Singareni Bonus: సింగరేణి ఉద్యోగులకు కేసీఆర్ భారీ బోనస్ ప్రకటన - ఈసారి ఏకంగా రూ.700 కోట్లు
2014 కంటే ముందు సింగరేణి కార్మికులకు ఇచ్చే బోనస్ 18 శాతం మాత్రమే ఉండేదని కేసీఆర్ గుర్తు చేశారు. అంటే కేవలం రూ.50 నుంచి 60 కోట్లు మాత్రమే కార్మికులకు పంచేదని అన్నారు.
సింగరేణి సంస్థని కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని కేసీఆర్ విమర్శించారు. ఆ పార్టీ చేసిన అప్పులు తీర్చలేకే సింగరేణిలో 49 శాతాన్ని కేంద్రానికి అప్పగించిందని ఆరోపించారు. మంచిర్యాలలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించిన అనంతరం.. ప్రగతి నివేదన సభ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. 2014 కంటే ముందు సింగరేణి కార్మికులకు ఇచ్చే బోనస్ 18 శాతం మాత్రమే ఉండేదని కేసీఆర్ గుర్తు చేశారు. అంటే కేవలం రూ.50 నుంచి 60 కోట్లు మాత్రమే కార్మికులకు పంచేదని అన్నారు.
వచ్చే దసరాకు రూ.700 కోట్ల బోనస్
తెలంగాణ వచ్చాక 2014లో సింగరేణి టర్నోవర్ రూ.11 వేల కోట్లు మాత్రమే అని.. ఇవాళ అదే సింగరేణి టర్నోవర్‌ను రూ.33 వేల కోట్లకు పెంచుకున్నామని అన్నారు. అదే విధంగా సింగరేణి లాభాలు కేవలం రూ.300 నుంచి రూ.400 కోట్లు మాత్రమే ఉంటే.. ఇవాళ సింగరేణిలో ఈ ఏడాది వచ్చిన లాభాలు రూ. 2,184 కోట్లకు పైనే అని అన్నారు. ఈ లాభాల వల్ల వచ్చే దసరాకు సింగరేణి కార్మికులకు పంచబోయే బోనస్ రూ.700 కోట్లుగా ఉంటుందని చెప్పారు. దీంతో జనం ఒక్కసారిగా ఈలలు, అరుపులతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు.
సింగరేణిలో ఉద్యోగ నియామకాలు పెంచాం
‘‘సింగరేణిలో నూతన నియామకాలు చేసుకుంటున్నాం. 10 సంవత్సరాల కాంగ్రెస్ సామ్రాజంలో 6453 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాల హక్కును పునుదర్ధరించి 19,463 ఉద్యోగాలను కల్పించాం. 15,256 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాం. సింగరేణిలో ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే గత ప్రభుత్వాలు రూ. లక్ష ఇచ్చి చేతులు దులుపుకునేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తుంది అని తెలిపారు. వడ్డీ లేకుండా రూ. 10 లక్షల రుణం ఇంటి కోసం ఇస్తున్నాం’’ అని కేసీఆర్ తెలిపారు.
తవ్వకాలు ఎక్కడున్నా సింగరేణికే అప్పగించాలని నిర్ణయం - కేసీఆర్
‘‘మన దేశంలో బొగ్గుకు కొరత లేదు. సింగరేణితో పాటు, ఈస్టర్న్ కోల్స్, వెస్టర్న్ కోల్ మైన్స్ ఉండగా అన్నీ ప్రైవేటు పరం చేస్తామని చెప్తున్నారు. మన దేశంలో బొగ్గు కొరత లేనే లేదు. దిక్కుమాలిన పాలసీలతో కేంద్ర ప్రభుత్వం మొత్తం అమ్మేస్తుంది. సింగరేణి ఎండీని నేను ఇండోనేసియా, ఆస్ట్రేలియా కూడా పంపా. ఖమ్మం జిల్లాలో ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నాయి. వజ్రపు తునక లాంటి సింగరేణికి మైనింగ్ అనుభవం ఉంది. మిగతా గనుల తవ్వకాలు ఎక్కడ ఉన్నా సింగరేణికే అప్పగించాలని మేం నిర్ణయం తీసుకున్నాం. ఇంత బొగ్గు ఉన్నా దాన్ని వాడకుండా ఆస్ట్రేలియా, ఇండొనేసియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నారు. దేశంలోనే అన్యాయం జరుగుతోంది కాబట్టి, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి పోరాటానికి నడుం బిగించాం. సింగరేణిని కాంగ్రెస్ పార్టీ సగం ముంచితే, బీజేపీ మిగతా సగం ముంచుతామని చెబుతోంది.