KTR Comments On Revanth Reddy: వరదలలో ప్రజల ప్రాణాలు పోతుంటే.. సీఎం రేవంత్ రెడ్డి నీరో చక్రవర్తిలా ఫిడేల్ వాయిస్తున్నారు : కేటీఆర్
భారీ వర్షాలు, వరదల ప్రభావంతో తెలంగాణలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నిరో చక్రవర్తిలా ఏం పట్టనట్లు ఫిడేల్ వాయిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు కేటీఆర్.

తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్ల, కామారెడ్డిలో వరద తీవ్రత ఎక్కువ ఉన్నచోట్ల బాధితులను పరామర్శించారు.భారీ వర్షాలతో సర్వం కోల్పోయిన ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు కేటీఆర్. తెలంగాణలో వరదల వల్ల ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబానికి 25 లక్షల రూపాయలు, పంట నష్టం జరిగితే ఎకరాకు 25 వేల పరిహారం ఇవ్వడంతో పాటు ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నారు. సిరిసిల్ల జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేటీఆర్, మానేరుకు లక్ష క్యూసెక్కుల వరద వస్తుంటే ప్రజలను అప్రమత్తం చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారి ప్రాణాలతో చెలగాటం ఆడిందని మండిపడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను తరలించాలన్న కనీస జ్ఞానం ప్రభుత్వానికి లేదని ఆరోపించారు.వరదలతో రాష్ట్రం అతలాకుతులమవుతుంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి సుందరీకరణ పై, ఇవాళ ఒలంపిక్స్ ఎలా తేవాలన్న అంశాలపై అధికారులతో రివ్యూ సమావేశాలు నిర్వహించడం దారుణం అన్నారు కేటీఆర్. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడెల్ వాయించినట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి వెంటనే హెలికాప్టర్లను పంపి వారి ప్రాణాలను కాపాడారని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వంలో ఇటీవల ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు ముగ్గురు మంత్రులు ఆ జిల్లా నుండి ఎన్నికై కూడా అక్కడికి హెలికాప్టర్ పంపలేక పోవడంతో అక్కడ ప్రాణ నష్టం సంభవించిందని తెలిపారు. ఇప్పుడు నర్మాలలో కూడా నేవీ హెలికాప్టర్లు వచ్చి వరదలో చిక్కుకున్న ఐదుగురిని సురక్షితంగా కాపాడాయన్నారు. మన రాష్ట్రానికి సంబంధించిన హెలికాప్టర్లు బీహార్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో తిరగడంతోనే సహాయ చర్యల్లో ఆలస్యం అవుతుందని ఆరోపించారు కేటీఆర్. వర్షాకాలం సందర్భంగా చేపట్టాల్సిన ముందస్దు చర్యలను ప్రభుత్వం పట్టించుకోలేదన్న కేటీఆర్, ఈ విపత్తును ముందే ఊహించడంలో ఘోరంగా విఫలం అయిందన్నారు. ప్రభుత్వ పెద్దలు మొద్దు నిద్రలో ఉన్నా అధికారులు మాత్రం 24 గంటలు అప్రమత్తంగా ఉండి ప్రాణ, ఆస్తి నష్టాలను సాధ్యమైనంత వరకు నివారించినందుకు అధికారులకు అభినందనలు తెలిపారు. మీడియా కూడా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించిందని ప్రశంసించారు. మరో నాలుగు రోజులపాటు వర్షాలు విస్తృతంగా కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రజలను ఆదుకోవాలన్నారు కేటీఆర్.
కేంద్రం కూడా స్పందించి రాష్ట్రానికి సహాయం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు తాగునీరు, ఆహారాన్ని అందిస్తున్నారని, త్వరలో పార్టీ తరపున వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు కేటీఆర్. అంతకుముందు సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం, మల్లారెడ్డిపేట బ్రిడ్జిపై నుంచి అప్పర్ మానేరు వరద ఉధృతిని పరిశీలించారు. కామరెడ్డి జిల్లాకు వెళ్లే మార్గమద్యంలో కామరెడ్డి జిల్లా మచారెడ్డి మండలం హైవేపైన ఉన్న పల్వంచ వాగు ఉధృతిని, తెగిన రోడ్డును కేటీఆర్ పరిశీలించారు.రోడ్డు తెగిపోవడం, వరద ఉధృతంగా బ్రిడ్జి పైనుంచి ప్రవహించడంతో కామారెడ్డికి వెళ్లడం సాధ్యం కాక అక్కడి నుండి తిరిగి సిరిసిల్లకు వెళ్లారు.






















