Fake Pregnancy: ఫేక్ ప్రెగ్నెన్సీతో భర్త, అత్తింటివారిని బోల్తా కొట్టించిన మహిళ.. ఎందుకో తెలిసి అవాక్కైన పోలీసులు
ఓ యువతికి పెళ్లికి ముందే ఓ ప్రియుడు ఉన్నాడు. కానీ, తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల కాదనలేక తనకు వచ్చిన ఒక సంబంధాన్ని బలవంతంగా పెళ్లి చేసుకుంది.
భర్తను, అత్తింటివారిని బోల్తా కొట్టించి ఓ వివాహిత చేసిన పని అందర్నీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఈమె చేసిన తీరుపై స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లి జరిగి అత్తారింటికి వెళ్లినా కూడా.. ప్రియుడ్ని మర్చిపోలేక, అతడితో గడిపేందుకు మహిళ ఆడిన నాటకం తాజాగా బయటికి వచ్చింది. ఆమె వేసిన మాస్టర్ ప్లాన్ ఏకంగా 9 నెలల తర్వాత బయటపడడంతో అదంతా ఫేక్ అని తెలిసి అంతా ముక్కున వేలేసుకున్నారు. అసలేం జరిగిందంటే..
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం బూజునూర్ గ్రామానికి చెందిన ఓ యువతికి పెళ్లికి ముందే ఓ ప్రియుడు ఉన్నాడు. ఏది ఏమైనా అతణ్నే పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ యువతి తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల కాదనలేక తనకు వచ్చిన ఒక సంబంధాన్ని ఒప్పుకొని పెళ్లి చేసుకుంది. ఇక కాపురం కోసం తన అత్తారింటికి వెళ్లి కొద్ది రోజుల పాటు ఉంది. అయినా పాత ప్రియుడిని మర్చిపోలేక కిలాడీ స్కెచ్ వేసింది. తన భర్త, అత్తమామలు సంతోషపడే విధంగా ఒక కొత్త కథ అల్లింది. అది ఏంటంటే.. తాను గర్భం దాల్చానని రెస్ట్ తీసుకోవడానికి పుట్టింటికి వెళ్తానని చెప్పింది. ఈ విషయాన్ని నమ్మించడానికి ఏకంగా ఫేక్ ఆస్పత్రి రిపోర్టులను సైతం తయారు చేయించింది. ఇవన్నీ చూసి నమ్మిన అమాయకుడైన భర్త.. తను సంబరపడిపోతూ ఆమెని స్వయంగా పుట్టింట్లో దిగబెట్టాడు.
అలా పుట్టింటికి వెళ్ళిన ఆ మహిళ తిరిగి తన పాత ప్రియుడితో కాంటాక్ట్ అయింది. ఇక్కడ భర్త, అత్తింటివారు తమ ఇంటికి బిడ్డ రాబోతోందనే భ్రమలోనే ఉన్నారు. తొమ్మిది నెలల తర్వాత పాపనో బాబో పుడుతుందని సంబరపడుతూ, తన భార్యను అత్తగారింటి నుండి తీసుకెళ్లి ఆసుపత్రిలో చూపించాలని వారిని సంప్రదించాడు. అయితే ఇక్కడే అసలు రహస్యం బయట పడింది. అసలు ఫోను ఎత్తకపోయేసరికి అనుమానం వచ్చిన ఆమె భర్త అత్త గారి ఇంటికి వెళ్ళాడు. తన ఇంటి నుండి ఎలా వచ్చిందో తొమ్మిది నెలల తర్వాత కూడా ఆమె శరీరంలో ఎలాంటి శారీరక మార్పులు లేవు. దీంతో బిక్కమొహం వేసిన సదరు భర్త.. నిలదీశాడు. అసలు ప్రెగ్నెన్సీ అనేది ఒక ఫేక్ అని అప్పుడు అర్థం చేసుకున్నాడు. తన ప్రియుడి కోసమే ఆమె నాటకం ఆడిందని బయటపడింది.
దీంతో ఆగ్రహించి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తన భార్యపై, మాజీ లవర్ పై కేసు పెట్టాడు. దాదాపు తొమ్మిది నెలల కాలం పాటు ఫేక్ ప్రెగ్నెన్సీ అని తమ కుటుంబాన్ని నమ్మించిందని ఫిర్యాదు చేశాడు. ఆస్పత్రి దొంగ రికార్డులు క్రియేట్ చేసి మరీ మోసం చేసిందని వివరించాడు. అయితే, అతని భార్య క్రిమినల్ మైండ్ చూసిన పోలీసు అధికారులకు దిమ్మతిరిగింది. ఆమెను పిలిపించి తిరిగి కాపురానికి పంపడానికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా అత్తారింటికి వెళ్లేది లేదని మొండికేసిన ఆ మహిళ తన మాజీ ప్రియుడితోనే ఉంటానంటూ కరాకండిగా చెప్పేసింది. చేసేదేమిలేక ఆ భర్త ఆమెను వదిలించుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలిసిన స్థానికులు మహిళ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ప్రగతిభవన్ వద్ద జేసీ దివాకర్ రెడ్డి హల్ చల్.. లోనికి వెళ్లే ప్రయత్నం.. వెనక్కి పంపేసిన పోలీసులు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి