Vemulawada MLA: గల్ఫ్‌లో చిక్కుకొని ఏడుస్తూ సిరిసిల్ల యువకుడి వీడియో వైరల్ - స్పందించిన ఎమ్మెల్యే
Telangana News: గల్ఫ్ బాధితుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంపై ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తక్షణమే స్పందించారు. ఆయనకు సాయం చేశారు.
Karimnagar news: బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి ఇబ్బందులు పడుతున్న ఓ యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఇమ్రాన్ అనే యువకుడు నెల రోజుల క్రితం సూపర్ మార్కెట్లో పనిపై సౌదీ దేశానికి వెళ్ళాడు. 15 రోజులకు క్రితం పైల్స్ ఆపరేషన్ జరిగింది. ఆరోగ్యం సహకరించకపోవడంతో అనారోగ్య బారిన పడ్డాడు. స్వదేశానికి తిరిగి వద్దాం అంటే తనను యజమాని పంపడం లేదని తనను కాపాడాలని సౌదీ నుండి స్వదేశానికి తిరిగి రప్పించాలని ఇమ్రాన్ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డిని వీడియోలో ప్రాధేయపడ్డాడు. ఆరోగ్యం బాగాలేదని తెలిపినా కూడా యజమాని పంపించడం లేదని ఇలాగే ఉంటే చనిపోతానంటూ తనను కాపాడాలని వేడుకున్నాడు
స్పందించిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దృష్టికి రావడంతో తక్షణమే స్పందించారు. ఆయన ఇమ్రాన్ ను తిరిగి స్వదేశానికి రప్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇండియన్ ఎంబసీ, సౌదీ అరేబియా దేశానికి లేఖ రాసి అధికారులతో మాట్లాడారు. అనంతరం NRI బైరా దేవ్ యాదవ్ ఇమ్రాన్ దగ్గరికి వెళ్లి కలవడం జరిగింది. కాగా ఇమ్రాన్ స్వదేశానికి వచ్చేందుకు విమాన టికెట్లు, ఖర్చులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పూర్తిగా భరిస్తానని హామీ ఇచ్చారు.
దీంతో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఇమ్రాన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం సౌదీలో ఎన్ఆర్ఐ బైరి యాదవ్ దగ్గర సురక్షితంగా ఉన్నానని రెండు మూడు రోజుల్లో తాను ఇండియాకు వస్తానని, అందుకు అయ్యే ఖర్చులను మొత్తం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఒక వీడియో విడుదల చేశారు.