DK Shivakumar: మమ్మల్ని తలుచుకోనిదే కేసీఆర్‌కు నిద్రపట్టదు - డీకే శివకుమార్ విమర్శలు
DK Shivakumar: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. అధికారమే లక్ష్యంగా ప్రచారాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జాతీయ స్థాయి నాయకులు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నారు.

Karnataka Deputy CM DK Shivakumar Comments in Telangana: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ (Telangana Congress Party) జోరు పెంచింది. అధికారమే లక్ష్యంగా ప్రచారాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జాతీయ స్థాయి నాయకులు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నారు. కామారెడ్డిలో జరిగిన సభలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) హాజరయ్యారు. తాజా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ కాంగ్రెస్ నేతలు ఏపీ కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి (Raghu Veera Reddy), గిడుగు రుద్రరాజు (Gidugu Rudra Raju) స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా విజయవాడలో శివకుమార్ మాట్లాడుతూ.. మూడు అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం చేస్తానని తెలిపారు. తెలంగాణ మొత్తం మార్పుకోసం చూస్తోందని.. సోనియాకు కృతజ్ఞత చెప్పాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. ఇక ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫాంహౌస్‌లో రెస్ట్ తీసుకోవాల్సిందేనని ఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్ ఎప్పుడూ మమ్మల్ని తలుచుకోనిదే నిద్రపోడని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున ఐదు గ్యారెంటీలు అమలవుతున్నాయని తెలిపారు.
సీఎం కుర్చీకోసం కొట్లాటలు జరగడం లేదని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ రహిత పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని శివకుమార్ (DK Shivakumar) చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని.. ప్రజలు కూడా ఇప్పటికే కేసీఆర్‌ను సాగనంపడానికి ప్రజలు సిద్ధమయ్యారని ఆయన తెలిపారు.
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన చరిత్ర కేసీఆర్ కుటుంబానికి చెందుతుందన్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కోదాడకు బయల్దేరి వెళ్లారు. ఆయనతో పాటు ఏపీ, తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కోదాడ, హుజుర్‌నగర్‌లో డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
కామారెడ్డిలో సిద్ధరామయ్య ప్రచారం
కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిర్వహించింది. ఈ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే తమ ఆరు గ్యారంటీలను తక్షణం అమలు చేస్తామని సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. ఇప్పటికే కర్ణాటకలో 5 గ్యారంటీలు అమలవుతున్నాయో లేదో చూడాలని కేసీఆర్ కు చెప్పారు.
కేసీఆర్ కర్ణాటకకు వస్తే దగ్గరుండి చూపిస్తామని అన్నారు. కర్ణాటకలో 5 గ్యారంటీ స్కీంలను పక్కాగా అమలు చేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ కు బీజేపీకి తేడా ఏమీ లేదని, బీఆర్ఎస్.. బీజేపీ బీ టీం అని ఆరోపించారు. తెలంగాణకు మోదీ 100 సార్లు వచ్చినా బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో ప్రధాని మోదీ 48 సభలు పెట్టారని, రోడ్ షోల్లో విపరీతంగా పాల్గొన్నారని గుర్తు చేశారు. అయినా కూడా ప్రధాని మోదీ ప్రచారం చేసిన ప్రతి చోట కాంగ్రెస్ పార్టీనే గెలిచిందని అన్నారు. అబద్ధాలు చెప్పే ప్రధానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

