Telangana Flash Floods : ఒడిశాలో తీరం దాటిన అల్పపీడనం- తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్
Telangana Flash Floods : తెలంగాణపై అల్పపీడన ప్రభావం గట్టిగానే ఉంది. దీని ప్రభావంతో పది జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులను, ప్రభుత్వాన్ని, ప్రజలను అప్రమత్తం చేసింది.

Telangana Flash Floods : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడుతోంది. బలహీన పడిన అల్పపీడనం ఒడిశాలో తీరం దాటింది. ఈ అల్పపీడన ప్రభావం గురువారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌పై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కొన్ని జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ ఉంటాయని హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
అల్పపీడనం తీరం దాటినా బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి బలైన గాలులు వీస్తున్నాయని అధికారులు వెల్లడించారు. వీటి ప్రభావంతో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోనున్నాయి. గాలుల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడింది. కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో వరదలు ముంచెత్తబోతున్నాయని అంటున్నారు.
తెలంగాణలో 10 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, కామారెడ్డి, కొమురంభీం, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మిగతా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని చెబుతున్నారు. దాదాపు 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు.
ఇప్పటికే పలు జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు వంకలు తెగిపడ్డాయి. ఊళ్లపైకి నీరు చేరింది. ములుగు జిల్లా పసర నుంచి తాడ్వాయి మధ్యలో మండల తోగు వద్ద జలగలంచ వాగు ఉదృతంగా రోడ్డు మీద నుంచి ప్రవహిస్తుంది. ఎస్పి అట్టివాగును సందర్శించి ఇరువైపులా వరద ఉద్ధృతి తగ్గే వరకు వాహనాల రాకపోకలను నిషేధించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అవ్వడంతో ఆదిలాబాద్ నుంచి వయా కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలను డైవర్ట్ చేశారు. నిర్మల్ వద్ద ఉన్న కొండాపూర్ బ్రిడ్జి నుంచి ఎడమ వైపుకి వెళ్లి కొండాపూర్ నుంచి వయా మామడ,ఖానాపూర్ మెట్ పల్లి,జగిత్యాల్, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వెళ్లాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జి జానకి షర్మిల తెలియజేశారు.
రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క ఉన్నారు. వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయటంతోపాటు తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క అక్కడ పర్యటిస్తారు. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తున్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్తారు. ప్రజలకు అందుతున్న అత్యవసర సేవలపై సమీక్ష నిర్వహిస్తారు. వారిలో భరోసా నింపేలా చర్యలు తీసుకుంటారు. ఇంతలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.
" ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టి, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. జలమయమైన గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ, వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తోంది. అధికార యంత్రాంగం మొత్తం 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రాణ, ఆస్థి నష్టం జరక్కుండా చర్యలు తీసుకుంది. SDRF, NDRF, అగ్నిమాపక పోలీస్ టీంలు ఇప్పటికే రంగంలో దిగాయి. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసేలా ఆదేశాలు జారీ చేశాం." అని అన్నారు.





















