MP Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు చేదు అనుభవం - వాహనాల అద్దాలు ధ్వంసం
MP Dharmapuri Arvind Attacked: గోదావరి పరివాహక గ్రామం కావడంతో గ్రామాలను పరిశిలించేందుకు ఎంపీ అరవింద్ వెళ్లారు. ఎర్దండి గ్రామస్తులు ఆయనను అడ్డుకోవడంతో పాటు కాన్వాయ్ వాహనాల అద్వాలు ధ్వంసం చేశారు.
![MP Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు చేదు అనుభవం - వాహనాల అద్దాలు ధ్వంసం Nizababad MP Dharmapuri Arvind stopped at erdandi village Jagityala District MP Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు చేదు అనుభవం - వాహనాల అద్దాలు ధ్వంసం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/15/9b3763b77a897f3858ae4f23524629451657872936_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
BJP MP Dharmapuri Arvind: జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినా బ్రిడ్జి కట్ట లేదంటూ గ్రామస్తుల నిరసన తెలిపారు. అంతటితో ఆగకుండా ఎంపీ కాన్వాయ్ లోని వాహనాలపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేయడం కలకలం రేపింది.
హామీలపై నిలదీసి, ఎంపీపై ఆగ్రహం..
గోదావరి పరివాహక గ్రామం కావడంతో గ్రామాలను పరిశిలించేందుకు ఎంపీ అరవింద్ వెళ్లారు. అయితే జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామస్తులు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ని అడ్డుకున్నారు. గ్రామానికి సంబంధించి భూ వివాదం పరిష్కరించలేదని, ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చారంటూ ఎంపీని నిలదీయడంతో చేదు అనుభవం ఎదురైంది. ఎంపీ గా గెలిపిస్తే గ్రామంలో బ్రిడ్జి కట్టిస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ, మల్లన్న గుట్ట సమస్య పరిష్కారం చేస్తానన్న హామీ ఎందుకు అమలు చేయలేదని గ్రామస్తులు ఎంపీ అరవింద్‌ను గట్టిగానే నిలదీశారు. ఎంపీ అరవింద్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అంతటితో శాంతించని గ్రామస్తులు ఆయన వెంట వచ్చిన కాన్వాయ్ లోని రెండు వాహనాలపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు.
శాంతించని గ్రామస్తులు..
ఎర్ధండి గ్రామస్తులు ఎన్నికలకు ముందు ధర్మపురి అరవింద్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి బీజేపీ నేత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. గ్రామస్తులు ముందుకు వెళ్లడానికి ఒప్పుకోకపోవడంతో చేసేదేమీ లేక తన అనుచరులతో కలిసి ధర్మపురి అరవింద్ కాన్వాయ్‌తో తిరుగు ప్రయాణమయ్యారు. అయినా గ్రామస్తులు శాంతించలేదు. ఎంపీ అరవింద్ గో బ్యాక్ అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ కాన్వాయ్ ను ముట్టడించారు. ఆపై కాన్వాయ్ వాహనాలపై దాడికి పాల్పడి వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. రెండు వాహనాల అద్దాలు ధ్వంసం చేసినట్లు సమాచారం. తాము అడ్డుకున్నా పోలీసుల సహాయంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో గ్రామస్తులు ఆవేశానికి లోనై ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డట్లు చెబుతున్నారు. బీజేపీ కార్యకర్తలు తమపై దాడికి పాల్పడ్డారని ఎర్ధండి గ్రామస్తులు సైతం ఎంపీ అనుచరులపై ఆరోపణలు చేశారు.
భౌతిక దాడులకు తెగబడటం సిగ్గు చేటు: బండి సంజయ్
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ‘ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత వైఖరిని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక భౌతిక దాడులకు తెగబడటం సిగ్గు చేటు. ఇది ముమ్మాటికీ పిరికిపంద చర్య అన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా టీఆర్ఎస్ దుశ్చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. సీఎం కేసీఆర్ పాలనను, టీఆర్ఎస్ నేతల తీరును ప్రజల అసహ్యించుకుంటున్నారు. అయినా వారిలో మార్పు రాకపోగా ప్రశ్నించే వారిపై భౌతిక దాడులకు తెగబడటం వారి అవివేకానికి నిదర్శనం. టీఆర్ఎస్ నేతల బెదిరింపులకు, దాడులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రజా సమస్యలపై నిలదీస్తూనే ఉంటాం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరును కొనసాగిస్తూనే ఉంటామని’ బండి సంజయ్ అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)