Karimnagar: కరీంనగర్‌లో ఫుట్ పాత్ ఆక్రమణలకు అడ్డేది? మరోసారి చర్యలకు సిద్ధమవుతున్న అధికారులు
ఘోర ప్రమాదం జరిగి నాలుగు నెలలు గడిచాయో లేదో అన్నీ మరిచి మొదటికి వచ్చిన పరిస్థితి. అందుకే అధికారులు ఫుట్‌పాత్‌లపై దృష్టి పెట్టారు.
జనవరి 31న కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం కమాన్ నుంచి మానేర్ డ్యామ్ బ్రిడ్జి వైపు వెళ్లే దారిలో ఓ ముగ్గురు మైనర్లు యమా స్పీడ్‌గా డ్రైవింగ్ చేస్తూ బీభత్సం సృష్టించారు.
క్రెటా కార్‌లో స్పీడ్‌గా వెళ్తూ వాహనాన్ని అదుపు చేయలేకపోయారు. అంతే క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. అక్కడ ఫుట్‌పాత్‌పై రోజువారీ పనులు చేసుకునేందుకు సిద్ధమైన మహిళలపైకి దూసుకెళ్లిందా కారు. ఉదయం 6.45 గంటలకు కంట్రోల్ లేని స్పీడ్‌తో వచ్చిన కారు ఓ యువతి సహా మరో ముగ్గురు మహిళల ప్రాణాలు తీసుకుంది. ఒక మహిళని ఈడ్చుకుంటూ వెళ్లిన కారు బలంగా పోల్‌ని ఢీ కొట్టింది. దుర్ఘటనలో ఆ మహిళ కాలు తెగిపోయింది. ఆమె శరీరం రెండు ముక్కలైంది.
ఇంత ఘోరమైన ప్రమాదం జరిగిన వెంటనే అటు పోలీసులు ఇటు ఇతర అధికార యంత్రాంగం స్పందించింది. ప్రమాదానికి కారణమైన యువకులు అక్కడి నుంచి పారిపోవడంతో వారిని గాలించి మరీ అరెస్టు చేశారు పోలీసులు. ముఖ్య కారకుడు అయిన అబ్బాయి తండ్రిని కూడా అరెస్టు చేశారు.
అక్కడితో ఆగిపోలేదు అధికారులు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు మొదలు పెట్టారు. ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కలెక్టర్ సహా ఇతర అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని సంకల్పించారు. ఇక వెంటనే ప్రారంభమైంది హడావుడి. పట్టణంలోని ఫుట్‌పాత్‌లపై అక్రమ కట్టడాలను కూల్చివేసే ప్రక్రియ మొదలు పెట్టారు. కట్టడాలే కాదు ఫుడ్ స్టాల్, చిరు వ్యాపారాలను కూడా అక్కడి నుంచి పంపించేశారు. కార్పొరేషన్ సిబ్బంది ఒక జట్టుగా ఏర్పడి మరీ ఆక్రమణలను తొలగించారు. అడ్డు వచ్చిన వారిపై కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడలేదు.
అదే పంథా నేటికీ కొనసాగి ఉంటే ఇదో పాజిటివ్ స్టోరీ అయ్యేది. కానీ నాలుగు నెలలు గడిచాయో లేదో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. తిరిగి కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో ఆక్రమణలు వెలిశాయి. దీంతో మళ్లీ ఇలాంటి ఘోర ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది.
పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో ఎనిమిది టీమ్‌లను ఏర్పాటు చేశామని. ఒక్కో రోజు ఒక్కో టీం ముగ్గురు సభ్యులతో బృందంగా ఏర్పడి ప్రతిరోజు పగలూ రాత్రి తనిఖీలు చేస్తూ ఉండాలని ఆదేశించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లైతే వారిని బస్టాండ్, ఇందిరా నగర్, రామ్ నగర్, సప్తగిరి కాలనీ, హౌసింగ్ బోర్డ్, చైతన్యపురి మార్కెట్లకు తరలించాలని ఆదేశించారు.
ఒకవైపు అధికారులు ఎన్ని రకాల చర్యలు చేపడుతున్నా కొందరు వ్యక్తుల్లో మార్పులు రావడం లేదు. రోడ్లను ఆక్రమించి ఫుట్‌పాత్‌పై అడ్డం పెట్టి మరీ ప్రమాదాలకు కారణమవుతున్నారు. అందుకే ఆదేశాలకు పరిమితం కాకుండా ఆచరణలో చూపించాలని ప్రజలు కోరుతున్నారు. అప్పుడే అనుకున్న ఫలితాలు వస్తాయంటున్నారు.