Kavitha Kalvakuntla: మానకొండూరులో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేయనున్న కవిత.. కారణం ఏంటంటే..
తెలంగాణ ఉద్యమకారుల కోసం కల్వకుంట్ల కవిత భూ పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు వేదికగా భూ పోరాటాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.

Land Agitation in Karimnagar | హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమకారులతో కలిసి వారికి ఇంటి స్థలాలు కేటాయించాలని పోరాటం చేయనుంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు వేదికగా కవిత భూ పోరాటాన్ని ప్రారంభించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేస్తున్నారు. ఈ హామీని అమలు చేయాల్సిందిగా డిసెంబర్ 9వ తేదీ వరకు గడువు ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె ప్రత్యక్ష పోరాటానికి దిగారు. కమ్యూనిస్ట్ పార్టీల శైలిలో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేయడం ద్వారా తమ ఉద్యమంలో భాగంగా నిరసనను దిగాలని నిర్ణయం తీసుకున్నారు.

ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణ
తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని మాజీ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కరీంనగర్‌లో మొదలైన ఈ భూ పోరాటాన్ని త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేయాలని కవిత భావిస్తున్నారు. ఉద్యమకారులకు దక్కాల్సిన ఇంటి స్థలాల హక్కు కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కవిత తెలిపారు. అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి స్థలం ఇచ్చే వరకు తెలంగాన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఈ సందర్భంగా ఆమె పునరుద్ఘాటించారు.

కవిత ఏమన్నారంటే..
కరీంనగర్ గడ్డ మీద ప్రారంభించిన ఏ ఉద్యమమైన విజయవంతమవుతుందని.. ఇప్పుడు ఇదే కరీంనగర్ నుండి నేడు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం కోసం చేపట్టిన ఉద్యమం కూడా విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ గడ్డ నుంచి ప్రారంభం అయిన పోరాటం... భవిష్యత్తులో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఉద్యమకారులను ఏకం చేసి పోరాటాన్ని ఉదృతం చేస్తామన్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలతో పాటు, ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు ఎత్తిన పిడికిలి దించకుండా పోరాడుతాం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేంతవరకు ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.






















