
Karimnagar బస్టాండ్ లో పుట్టిన చిన్నారికి జీవిత కాలం ఉచిత బస్ పాస్ అందించిన సజ్జనార్
Telangana RTC MD Sajjanar | కరీంనగర్ బస్టాండ్ లో జన్మించిన చిన్నారికి తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. జీవితకాలం ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికిగానూ బస్ పాస్ అందించారు ఎండీ సజ్జనార్.

TGSRTC to give lifetime free bus pass | హైదరాబాద్: ఇటీవల ఓ తల్లి పురిటినొప్పులతో కరీంనగర్ బస్టాండ్ లో ఓ చిన్నారికి జన్మనివ్వడం తెలిసిందే. ఆ చిన్నారికి ఆర్టీసీ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఆ చిన్నారికి లైఫ్ టైమ్ ఉచిత బస్ పాస్ ను అందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) బుధవారం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్టాండ్లలలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్ ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం నిర్ణయించింది. ఆ మేరకు ఈ ఆడపిల్లకు బర్త్ డే గిప్ట్ (Birthday Gift) గా రాష్ట్ర ఆర్టీసీ లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్ ను మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది.
కరీంనగర్ బస్టాండ్ లో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి కాన్పు చేసి మానవత్వం చాటిన తమ సిబ్బందిని టీజీఎస్ఆర్టీసీ (TGSRTC ) యాజమాన్యం బుధవారం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్ లో సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ బుధవారం వారిని ఘనంగా సన్మానించారు.
అసలేం జరిగిందంటే..
ఆదివారం (జూన్ 16న) కూమారి అనే గర్భిణీ భద్రాచలం వెళ్లేందుకు తన భర్తతో కలిసి కరీంనగర్ బస్ స్టేషన్ కు వచ్చారు. బస్ కోసం ఎదురుచూస్తున్న ఆమెకు అంతలోనే నొప్పులు ఎక్కువయ్యాయి. ఇది గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే 108 కాల్ చేసి గర్భిణీ గురించి సమాచారం ఇచ్చారు. ఆమెకు నొప్పులు ఎక్కువ కావడంతో ఆర్టీసీ మహిళా సిబ్బంది సాయం చేశారు. చీరలను అడ్డుపెట్టి కాన్పు చేశారు. నార్మల్ డెలివరీ చేయగా కుమారికికి ఓ ఆడపిల్ల పుట్టింది. అంబులెన్స్ లో తల్లీబిడ్డను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిని పరీక్షించిన వైద్యులు తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.
సకాలంలో స్పందించిన ఆర్టీసీ సిబ్బందిపై సజ్జనార్ ప్రశంసలు
సకాలంలో సమయస్పూర్తితో వ్యవహారించి గర్బిణీకి కాన్పు చేసిన ఆర్టీసీ సిబ్బంది సైదమ్మ, లావణ్య, భవాని, రేణుక, స్రవంతి, రజనీ కృష్ణ, అంజయ్య సేవలను ఎండీ వీసీ సజ్జనార్ మెచ్చుకున్నారు. ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చడంతో పాటు ఆపద సమయంలో సేవాతర్పరతను సైతం ఆర్టీసీ సిబ్బంది చాటడం గొప్ప విషయమన్నారు. సకాలంలో స్పందించి గర్భిణీకి అండగా నిలిచి కాన్పు చేసి, భరోసా కల్పిస్తుండటాన్ని ప్రశంసించారు. ఆర్టీసీ సిబ్బందికి సన్మాన కార్యక్రమంలో టీజీఎస్ ఆర్టీసీ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వ రావు, చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఉషారాణి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

