Karimnagar News: రైల్వే ఓవర్ బ్రిడ్జి రాజకీయాలపై కరీంనగర్ ప్రజలు ఆగ్రహం, కాలయాపన తప్పదా !
Karimnagar News: కరీంనగర్ పట్టణంలో అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి కట్టాలంటూ ప్రజల నుంచి వినతులు వస్తున్నాయి. వారి డిమమాండ్ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాయి.
Karimnagar News: అది కరీంనగర్ నడిబొడ్డున ఉన్న కీలకమైన ప్రాంతం. కొన్ని సంవత్సరాలుగా అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి కట్టాలంటూ ప్రజల నుండి వినతులు వస్తున్నాయి. వారి డిమాండ్ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నాయి. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం 80 శాతం రైల్వే శాఖ 20% ఖర్చును భరించేందుకు ఎంఓయూ సైతం కుదుర్చుకున్నాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇంకేం ఇక ట్రాఫిక్ కష్టాలు తీరుతాయంటూ ఆ రూట్ లో వెళ్లే ప్రయాణికులు సంబరపడ్డారు. కానీ ఇప్పుడు ఆ సంబరం ఎక్కువ రోజులు కొనసాగేలా లేదు. మళ్లీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా రైల్వే ఓవర్ బ్రిడ్జిపై జరుగుతున్న రాజకీయాల పట్ల కరీంనగర్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏమిటీ పంచాయితీ?
కరీంనగర్ పట్టణానికి కీలకమైన రవాణా మార్గాల్లో ఒకటి కరీంనగర్ టు మంచిర్యాల రహదారి. తీగల గుట్టపల్లిలో ఉన్న కరీంనగర్ రైల్వే స్టేషన్ సమీపంలోనే ఈ ప్రధాన రహదారి పైనుండి రైల్వే పట్టాలు ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు హైదరాబాద్ కు తరలించే అంబులెన్స్లకు సైతం గేటు పడినప్పుడల్లా ఆలస్యం కారణంగా తిప్పలు తప్పడం లేదు. మరోవైపు ఇదే దారిలో పలు ప్రధాన ఆసుపత్రులు సైతం ఉన్నాయి. వారికోసం వచ్చిపోయే పేషంట్ల బంధువులు ఇతర సిబ్బందికి కూడా ఈ రైల్వే గేట్ వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక రోజువారీ ఉద్యోగులు విద్యార్థిని విద్యార్థులు, సామాన్య ప్రజలు 20 సార్లు గేటు పడుతూ ఉండడంతో తమ సమయాన్ని అనవసరంగా వృథా చేసుకోవాల్సి వస్తుంది.
ఈ సమస్యను గుర్తించిన అప్పటి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులు 8 శాతం రాష్ట్రం వాటాతో రైల్వే శాఖ 20% వాటాతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించాయి. దీనికి సంబంధించి ఎంఓయూ సైతం కుదిరింది. మొత్తం నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని దీనికోసం రాష్ట్రం 79.84 కోట్ల రూపాయలు భరించడానికి సంసిద్ధత వ్యక్తం చేయగా... రైల్వే శాఖ 20.16 కోట్ల రూపాయలు భరించేలా ఒప్పందం కుదిరింది. అయితే ఈమధ్య కొత్తగా వచ్చిన జాతీయ రహదారుల శాఖ విధానం వల్ల మళ్ళీ సమస్య మొదటికి వచ్చింది. జూన్ 29వ తేదీన అమల్లోకి వచ్చిన దీని ప్రకారం రాష్ట్ర రహదారులపై కొత్తగా నిర్మించబోయే ఆర్ఓబీలు ఆర్యూబీలకు సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుండే నిధులు కేటాయించాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలోని గ్రామీణ పట్టణ రోడ్లపై 57 ఆర్ఓబీలు, ఆర్యూబీల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. అయితే తీగల గుట్టపల్లి రైల్వే బ్రిడ్జిని సైతం ఇదే ఒప్పందంలో చేర్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదలను ఆపేసింది. దీంతో ఇప్పటికే ఎంఓయూ కుదుర్చుకున్న ప్రాజెక్టును ఏ రకంగా ఆపివేస్తారంటూ ఇటు బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఒక్క ప్రాజెక్టుకి నిధుల విడుదలకు ఇబ్బంది ఏంటని టీఆర్ఎస్ నాయకులు ప్రతి విమర్శలకు దిగుతున్నారు. మధ్యలో మాత్రం సామాన్య ప్రజలు సమస్యతో నలిగిపోతూనే ఉన్నారు.