(Source: ECI/ABP News/ABP Majha)
Kavitha comments on Revanth : ప్రియాంక వస్తే నల్లబెలూన్లు ఎగరేస్తాం - ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక
Kavitha : సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ముఠా మేస్త్రిలా మాట్లాడుతున్నారన్నారు.
Kavitha comments on Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాధానాన్ని వృధా చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాలకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీని ఆహ్వానిస్తే నల్లబుగ్గలు ఎగరేసి నిరసనలు తెలియజేస్తామని హెచ్చరించారు. ఏ హోదాలో అధికారిక కార్యక్రమాలకు ప్రియాంకా గాంధీని పిలుస్తారని ప్రశ్నించారు. జార్ఖాండ్ ఎమ్మెల్యేల క్యాంపు కోసం కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేస్తుందా లేదా ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తున్నారా అన్నది చెప్పాలని డిమాండ్ చేశారు.
శనివారం హైదరాబాద్ లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు.
జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రేవంత్ రెడ్డి సోనియా గాంధీ కాళ్లు మొక్కరే తప్పా జై తెలంగాణ అని అనలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనలో సామాజిక ధృక్కోణం కొరవడిందని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి గానూ తక్షణమే కులగణన చేపట్టే ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తెల్లారిలేస్తే కేసీఆర్ కుటుంబంపై ఏడ్చే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 22 కుటుంబాలకు చెందిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పార్టీ సభకు ప్రభుత్వ నిధులు ఎందుకు వాడుతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హెలికాప్టర్ లో వెళ్లి పార్టీ సభలో పాల్గొనడం ఏంటని అడిగారు. సభకు పెట్టిన ఖర్చు ఎంత ? వసతులు వాడుకున్నందుకు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ డబ్బు చెల్లించిందా అని చెప్పాలని సూచించారు.
తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి !
కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఇప్పటికైనా తప్పులు తెలుసుకొని ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పడం మంచి పరిణామమని, తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చెప్పట్టినా అమరవీరులకు క్షమాపణలు చెప్పి మొదలుపెట్టాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ముఠామెస్త్రీలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయడానికి ప్రభుత్వపరంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంకా గాంధీని ఆహ్వానిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని తెలిపారు. ఏ హోదాలో ప్రియాంకా గాంధీని పిలుస్తారని ప్రశ్నించారు. “ఆమె కనీసం దేశంలో ఏ ఒక్క గ్రామం నుంచి అయినా సర్పంచ్ గా గెలిచిందా ? ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా గెలిచారా ? రాష్ట్రంలో ఏ ప్రోటోకాల్ లో అయినా ఉందా ఆమె ? మీ పార్టీకి చెందిన ముఖ్యనాయకురాలైతే ఇంటికి పిలుచుకొని మీ మనువడికి ఆశీర్వాదం ఇప్పించుకోండి. తెలంగాణకు వచ్చిన ఆడబిడ్డ కాబట్టి చీరసారె పెట్టి సాదరంగా సాగనంపండి. కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంకా గాంధీని పిలుస్తామంటే తప్పకుండా నల్లబుగ్గలు ఎగరేసి నిరసన తెలియజేస్తాం” అని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలే పడగొడతారు !
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తాము పడగొట్టాల్సిన అవసరం లేదని, ఆ పార్టీ నాయకులే పడగొడుతారని స్పష్టం చేశారు. అద్దంకి దయాకర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం వెనక్కితీసుకునేలా ఒత్తిడి చేసిన నల్గొండ నాయకులు ఎవరన్నది అందరికీ తెలుసునని, కాబట్టి అదే నల్గొండ, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులే పడగొడుతారని అన్నారు. ఇవాళ ఒక ముఖ్యమంత్రి ఉండడం... రేపొక ముఖ్యమంత్రి ఉండడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని విమర్శించారు. ప్రజలు తమను ప్రతిపక్షంలో ఉండమన్నారని, తాము ప్రతిపక్షంలో ఉంటామని తేల్చిచెప్పారు.ప్రజల వద్దకే పాలన వెళ్లాలని బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాలను, మండలాలను, గ్రామాలను ఏర్పాటు చేసిందని, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని, ఇలా పరిపాలన వికేంద్రీకరణ కోసం తాము చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కేంద్రీకృతం జరగాలని కోరుకుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న అపారమైన రాజకీయ అనుభవంతో ఆయన తీసుకున్న నిర్ణయాలను విమర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆయన బాటలోకి రావడం చాలా సంతోషమన్నారు.
జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారా లేదా ?
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని, కాబట్టి పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేస్తారా లేదా అన్నది సుత్తి లేకుండా సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 11లోగా సానూకూల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో గత కొన్ని రోజులుగా మంత్రులు, ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ తనను విమర్శిస్తున్నారని, కానీ తమ డిమాండ్ వల్ల అత్యధికంగా లాభం పొందేది పొన్నం ప్రభాకరేనని స్పష్టం చేశారు. తక్షణమే కులగణన చేపట్టే ప్రక్రియ మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, బడ్జెట్ ప్రవేశపెట్టి రెండు రోజులు గడుస్తున్నా స్పందించకపోవడం దారుణమన్నారు.
పార్టీ నిర్ణయిస్తే నిజామాబాద్ ఎంపీగా పోటీ
నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసే అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్సీ కవిత సమాధానమిస్తూ.... పార్టీ ఎలా నిర్ణయిస్తే అలా అని వ్యాఖ్యానించారు. తమది కాంగ్రెస్ పార్టీలా కాదని, క్రమశిక్షణ కలిగిన బీఆర్ఎస్ పార్టీలో తమకు తాము ప్రకటించుకోబోమని, పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు.