Karimnagar: ఒంట్లో బాలేదని లీవ్ పెట్టిన గవర్నమెంట్ టీచర్ - ఘనకార్యం చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్, అంతా అవాక్కు!
Karimnagar Government Teacher: జిల్లాలోని ఓ గవర్నమెంట్ టీచర్ స్కూలుకి లీవ్ పెట్టి చేస్తున్న పనులు చూసి అంతా అవాక్కయ్యారు.
Karimnagar News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథనికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చేసిన నిర్వాకం విద్యాశాఖ పరువు తీసేలా చేసింది. పెద్దపల్లి జిల్లాకి చెందిన మాచిడి శ్రీనివాస్ గౌడ్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు గంజాయి సరఫరా చేస్తూ మహారాష్ట్ర పోలీసులకు దొరకడం జిల్లాలో సంచలనం సృష్టించింది. పట్టణంలోని మసీదు వాడలో నివాసముంటున్న అతడు బెస్తరపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎస్ జి టి గా పని చేస్తున్నాడు అంతకు ముందు ప్రైవేటు పాఠశాలను సైతం నిర్వహించిన అనుభవం ఉంది. ఇవే కాకుండా శ్రీనివాస్ గౌడ్ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు కూడా చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఇలాంటి వ్యక్తి ఏకంగా భారీ ఎత్తున గంజాయి ప్యాకెట్లతో మహారాష్ట్ర పోలీసులకు దొరికిపోవడం కలకలం రేపుతోంది.
మెడికల్ లీవ్ పెట్టి మరీ గంజాయి స్మగ్లింగ్ ?
నిజానికి ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇంగ్లీషు భాషా నైపుణ్యాలపై ఈ నెల 21 నుండి నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు హాజరు కావాలని శ్రీనివాస్ గౌడ్ కి హెడ్మాస్టర్ శివలీల సూచించారు. కానీ తనకు అనారోగ్యంగా ఉందని మెడికల్ లీవ్‌కు దరఖాస్తు చేసుకుంటానంటూ సమాధానం ఇచ్చిన అతను తన ప్లాన్ ప్రకారం భారీ ఎత్తున గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ నెల 11 వరకూ పాఠశాలకు హాజరైన శ్రీనివాస్ గౌడ్ 12, 13 సెలవులు కాగా 14వ తేదీ నుండి 17వ తేదీ వరకు సెలవు పెట్టారు. ఇక 18న హోలీ కాగా 19న తనపై అధికారులకు సమాచారం ఇవ్వకుండానే డుమ్మా కొట్టారు. ఇలా ఒక ఉపాధ్యాయుడు వారం రోజుల పాటు విధులకు హాజరు కాకపోయినా ఉన్నతాధికారుల పర్యవేక్షణ చేయకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.
రాజకీయ అండతోనే బరితెగింపు !
నిజానికి శ్రీనివాస్ గౌడ్ మామ ప్రస్తుతం ఓ పార్టీకి మంథని మండల అధ్యక్షుడిగా ఉన్నారు. అతని అత్త సైతం గతంలో ఎంపీపీగా రాజకీయంగా బలమైన బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నారు. ఇవి చూసుకునే శ్రీనివాస్ గౌడ్ ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా సమగ్ర విచారణ జరిపితే ఈ దందాలో ఇంకా ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారనే విషయం బయట పడుతుందని ప్రజలు కోరుతున్నారు.
పరువు తీస్తున్న టీచర్లు...
అసలు విద్యాబోధనపై దృష్టిసారించాల్సిన టీచర్లు అటు స్థిరాస్తి వ్యాపారాలతో బాటు మరోవైపు చిట్ ఫండ్ ఏజెంట్లుగా ఇతర ఆదాయ వ్యాపకాల్లో మునిగిపోతున్నారు. వచ్చే జీతం ఎలాగూ వస్తుంది కాబట్టి ఇక ఇతర వ్యాపకాలపై దృష్టి పెట్టి షార్ట్‌కట్‌లో మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. తమ దగ్గర చదువుకునే విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించినా కేసులు ఒక వైపు అయితే మరోవైపు ఇలా తులసివనంలో గంజాయి మొక్కలలాగా పవిత్రమైన విద్యా బోధనలో ఉండి ఏకంగా స్మగ్లింగ్‌కు పాల్పడి పరుగు తీయడం చర్చనీయాంశంగా మారింది.