KCR River Boards : కేసీఆర్ కీలక నిర్ణయం..నదీ బోర్డుల సమావేశాలకు తెలంగాణ హాజరు..!
నదీబోర్డుల సమావేశాలకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపని తెలంగాణ తన విధాన్ని మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. 9వ తేదీన జరగనున్న నదీబోర్డుల ఉమ్మడి సమావేశంలో తెలంగాణ హక్కుల కోసం గళమెత్తాలని నిర్ణయించుకున్నారు.
కృష్ణా, గోదావరి నదీ బోర్డులను నోటిఫై చేస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ను స్వాగతించేది లేదన్న ఉద్దేశంతో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. ఇప్పటి నదీ బోర్డుల సమావేశాలకు కూడా తెలంగాణ హాజరు కాలేదు. తొమ్మిదో తేదీన కృష్ణా, గోదావరి నదీ బోర్డుల ఉమ్మడి సంయుక్తు సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాలని తెలంగాణ సర్కార్‌కు నదీ బోర్డు యాజమాన్యాలు సమాచారం పంపాయి. అయితే తెలంగాణ సర్కార్ మాత్రం తాము హాజరు కాబోమని తెలిపింది. ఇలా తెలిపిన ఒక్క రోజులోనే సీఎం కేసీఆర్... ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి.. 9వ తేదీన జరగనున్న నదీ బోర్డుల సమావేశంలో లేవెనత్తాల్సిన అంశాలపై ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.
కృష్ణా జలాలపై వివాదం తీవ్రమైన సమయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి పలుమార్లు లేఖలు రాశారు. నదీ బోర్డులను నోటిఫై చేయాలని.. గెజిట్ విడుదల చేయాలని కోరారు. ప్రాజెక్టులను కేంద్ర అధీనంలోకి తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా రెండు నదుల బోర్డులను నోటిఫై చేస్తూ గెజిట్ విడుదల చేసింది. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగంగా ఆయన నదీ బోర్డులపై అసంతృప్తి వ్యక్తం చేయకపోయినప్పటికీ.. తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు ఆ విషయాన్ని బహిరంగపరిచాయి. నదీబోర్డుల సమావేశానికి హాజరు కాకపోవడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.
దీంతో ఈ అంశంపై న్యాయపోరాటం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా కేసీఆర్ ఈ నదీ బోర్డుల గెజిట్‌ను స్వాగతించాలని నిర్ణయించుకున్నట్లుగా తాజా సమీక్షల ద్వారా వెల్లడవుతోంది. శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాలను సీఎం క్షుణ్ణంగా చర్చించారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను బోర్డులకు అప్పగిస్తే... ఎంత ఖర్చు అవుతుంది ఎంతమందిఉద్యోగులను బోర్డుల కిందికి తేవాల్సి ఉంటుందనే దానిపై అధికారులు సీఎంకు నివేదిక ఇచ్చారు. కృష్ణా, గోదావరి బోర్డుల ఖాతాల్లో చెరో రూ.200 కోట్లను జమచేయాలంటూ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లేఖలను సీఎంకు అధికారులు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఈనెల 9న జరిగే బోర్డుల సంయుక్త సమావేశంలో తెలంగాణ వాణిని గట్టిగా వినిపించాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు. నీటివాటాలకు సంబంధించి బచావత్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారం న్యాయమైన వాటాను దక్కించుకోవడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని స్పష్టం చేశారు. దీంతో కేసీఆర్ కేంద్రం జారీ చేసిన గెజిట్‌కు ఆమోదం తెలిపినట్లేనని అంచనా వేస్తున్నారు. నదీ బోర్డులు చెప్పినట్లుగా ఇరు రాష్ట్రాలు నడుచుకుంటే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని జల వనరుల నిపుణులు అంచనా వేస్తున్నారు.