BRS MP Candidates: అసదుద్దీన్ ఒవైసీని ఢీకొట్టనున్న శ్రీనివాస్ యాదవ్ - 17 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే
Telangana News: గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
KCR announces Srinivas Yadav as Hyderabad MP Candidate for BRS: హైదరాబాద్: హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరు ప్రకటించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ యాదవ్‌ను ఎంఐఎం అధినేత, అసదుద్దీన్ ఒవైసీపై పోటీకి బరిలో నిలిపారు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. హైదరాబాద్ అభ్యర్థి ప్రకటనతో తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది.
మొత్తం 17 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే
1) ఖమ్మం - నామా నాగేశ్వర్ రావు(ఓసీ)
2) మహబూబాబాద్ (ఎస్టీ )మాలోత్ కవిత
3) కరీంనగర్ - బోయినిపల్లి వినోద్ కుమార్ (ఓసీ)
4) పెద్దపల్లి(ఎస్సీ ) -కొప్పుల ఈశ్వర్
5) మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి (ఓసీ)
6) చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ (బీసీ)
7) వరంగల్ (ఎస్సీ )-డాక్టర్ కడియం కావ్య
8 ) నిజామాబాద్ -బాజి రెడ్డి గోవర్ధన్ (బీసీ)
9 ) జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్ (బీసీ)
10 ) ఆదిలాబాద్(ఎస్టీ ) -ఆత్రం సక్కు ( ఆదివాసీ)
11 ) మల్కాజ్ గిరి -రాగిడి లక్ష్మా రెడ్డి (ఓసీ)
12) మెదక్ -పి .వెంకట్రామి రెడ్డి (ఓసీ)
13) నాగర్ కర్నూల్ (ఎస్సీ )- ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ .
14) సికింద్రాబాద్ - తీగుళ్ల పద్మారావు గౌడ్ ( బీసీ)
15) భువనగిరి - క్యామ మల్లేశ్ (బీసీ)
16) నల్గొండ - కంచర్ల కృష్ణారెడ్డి (ఓసీ)
17) హైదరాబాద్ - గడ్డం శ్రీనివాస్ యాదవ్ ( బీసీ)
ఓవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ నేతలు డీలా పడ్డారు. దాంతో లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని మాజీ సీఎం కేసీఆర్ భావించారు. కానీ కొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరిపోయారు. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరి సీట్లు తెచ్చుకున్నారు. ఎన్నికల్లో పోటీకి సిద్ధమే, కానీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి కొందరు నేతలు వెనుకాడారు. ఈ క్రమంలో కొందరు పార్టీని వీడగా, మరికొందరు సీటు ఆఫర్ చేసినా, ఫలితంపై ఆందోళనతో చేతికి వచ్చిన ఆఫర్ రిజెక్ట్ చేశారు. బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయటకు వచ్చి మరీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
దశలవారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చిన కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీకి బలమైన కేడర్ ఉన్నప్పటీకీ గతంలో ఎన్నడూ లేనట్లుగా లీడర్ల కొరత ఏర్పడింది. ప్రజాబలం ఉందని నిరూపించేందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా అభ్యర్థులను దశల వారీగా ఎంపిక చేస్తూ వచ్చారు. ఆయా ప్రాంతాన్ని బట్టి విజయావకాశాలు మెరుగ్గా ఉన్న అభ్యర్థులను లోక్ సభకు పంపించి పార్లమెంట్ లో తమ గళం వినిపించాలని కోరుకున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఫలితాల అనంతర పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ పాలనను తీసుకురావాలంటే లోక్ సభ ఎన్నికల్లో సాధ్యమైనన్ని సీట్లు నెగ్గి, ప్రజలకు మరోసారి తమ బలం నిరూపించాలని బీఆర్ఎస్ బాస్ భావించారు. పార్లమెంటు ఎన్నికల్లో విజయదుందుభి మోగించేందుకు పార్టీ సన్నద్ధమైంది. అధినేత కేసీఆర్ ఆశీస్సులతో ఎన్నికల రంగంలోకి దూకేందుకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ప్రకటించిన కొందరు బీఆర్ఎస్ అభ్యర్థులు వారి పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. కేసీఆర్ ఒక్కసారి ఆదేశిస్తూ పూర్తి స్థాయిలో ప్రచారం మొదలుపెడతామని పార్టీ ఎంపీ అభ్యర్థులు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 12 నుంచి 14 స్థానాల్లో విజయం సాధించి అటు పార్టీ శ్రేణుల్లో ఇటు ప్రజల్లో పునరుత్తేజాన్ని తీసుకురావాలని నేతలు ప్రయత్నిస్తున్నారు.