Karimnagar News: విమర్శలపాలవుతున్న నేతల దూకుడు, తమకు తామే సమస్యలు తెచ్చుకుంటున్న లీడర్లు!
Karimnagar News: కరీంనగర్ జిల్లాలోని పలువురు రాజకీయ నేతలు దుందుడుకుగా వ్యవహరిస్తూ... తమ భవిష్యత్తును తామే నాశనం చేసుకుంటున్నారు. అయితే వాళ్లెవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
![Karimnagar News: విమర్శలపాలవుతున్న నేతల దూకుడు, తమకు తామే సమస్యలు తెచ్చుకుంటున్న లీడర్లు! Karimnagar Some Political Leaders Behaviour Create Problems Karimnagar News: విమర్శలపాలవుతున్న నేతల దూకుడు, తమకు తామే సమస్యలు తెచ్చుకుంటున్న లీడర్లు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/22/a45af0c3bb12b1cfbdffddd231f557b31669100133298519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Karimnagar News: రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయంటూ పలుమార్లు విశ్లేషకులు కామెంట్ చేస్తూ ఉంటారు. అంటే నేతలు వారికి వారుగా రాజకీయ భవిష్యత్తుని నాశనం చేసుకుంటారు తప్ప వారికంటూ వచ్చే సమస్యలు ఏవీ ఉండవనేది దాని అర్థం. ఉమ్మడి జిల్లాలోని ఇద్దరు నేతలు తీరు చూస్తే ఇది నిజమేమో అనిపిస్తుంది. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రభావితం చూపిస్తున్న సీనియర్ నేతల శైలి ఎంతో హుందాగా ఉంటే.. ఈ ఇద్దరు మాత్రం వారి దుందుడుకు శైలితో తమ రాజకీయ భవిష్యత్తుకి ప్రమాదాలను తెచ్చుకుంటున్నారు. ఒకసారి అనుభవం అయినా మళ్లీ అదే రకమైన వ్యవహార శైలితో తరచూ వివాదాల్లోకి దిగుతున్నారు.
రసమయి బాలకిషన్ రచ్చ రచ్చ...
ఉద్యమ సమయంలో అతనో గొప్ప జానపద గాయకుడు. లక్షల మంది ఉద్యమకారుల్లో తన పాటల ద్వారా చైతన్యం నింపినవారు. అదే లక్షణాలతో మానకొండూరు ఎమ్మెల్యేగా గెలుపొంది కీలకమైన సాంస్కృతిక సారథి చైర్మన్ గా ఎంపిక అయ్యారు. అయితే వరుస వివాదాలతో ప్రస్తుతం ప్రజల్లో చర్చనీయాంశం అవుతున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్ది రోజులకి ఓ సమావేశంలో ఏకంగా అప్పటి జిల్లా కలెక్టర్ తో తీవ్రమైన వాగ్వివాదానికి దిగారు. దానికి ఏమాత్రం బెదరని ఆ కలెక్టర్ సభాముఖంగానే రసమయిని హెచ్చరించారు. ప్రోటోకాల్ విషయంలో రగిలిన గొడవ ఎమ్మెల్యే వివాహార శైలితో చర్చనీయాంశమైంది. అక్కడ ఉన్న సీనియర్ నేతలు వారిస్తున్న రసమయి ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో ఆ వివాదం ప్రజల్లో సైతం చర్చలకు దారి తీసింది.
కొద్ది రోజులకే ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ యువ నేత తన అవినీతిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడంటూ అతనిని ఫోన్లో బెదిరించడం చివరికి ఆడియో కాస్త వైరల్ గా మారి రసమయికి బెడిసి కొట్టింది. ఎంత అవినీతికి పాల్పడినా ప్రతిపక్షాలు దీనిపై స్పందించొద్దా? అని వివిధ పార్టీల నేతలు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
హుజురాబాద్ ఉపఎన్నిక రాకముందు రసమయి టీఆర్ఎస్ అగ్ర నాయకత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారంటూ గుసగుసలు వినపడ్డాయి. దీంతో అసలు హుజురాబాద్ ఉపఎన్నికకు పక్కనే ఉన్న మానకొండూరు ఎమ్మెల్యే అయినా రసమయిని ప్రచారానికి పంపించలేదు. దీనికి రకరకాల కారణాలు చెప్పినా అసలు నిజం మాత్రం వేరేనంటూ చర్చ జరిగింది. ఇక రీసెంట్ గా జర్నలిస్టులపై వ్యాఖ్యలు చేయడంతో వారంతా నిరసనలకు దిగారు. ఓ పత్రికకు చెందిన విలేకరిని తొలగించాలంటూ యజమాన్యాన్ని కోరారని దీంతో అతని ఉద్యోగం పోయిందని జర్నలిస్టు సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యమకారుడని ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన జర్నలిస్టులను అవమానించడంతో రసమయి నియోజకవర్గంలో వరుస ధర్నాలకు దిగుతున్నాయి.
తొందరపడుతున్న పాడి కౌశిక్ రెడ్డి..
ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి కూడా వివాదాలేమీ కొత్తకాదు. ఆనాటి తెలంగాణ ఉద్యమ సమయంలో రాళ్లు రువ్విన పాడి కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ ఉపఎన్నికల ముందు తానే ఎమ్మెల్యే కాబోతున్నానంటూ మాట్లాడిన ఆడియో మొత్తానికి టికెట్ రాకుండా చేసింది. టీఆర్ఎస్ అగ్ర నాయకత్వం ఆశీర్వాదంతో ఎమ్మెల్సీ అయినప్పటికీ.. తరచూ వివాదాల్లో ఉండడంతోపాటు ఏకంగా కరీంనగర్ జడ్పీ చైర్మన్ ని స్టేజి మీద అవమానించడంతో ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ వీడియో వైరల్ కావడంతో పాడి కౌశిక్ రెడ్డి తీరు పట్ల దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో ఏ రకంగా పోటీ చేస్తారో చూస్తామంటూ సవాల్ విసురుతున్నాయి.
రాజకీయాల్లో వినయమే విజయానికి దగ్గర దారి... ఎంతో గొప్ప పదవులను నిర్వహించినప్పటికీ చాలామంది నాయకులు వ్యవహార శైలిలో సామాన్యంగానే ఉండేవారు. కానీ ఈ యువ నేతలు తమ రాజకీయ భవిష్యత్తుకు తామే గొయ్యి తవ్వుకుంటున్నారు..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)