Karimnagar: కరీంనగర్ జిల్లాలో పోలీసుల భారీ తప్పిదం.. ఇదే హాట్ టాపిక్, డీజీపీ వరకు వెళ్లిన వ్యవహారం
ఒకే స్టేషన్‌లో ఒకే నంబర్‌తో రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు కావడం పట్ల అనుమానం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారం డీజీపీ వరకూ వెళ్లింది.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఒక సంఘటన ఏకంగా నకిలీ ఎఫ్ఐఆర్ సృష్టించడానికి కారణమైంది. ఒకే స్టేషన్‌లో ఒకే నంబర్‌తో రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు కావడం పట్ల అనుమానం వ్యక్తమవుతోంది.
అసలేం జరిగిందంటే?
కరీంనగర్ జిల్లాలోని ఆరెపల్లికి చెందిన నల్లగోపు కళావతి- శ్రీనివాసరావు దంపతులు మనస్పర్థల కారణంగా విడిగా ఉంటున్నారు. తన పేరిట ఉన్న ఇంటిని తక్కువ ధరకే అమ్మడానికి సిద్ధమవగా రిజిస్ట్రేషన్ చేయడానికి శ్రీనివాసరావు అంగీకరించలేదు. కూతురు పెళ్లి కోసం తాను ఇప్పుడు అమ్మడం లేదని, పంచాయతీలో పదే పదే పెద్దమనుషుల సమక్షంలో చెప్పాడు.
ఇక్కడే పోలీసుల ఎంట్రీ..
అయితే కళావతి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిందో తెలీదు కానీ సదరు పోలీస్ స్టేషన్ నుండి శ్రీనివాస రావుకి తమ ముందు హాజరు కావాలంటూ కాల్ వచ్చింది. తనపై కేసు నమోదైందని, ఉదయం 11 గంటల సమయంలో సెక్షన్ 341, 323, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా ఉన్న ఎఫ్ఐఆర్ కాపీని పోలీసులు చూపారు. ఇక జైలుకు పంపడమే తరువాయి అంటున్నట్లుగా మాట్లాడారు. జైలు శిక్ష పడుతుందన్న భయంతో శ్రీనివాసరావు మరోసారి పెద్దమనుషుల సమక్షంలో కళావతి ఇల్లు అమ్ముకోవడానికి అంగీకరించాడు. అవసరమైన సందర్భంలో కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది అంటూ పోలీసులు తెలపడంతో తిరిగి వెళ్ళిపోయాడు.
కానీ కోర్టు నుండి ఏనాడూ పిలుపు రాకపోవడంతో అనుమానం వచ్చిన శ్రీనివాసరావు తన లాయర్ను సంప్రదించగా అదే ఎఫ్ఐఆర్ నంబర్ 255/2020 తో ముగ్దుమ్ పూర్‌కి చెందిన మరో కేసులో సెక్షన్ 290, 324 కింద మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఎస్సై వి. శ్రీనివాసరావు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉన్నట్లుగా తేలింది. ఒకే తేదీన మరో ఎఫ్ఐఆర్ అదే నంబర్ తో నమోదు కావడంతో ఆశ్చర్యపోయిన సదరు లాయర్ తన క్లయింట్ శ్రీనివాస్ రావుతో కలిసి మీడియాకి ఈ విషయాన్ని చెప్పారు. దీంతో ఈ విషయం సీపీ వరకు వెళ్లడంతో సంబంధిత పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీ పూర్తి నివేదిక ఇవ్వాలంటూ ఈ కింది స్థాయి అధికారులను ఆదేశించారు.
ఈ వ్యవహారం ఇక్కడితో ఆగలేదు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్న ఇంటలిజెన్స్.. డీజీపీకి రిపోర్టు ఇవ్వడానికి సిద్ధమైంది. ఏకంగా నకిలీ ఎఫ్ఐఆర్ను సృష్టించిన సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మీడియా ముందుకు రావడానికి మాత్రం పోలీసు అధికారులు అంగీకరించడం లేదు. పూర్తిస్థాయిలో విచారణ జరిగిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. ఏదేమైనా ఏకంగా భార్యాభర్తల స్థిరాస్తి వివాదంలో తలదూర్చి ఏకంగా నకిలీ ఎఫ్‌ఐఆర్ సృష్టించడం కొందరు అధికారుల అవినీతికి అద్దం పడుతోందని స్థానికులు అంటున్నారు.