Petrol Pump Fraud: హుస్నాబాద్ హెచ్ పీ పెట్రోల్ బంక్ లో మోసాలు - లీటర్ కు బదులుగా అరలీటరే!
Petrol Pump Fraud: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పెట్రోల్ బంక్ సిబ్బంది మోసాలకు పాల్పడుతోంది. ఓ వ్యక్తి వద్ద నుంచి లీటర్ పెట్రోల్ కోసం డబ్బులు తీసుకొని కేవలం అర లీటర్ మాత్రమే పెట్రోల్ కొట్టారు.
Petrol Pump Fraud: ఓ వ్యక్తి తన బైకులో పెట్రోల్ అయిపోగానే కనిపించిన పెట్రోల్ బంక్ వద్ద ఆగి.. లీటర్ పెట్రోల్ కొట్టించుకున్నాడు. కానీ కొంత దూరం వెళ్లగానే బండి ఆగిపోయింది. దీంతో దాన్ని నెట్టుకుంటూ మళ్లీ వెనక్కి వచ్చాడు. ఈసారి ఓ బాటిల్ లో లీటర్ పెట్రోల్ కొట్టమని చెప్పగా.. అరలీటర్ కంటే తెక్కువ పోశారు. విషయం గుర్తించి సదరు యువకుడు వారితో గొడవకు దిగాడు.
అసలీ ఘటన ఎక్కడ జరిగిందంటే..?
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని సిద్దిపేట రోడ్ లో గల హెచ్పీ పెట్రోల్ బంకులో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో పెట్రోల్ పోయించుకున్న ద్విచక్ర వాహనదారుడు పెట్రోల్ బంక్ నిర్వాహకులను నిలదీశాడు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో పెట్రోల్ బంక్ లోనే పెట్రోల్ బాటిళ్లతో కూర్చొని నిరసన వ్యక్తం చేశాడు. రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా వారు పెట్రోల్ బంక్ వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు. పెట్రోల్ బంకును సీజ్ చేశారు.
అనుమానం వచ్చి మూడు బాటిళ్లలో మూడు లీటర్ల పెట్రోల్ చొప్పున పెట్రోల్ పోయించుకోగా అందులో ఒక్క బాటిల్ లో మాత్రమే సరిగా పెట్రోల్ పోశారని, దీని విషయమై పెట్రోల్ బంకు నిర్వాహకులను నిలదీస్తే సరైన సమాధానం ఇవ్వలేదని బాధిత ద్విచక్ర వాహనదారుడు వాపోయాడు. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపాడు.
గతేడాది నవంబర్ లో పెట్రోల్ లో నీళ్లు..
తెలంగాణలో పలుచోట్ల పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు ఆందోళనకు దిగారు. పెట్రోల్, డీజిల్ తో పాటు నీళ్లు కలిసి వస్తున్నాయని, వాటి వల్ల తమ వాహనాలు మధ్యలోనే ఆగిపోతున్నాయని ఆరోపిస్తున్నారు. లీటర్ సూర్యాపేటలోని జనగాం క్రాస్ రోడ్డులోని దుర్గాభవాని పెట్రోల్ బంక్ వద్ద ఆందోళనకు దిగారు. నీళ్లు కలిసిన పెట్రోల్ ను బాటిల్స్ లో చూపించారు. నరేష్ అనే వ్యక్తి 100 రూపాయల పెట్రోల్ కొట్టించుకుని కాస్త దూరం వెళ్లాక.. బండి ఆగిపోయి మళ్లీ స్టార్ట్ కాలేదు. ట్యాంక్ లోని పెట్రోల్ తీసి బాటిల్ లో పోసి చూస్తే నీళ్లు కనిపించాయి. వెంటనే దుర్గాభవాని పెట్రోల్ బంక్ కు వెళ్లి సిబ్బందిని నిలదీశారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ సమీపంలోని నయారా పెట్రోల్ బంకులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఎన్టీఆర్ చౌక్ లోని పెట్రోల్ కొట్టించుకున్న వారి వాహనాలు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. వారు కూడా బంక్ వద్ద ఆందోళన చేశారు.
పెట్రోల్‌లో నిమ్మకాయ రసం, రంగు నీళ్లు వస్తున్నాయని వాహనదారులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన సూర్యాపేట పురపాలిక పరిధిలోని జనగాం క్రాస్‌రోడ్డులో ఉన్న దుర్గా భవాని పెట్రోల్ బంక్ వద్ద శనివారం జరిగింది. బాటిల్, బకెట్‌లో పట్టించి చూడగా బకెట్‌ల కొద్ది నీటిలో కొద్దికొద్దిగా పెట్రోల్, డీజిల్ కలిసి రావడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలెంల గ్రామానికి చెందిన తంతెనపల్లి నరేష్ రూ.100 పెట్రోల్ తన బైక్‌లో కొట్టించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తిని కలిసేందుకు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి రావడానికి ఎంత ప్రయత్నించినా బైక్ స్టార్ట్ కాలేదు.