Bandi Sanjay : బండి సంజయ్ కనబడటం లేదు, సిరిసిల్ల టీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన
Bandi Sanjay : ఎంపీ బండి సంజయ్ కనబడటం లేదని కరీంనగర్ లో ఫ్లెక్సీలు వెలిశాయి. సిరిసిల్లలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ వినూత్న నిరసన చేపట్టారు.
Bandi Sanjay : ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కనబడటం లేదని టీఆర్ఎస్ సిరిసిల్ల టౌన్ యూత్ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. టీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సుంకపాక మనోజ్ మాట్లాడుతూ తెలుగు భాషకే తెలుగు నేర్పిన జ్ఞాన సంపన్నులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అంటే చాలా అభిమానమని, తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల గ్రామ పంచాయతీలు చేసిన గొప్ప వ్యక్తి బండి సంజయ్ అని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా అంబేడ్కర్ వర్ధంతి మంచి దినం అంటూ మాట్లాడిన బండి సంజయ్ గారంటే చాలా అభిమానమన్నారు. నాన్న ఏమి చేస్తారని బండి సంజయ్ ను అడిగితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో టీచర్ గా రిటైర్ అయ్యారని చెప్పినందుకు అభిమానిస్తామంటూ వ్యంగంగా మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు బండి సంజయ్ జ్ఞాన సంపదను చెప్పుకోవచ్చని, కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా గెలిచి 3 సంవత్సరాలవుతున్నా ఇక్కడి సమస్యలు గాలికి వదిలేసి ప్రజా సంగ్రామ యాత్ర అంటూ తిరుగుతున్నారని విమర్శించారు.
ప్రజాయాత్రలో ప్రజల సమస్యలు వినడం వరకే
సంగ్రామ యాత్ర చేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ సంగ్రామ యాత్రలో మాట్లాడుతున్న విషయాలు ఏమిటంటే ఎండలో నడిచినా గుండు మండుతుందనీ, కాళ్లు నొస్తున్నాయని, చేతులు గుంజుతున్నాయి, నడుం నొస్తుంది చెమటలు కారుతున్నాయని మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ప్రజాయాత్రలో ప్రజల సమస్యలు వినడం వరకే బండి సంజయ్ బాధ్యతగా ఉందని వాటికి పరిష్కారం చూపడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో కేంద్రం నిధులు ఉన్నాయని చెప్పడం, ఆధారాలు అడిగితే, ఇవాళ ఏ వారం అడగడం చేస్తున్నారని, నిజంగా కేంద్ర ప్రభుత్వ నిధులు ఉంటే బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో ఈ పథకాలు ఏవి అని అడుగుతున్నామని ప్రశ్నించారు.
సిరిసిల్లలో పోటీ చేస్తే
ఈ ప్రశ్నలకు బండి సంజయ్ సమాధానం ఎప్పుడు చెబుతారో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ నేతలు. సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా కేటీఆర్ ఉన్నందుకు సిరిసిల్ల ప్రజలు సిగ్గు పడుతున్నారని మాట్లాడని బండి సంజయ్ వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి పోటీ చేయాలని అప్పుడు ఎవరు సిగ్గు పడేలా ప్రజలు తీర్పునిస్తారో చూద్దామన్నారు. మొన్నటి చేనేత సమ్మెకు మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని పరిష్కారం చూపారని దాన్ని కూడా బండి సంజయ్ తన ఖాతాలో వేసుకున్నారని తెలిపారు.