల ఆదాయం లాస్ - డిసెంబర్‌లో అసెంబ్లీ ద్వారా ప్రజలకు చెప్పనున్న కేసీఆర్ సర్కార్ !
డిసెంబర్‌లో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. కేంద్రం తీరు వల్ల తెలంగాణకు రావాల్సిన రూ. 40వేల కోట్ల ఆదాయం రావడం లేదని ప్రజలకు అసెంబ్లీ ద్వారా చెప్పనున్నారు.
Telangana Assembly Meeting : డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా తెలంగాణకు కేంద్రం సృష్టిస్తున్న ఆర్థిక అడ్డంకులపై చర్చ జరిగే అవాశం ఉంది. అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రం పై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షల వల్ల 2022 -23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ కు సమకూరవలసిన ఆదాయంలో 40 వేల కోట్ల రూపాయలకు పైగా తగ్గుదల చోటుచేసుకున్నదని కేసీఆర్ నిర్ధారణకు వచ్చారు. ఇటువంటి చర్యలతో తెలంగాణ అభివృద్ధిని ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు డిసెంబర్ నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావును, శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డిని సిఎం కెసిఆర్ ఆదేశించారు.
ఆశించినంతగా అప్పులు తీసుకోకుండా కట్టడి చేస్తున్న కేంద్రం
తెలంగాణ ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు తగ్గట్లుగా రుణాలు అందడం లేదు. కేంద్రం అనవసర ఆంక్షలు పెడుతోందని.. టీఆర్ఎస్ నేతలు కొద్ది కాలం నుంచి ఆరోపిస్తున్నారు. ఎఫ్ఆర్‌బీఎం పరిమితికి అదనంగా కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేశారని.. వాటిని కూడా రాష్ట్ర అప్పులుగానే పరిగణిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి తెలంగాణకు సమాచారం ఇచ్చారు. అప్పుల పరిమితిని పెంచలేదు. దీనిపై తెలంగాణ ఆర్థికశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పులు తీసుకోవడానికి తెలంగాణకు అనుమతి ఇవ్వకపోవడంపై రాష్ట్ర ఆర్థిక శాఖ నిరసన వ్యక్తం చేసింది. తెలంగాణ పట్ల వివక్ష చూపడం సరికాదంటూ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
కేంద్రం ఆంక్షలపై తెలంగాణ సర్కార్ తీవ్ర అసంతృప్తి
కేంద్రం ఏవిధంగానైతే అప్పులు తీసుకుంటుందో ఆ నిబంధనలనే తెలంగాణ కూడా పాటిస్తుందని అధికారులు వాదిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం తెలంగాణ అప్పులు తీసుకోవడానికి వెంటనే అనుమతులు ఇవ్వాలని, లేకుంటే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని చాలా కాలంగా కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఆఫ్ బడ్జెట్ అప్పులను రాష్ట్రాల అప్పులను చూస్తామనడం కక్షపూరిత చర్యేనని తెలంగాణ వాదిస్తోంది. మూలధన వ్యయం కోసం ఖర్చు చేసినవి.. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రావని ... అయినప్పటికీ. కొన్ని ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి చూపడం… మరికొన్నింటిని చూపకపోవటం వివక్ష అవుతుందని తెలంగాణ సర్కార్ వాదిస్తోంది.
అసెంబ్లీ ద్వారా వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని నిర్ణయం
ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఆంక్షలు ఎక్కువ కావడంతో.. ఇప్పటి వరకూ బడ్దెట్ అంచనాల్లో 30 శాతం కూడా రుణాలు తెచ్చుకోలేకపోయారు. ఈ కారణంగా ఎన్నో పనులు పెండింగ్‌లో పడుతున్నాయి. నిధుల సమస్య వెంటాడుతోంది. ప్రాజెక్టులు నత్త నడకన నడుస్తున్నాయి. కేంద్రం ఆర్థిక ఆంక్షలు విధించడం వల్లే సమస్యలు వస్తున్నాయని ప్రజలకు చెప్పేందుకు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఆలోచన కేసీఆర్ చేస్తున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు క్లారిటీకి వచ్చాయి.