Munugode Bypolls 2022: దూకుడు పెంచుతున్న పార్టీలు - మునుగోడు ఉప ఎన్నికలో కరీంనగర్ నేతల ప్రచార హోరు
Munugode ByElections: స్వయంగా హుజురాబాద్ అభ్యర్థిగా ఉప ఎన్నికను ఎదుర్కొన్న ఈటలకి తన అనుభవంతో మునుగోడులో బీజేపీని గట్టెక్కించాలని ప్లాన్‌లో ఉన్నారు.
Munugode ByElections 2022: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అన్ని పార్టీలకు చెందిన కీలక నేతలు మునుగోడు ఉప ఎన్నికల (Munugode Bypolls 2022)ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీజేపీ నుంచి కీలక నేతలైన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ దాదాపుగా నెలరోజులుగా మునుగోడులో గల్లి గల్లీకి తిరుగుతూ లోకల్ లీడర్లతో కనెక్ట్ అవుతున్నారు. పార్టీ చేరికల కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆయన అక్కడ ఇతర పార్టీల నాయకులను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు. స్వయంగా హుజురాబాద్ అభ్యర్థిగా ఉప ఎన్నికను ఎదుర్కొన్న ఈటలకి తన అనుభవంతో మునుగోడులో బీజేపీని గట్టెక్కించాలని ప్లాన్‌లో ఉన్నారు. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తన పాదయాత్రను మానుకొని మరీ మునుగోడు బై పోల్స్‌పై దృష్టి సారించారు. ఇప్పటికే పలుమార్లు కేంద్ర కార్యాలయంలో నేతలతో వ్యూహాలపై చర్చించిన బండి ఈనెల 10వ తారీఖు నుంచి మునుగోడులో ప్రచారానికి వెళ్తారని పార్టీ శ్రేణుల సమాచారం. ఇక జిల్లాకే చెందిన వివేక్ వెంకటస్వామి సైతం అక్కడ సమన్వయ కమిటీ బాధ్యతలు చూస్తున్నారు.
టీఆర్ఎస్ నేతల పరిస్థితి ఇది...
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చండూరు మండలం చౌటుప్పల్ ఎంపిటిసి ప్రాంత బాధ్యతల్ని తీసుకున్నారు. మరోవైపు ఇతర మంత్రులైన గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సైతం పలు గ్రామాల పర్యవేక్షణని స్వయంగా నిర్వహిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో చేసిన తప్పుల్ని రిపీట్ కాకుండా పార్టీ విజయమే లక్ష్యంగా ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పాడి కౌశిక్ రెడ్డి... ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, రసమయి బాలకిషన్, డాక్టర్ సంజయ్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, వొడితెల సతీష్ కుమార్, దాసరి మనోహర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావులను మునుగోడు ప్రాంతంలో మోహరించారు. స్థానికంగా ఉన్న నేతలతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ ఇప్పటికే పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉద్యమనేత కావడంతో విజయం తమనే వరిస్తుందని గులాబీ శ్రేణులు దీమాగా ఉన్నాయి.
సీటు నిలుపుకునేందుకు కాంగ్రెస్
కాంగ్రెస్ పరిస్థితి చూస్తే ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అక్కడ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు తమ నేత రాహుల్ గాంధీ సైతం సరిగా ఎన్నికల సమయంలోనే భారత్ జోడో యాత్రలో భాగంగా మునుగోడు ప్రాంతంలో పాదయాత్ర రానుండడంతో దానికి సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతలు సైతం అప్పగించారు. ఇక సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరిగూడెంలో ప్రచారంలో బిజీగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే విజయరమణా రావు సైతం స్థానిక నేతలు కార్యకర్తలు కలుస్తూ కాంగ్రెస్ సీటుని మళ్లీ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు .
ఇక మునుగోడులో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిని బలపరుస్తున్న కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కి చెందిన రాష్ట్ర నాయకుడు చాడ వెంకటరెడ్డి సైతం కరీంనగర్ జిల్లా కావడం విశేషం. ఇలా జిల్లాకు చెందిన వివిధ పార్టీల నేతలు ఇక్కడే కాదు.. మునుగోడు లోనూ తమ వ్యూహాలకు పదును పెడుతూ పార్టీ అభ్యర్థి విజయం కోసం పాటుపడుతున్నారు. విజయం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.