Karimnagar News: గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా? నేను పక్కా లోకల్ అంటున్న బండి సంజయ్
Telangana News: కరీంనగర్ ఎంపీ క్యాండిడేట్‌గా బండి సంజయ్ నామినేషన్ వేశారు. ఆయనకు మద్దతుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గుజరాత్ సీఎం పటేల్ హాజరయ్యారు.
Bandi Sanjay Kumar News: కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధిగా బండి సంజయ్ ఇవాళ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ రజనీకాంత్ పటేల్ పాల్గొన్నారు. నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో కాషాయం శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్... తాను లోకల్ అని మిగతా వారంతా నాన్ లోకల్ అని చెప్పుకొచ్చారు.
బండి సంజయ్ ఇంకా ఏమన్నారంటే..." కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులు వందల కోట్ల రూపాయలు ఉన్నోళ్లు. వందల కోట్లు ఖర్చు చేయడానికి వచ్చినోళ్లు. వాళ్లు గెలిస్తే వేల కోట్లు సంపాదించుకుంటారు. నాకు కోట్ల ఆస్తుల్లేవు. కానీ మీ కోసం కొట్లాడి వందల కేసులున్నోడిని. వాళ్లకు ఆస్తి కోట్ల రూపాయలు. నా ఆస్తి మీరే. వాళ్లు గెలిస్తే వేల కోట్లు సంపాదిస్తరు. నేను మీ కోసం కొట్లాడి వేల కేసులు పెట్టినా భయపడనోన్ని. గడీల వారసులు కావాల్నా? గరీబోళ్ల బిడ్డ బండి సంజయ్ కావాల్నా గుండెమీద చేయి వేసుకుని ఓటేయండి’’ అంటూ బండి సంజయ్ ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులిద్దరూ కేసీఆర్ అనే నాణేనికి బొమ్మాబొరుసు లాంటి వారని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టరేట్ వద్దకు వచ్చిన గుజరాత్ సీఎం, కిషన్ రెడ్డితో కలిసి బండి సంజయ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ముగ్గురూ కలిసి ఒకే కాన్వాయ్‌లో ఎస్సారార్ డిగ్రీ కాలేజీ వద్దకు వెళ్లారు. అక్కడికి వచ్చి కార్యకర్తలతో ఆ ప్రాంతమంతా జనసంద్రమైంది. వారందరికీ అభివాదం చేస్తూ ముగ్గురు నేతలు ఓపెన్ టాప్ వాహనంపై మాట్లాడుర. ఈ సందర్భంగా బండి కీలక ప్రసంగం చేశారు. "బీజేపీ హైకమాండ్ టిక్కెట్ ఇవ్వగానే... మీ అందరి ఆశీస్సులతో కరీంనగర్ బిడ్డగా నామినేషన్ దాఖలు చేసిన. మోదీని మళ్లీ ప్రధానిగా చేసే అవకాశం కోసం కరీంనగర్‌లోని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. భారత్‌ను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న మోదీకి మద్దతివ్వాలని కోరుతున్నా. మీరు నన్ను గెలిపిస్తే నేను మోదీకి ఓటేస్తా... కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే రాహుల్ గాంధీకి ఓటేస్తరు.. ఎవరు కావాలో తేల్చుకోండి..
నేను మీ బిడ్డను. పక్కా లోకల్. మీరు పెంచి పోషించిన బిడ్డను. మీ కోసం నిరంతరం కొట్లాడుతున్న. మీ కోసం లాఠీదెబ్బలు తిన్న. వందల కేసులు పెట్టినా మీకు అండగా నిలిచిన. నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం జైలుకు వెళ్లిన. 317 జీవోకు నిరసనగా ఎంపీ కార్యాలయంలో ధర్నా చేస్తే నా ఆఫీస్ బద్దలు కొట్టి కేసీఆర్ గుంజుకుపోయి జైళ్లో వేసినా భయపడలే. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం కొట్లాడింది నేను. అగ్రవర్ణాల పేదల కోసం పోరాడింది నేను..
కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు నాన్ లోకల్... కేసీఆర్ అనే ముఖానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు బొమ్మ, బొరుసు లాంటి వాళ్లు... ఏనాడూ రైతులు, విద్యార్థులు, యువకులు, నిరుద్యోగుల, మహిళలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండలేదు. పరామర్శించలేదు..బీఆర్ఎస్ అభ్యర్ధి ఏనాడైనా రైతులను ఆదుకున్నడా? పంట నష్టపోతే సాయం చేయించారా? ఏ రోజైనా రైతుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల కోసం సీఎంకు లేఖ రాశారా? అధికారంలో ఉంటూ సాయమందించారా? కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులు దారి మళ్లిస్తే.. ఆర్వోబీ నిధులు ఇవ్వకపోతే ఏనాడైనా లేఖ రాశారా?
వినోద్ కుమార్ నాన్ లోకల్... మరి కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరు? లోకలా? నాన్ లోకలా?... చివరకు కాంగ్రెస్ క్యాడరే ఏం చెప్పాలో అర్ధం కాక కన్ ఫ్యూజన్‌లో ఉంది. ఎవరిని చూసి, ఏం చెప్పి ఓట్లు అడగాలో కూడా తెలియని గందరగోళంలో ఉన్నరు. వందల కోట్లు ఖర్చు పెట్టి టిక్కెట్ తెచ్చుకున్న కాంగ్రెస్ అభ్యర్ధి ఏనాడైనా పార్టీ జెండాలు పట్టుకుని మీ పక్షాన పోరాడారా? జనం కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా? బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలారా... మీరు కష్టాల్లో ఉంటే మీ అభ్యర్థులు ఎన్నడైనా అండగా నిలిచి సాయం చేశారా?... కష్టాల్లో ఉండి మీరు వస్తే నేను నాకు తోచినంత సాయం చేశానా? లేదా? ఆత్మపరిశీలన చేసుకోండి.
ఇండియన్ పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) టీంలో బీజేపీకి మోదీ కెప్టెన్. ఆ టీంలో మేమంతా సభ్యులుగా వస్తున్నాం. మరి కాంగ్రెస్ టీంకు ఎవరు కెప్టెన్ ఎవరు? కెప్టెన్ లేకుండా బరిలో దిగుతున్న టీంను పట్టించుకునేదెవరు? ఇక్కడున్న మంత్రి ఏం మాట్లాడతారో ఎవరికీ అర్ధం కాదు.. మాట్లాడితే తన్నుడు..గుద్దుడు... వెధవ అంటూ తిట్టడం తప్ప సాధించేదేమీ లేదు...
ఈ దేశానికి మోదీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తుకు తెచ్చుకోండి. మోదీని బలపర్చేందుకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చేతులెత్తిన నమస్కరిస్తున్నాను అన్నారు.
జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ... "బండి సంజయ్‌ను భారీ మెజారిటీతో గెలిపించండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను చూసిన తరువాత సంజయ్ ఇక ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు. మీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి.. రాష్ట్రమంతా తిరిగి ఎన్నికల ప్రచారం చేయాలని కోరుతున్నా. 400 సీట్లతో మోదీ ప్రధాని కాబోతున్నరు. అసలు కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి? 6 గ్యారంటీలను అమలు చేశారా? ఇచ్చిన మాట తప్పిన మీకెందుకు ఓటేయాలి?
కేసీఆర్.. ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతున్నవ్? ఏం చేసినవని ఓటేయాలి? నీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను సిగ్గులేకుండా కాంగ్రెస్ లోకి పంపి రాజకీయం చేస్తున్నవ్? కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే.. నాణేనికి బొమ్మ బొరుసులాంటివి. తెలంగాణలో 17కు 17 సీట్లు గెలవబోతున్నం. తెలంగాణ ప్రజల కోసం పోరాడి జైలుకు వెళ్లిన వ్యక్తి బండి సంజయ్. మీ కోసం జైలుకు వెళ్లిన నాయకుడు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల్లో ఎవరు బెటరో ఆలోచించండి. ఆ రెండు పార్టీలు ఎన్నడైనా పోరాటం చేశారా? బీఆర్ఎస్ అభ్యర్ధి దోచుకోవడం తప్ప చేసిందేమిటి? బండి సంజయ్ ను భారీ మెజారిటీతో గెలిపించి మోదీకి బహుమతిగా అందించండి.