Telangana Heavy Rains: తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు- ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్, స్కూళ్లకు సెలవులు
Telangana Heavy Rains: నాలుగు రోజుల పాటు తెలంగాణలో జోరువానలు కురుస్తాయి. నాలుగు జిల్లాల్లో మాత్రం ఆకాశం చిల్లుపడిందా అన్నట్టు వానలు పడతాయి.

Telangana Heavy Rains:తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు ఇదే వాతావరణం కంటిన్యూ అవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గురువారం నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో పడతాయని చెబుతున్నారు. ఈ హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల్లోని జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది.
తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో జోరు వానలు పడతాయి. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి . ఆ ఆరెంజ్ జోన్‌లో ఉన్న జిల్లాలు- జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, రాజన్నసిరిసిల్ల, ఆదిలాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో అక్కడక్కడ కుండపోత వర్షాలు ఖాయమని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాలు- మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట,రంగారెడ్డి, హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ ఉరుములు మెరుపులు, ఈదురులగాలులతో కూడినవర్షాలు పడతాయి. ఈ జిల్లాలతోపాటు శుక్రవారం నుంచి సోమవారం వరకు తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
IMPACT BASED HEAVY RAINFALL WARNING FOR DISTRICTS OF TELANGANA Warning-06 (RED)
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) August 27, 2025
DATE: 27-08-2025 TIME OF ISSUE: 2200 IST pic.twitter.com/wS7DZZel9Q
రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలకు ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాలు నీట మునిగాయి. గంటల వ్యవధిలోనే ఆ జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయ్యింది. నిర్మల్ రూరల్‌లో 275.8మిమీ, లక్ష్మణచాందలో కేవలం 4గంటల్లో 238.8మిమీ వర్షపాతం నమోదైంది. నిర్మల్ పట్టణంలో కూడా దాదాపు 150-200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
గురువారం కూడా నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అక్కడ అధికారులు అప్రమత్తమయ్యారు. నేరుగా మంత్రులే పరిస్థితులను సమీక్షిస్తున్నారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ముందు జాగ్రత్త కొన్ని జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్‌లు ఆదేశాలు చేశారు.
ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలకు చాలా ప్రాంతాల నీట మునిగాయి. రోడ్లు మాత్రమే కాదు రైల్వే ట్రాక్‌లు వరదలకు కొట్టుకుపోయాయి. కామారెడ్డి- నిజమాబాద్ మధ్య రైల్వే లైన్ పూర్తిగా ధ్వంసమైంది. వాగులు, వంకలు అన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. జలాశయాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు.





















