Telangana Maoists: పెద్దపల్లి జిల్లాలో మావోయిస్టుల కలకలం, అగ్రనేత సంచారంపై అలజడి
పెద్దపల్లి జిల్లాలో మావోయిస్టుల కలకలం చెలరేగింది. ముఖ్యంగా వరుస ఎన్‌కౌంటర్లు, పోలీసుల కట్టిదిట్టమైన చర్యల తర్వాత మావోయిస్టులు కేవలం పేపర్ ప్రకటనలకు పరిమితమైనట్టుగా అందరూ భావిస్తూ వచ్చారు.
మావోయిస్టు అగ్ర నేత సంచారం ?
చాలా రోజుల తర్వాత మళ్లీ పెద్దపల్లి జిల్లాలో మావోయిస్టుల కలకలం చెలరేగింది. ముఖ్యంగా వరుస ఎన్‌కౌంటర్లు, పోలీసుల కట్టిదిట్టమైన చర్యల తర్వాత మావోయిస్టులు కేవలం పేపర్ ప్రకటనలకు పరిమితమైనట్టుగా అందరూ భావిస్తూ వచ్చారు. అయితే ఆకస్మికంగా మావోయిస్టు అగ్రనేత కంకణాల రాజిరెడ్డి తన యాక్షన్ టీంతో పెద్దపల్లిలో పర్యటించారనే సమాచారం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో అటు పోలీసుల్లో... ఇటు టార్గెట్లలో కలకలం రేపుతోంది.
మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మేడారపు ఆడెళ్ళు అలియాస్ భాస్కర్ యాక్షన్ కమిటీ సభ్యుడు మంగులు అలియాస్ పాండు ఆగస్టులో రాష్ట్రంలోనికి ప్రవేశించినట్లు నిఘవర్గాలు ధ్రువీకరించాయి. అయితే వారి కంటే సీనియర్ నేత అయిన కేంద్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ అలియాస్ ధర్మన్న పెద్దపల్లి జిల్లాకు వచ్చి వెళ్ళాడని పలు టార్గెట్లపై రెక్కీ కూడా నిర్వహించారని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు చెందిన కంకణాల రాజిరెడ్డి టార్గెట్లను ఫినిష్ చేయడంలో మావోయిస్టుల్లో ముఖ్యుడుగా ఉన్నారు. కొత్త దళ సభ్యులకు గెరిల్లా తంత్రంలో శిక్షణ ఇవ్వడం క్షణాల వ్యవధిలో ఆపరేషన్ పూర్తి చేసుకొని వెళ్లడం రాజిరెడ్డి ప్రత్యేకత. తనకి పెద్దపల్లి లోని ఎన్టీపీసీ, బసంత్ నగర్ పరిసరాల్లో ఇప్పటికీ పలువురు సానుభూతిపరులున్నట్లు పోలీసులు గతంలోనే గుర్తించారు. ఈ ప్రాంతానికి వచ్చిన రాజిరెడ్డి కాంట్రాక్టర్ల నుండి పెద్ద ఎత్తున నిధులు సేకరించాడని వార్తలు వస్తున్నాయి. దీంతో పోలీసులు కొరియర్లు ఇతర అనుమానితులపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టారు.
గత కొద్ది రోజులుగా మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా జిల్లాలోని శివారు గ్రామాల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు సైతం చేపట్టారు. ఆకస్మికంగా రోడ్లన్నీ బ్లాక్ చేస్తూనే వాహనదారులను ప్రశ్నిస్తున్నారు. అయితే రాజిరెడ్డి తన యాక్షన్ టీం తో వచ్చాడని... అందులో కొంచెం మనీష్ చెన్నూరి శ్రీను అలియాస్ హరీష్, రోషన్, నందు అలియాస్ వికాస్ ,కొవ్వాసి రాము లాంటి సభ్యులు ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అందరూ భయపడుతున్నారు .వారి గురించి సమాచారం అందిస్తే ఐదు లక్షల నగదు రివార్డ్ ఇస్తామని పోలీసులు ప్రకటించారు.
రామగుండం స్కామ్ నిందితులపై రెక్కీ?
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్ ఎఫ్ సి ఎల్ స్కామ్ లో ఇప్పటికే ఒక బాధితుడు ఆత్మహత్య చేసుకోగా మరో ఇద్దరు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసిన రాజకీయ నాయకుల అనుచరులు తిరిగి ఉద్యోగాల విషయంలో ఎలాంటి హామీ ఇవ్వకపోవడం పై కలకలం చెలరేగింది. అయితే అప్పట్లోనే వెంకటేష్ పేరుతో లేఖ విడుదల కావడం అది నకిలీ అంటూ ప్రచారం జరిగింది. మరోవైపు రెండేళ్ల కిందట అక్టోబర్ నెలలో ములుగు జిల్లాలోని ముసలమ్మ గుట్టలో కొత్తగా వచ్చిన యువకులకు శిక్షణ ఇస్తున్న రాజిరెడ్డి టీంకి అటుగా వచ్చిన కూంబింగ్ పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్న రాజిరెడ్డి తిరిగి రెండేళ్ల తర్వాత స్థానికంగా తిరుగుతున్నాడు అంటూ ప్రచారం జరగడంతో దానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యంగా RFCL కుంభకోణంలో ఉన్న నిందితుల పై ఇప్పటికే రెక్కీ పూర్తి చేసి యాక్షన్ కి దిగాలని ప్లాన్ చేస్తున్నారని ఒక అంచనాకి వస్తున్నారు.
ఇది నిజమేనా?
మరోవైపు మావోయిస్టు నేతల కార్యకలాపాలను పరిశీలిస్తే గతంలోనే రాజిరెడ్డి అనారోగ్యానికి గురై దాదాపుగా కొద్ది నెలలపాటు ఇలాంటి రిస్క్ ప్రయత్నాలకు దిగనట్లు తెలుస్తోంది. కట్టుదిట్టమైన చర్యలతో ఇప్పటికే ఇన్ ఫార్మర్ వ్యవస్థని పటిష్టం చేసుకున్న పోలీసులకు రాజిరెడ్డి మూమెంట్స్ ఎప్పటికప్పుడు అందే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో పూర్తిగా పారిశ్రామిక నగరంగా పేరున రామగుండంలోకి స్వేచ్ఛగా వచ్చే అవకాశం దాదాపుగా లేదు.అయితే కొత్తగా రిక్రూట్ అయిన యువకుల్లో ఎవరినైనా యాక్షన్ కోసం రాజిరెడ్డి నియమించి ఉంటాడనే ప్రచారం కూడా జరుగుతోంది. కోల్పోయిన పట్టుని ఒక సంచలన సంఘటన ద్వారా తిరిగి తెచ్చుకోవాలని మావోయిస్టు అగ్ర నేతలు భావిస్తున్నట్లు ఈ ప్రచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే పోలీసులు కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ మాత్రం పారిశ్రామిక ప్రాంతంలో నెలకొని ఉంది.