(Source: ECI/ABP News/ABP Majha)
Jagitial News: ఎమ్మెల్యేనే ఆపరేషన్ చేయమను, మాతా శిశు సిబ్బంది మాటలు వింటే షాకవుతారు
Jagitial News: ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఓ గర్భిణీతో అక్కడి వైద్యులు నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఎమ్మెల్యేతో ఫోన్ చేయించారని అతడినే వచ్చి ఆపరేషన్ చేయమను అంటూ కామెంట్లు చేశారు.
Jagitial News: ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళను మాటలతో వేధించారు జగిత్యాల మాతా శిశు సిబ్బంది. తనకి డెలివరీ అయ్యే సమయం దగ్గర పడడంతో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో ఉన్న పరిచయం వల్ల మాతా శిశు సిబ్బందికి ఫోన్ చేయించారు. అయితే డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగానే అక్కడ సిబ్బంది నుండి అనుకోని స్పందన ఎదురైంది. ఎమ్మెల్యేతో ఫోన్ చేయించారు కదా.. ఆ ఎమ్మెల్యేనే వచ్చి ఆపరేషన్ చేయమను అంటూ వెటకారంగా మాట్లాడారు. ఓ వైపు వైద్యుల నిర్లక్ష్యపు మాటలు, మరోవైపు పురిటి నొప్పులు తీవ్రం కావడంతో వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు నిత్య సౌకర్యాలు అందిస్తున్నా... సిబ్బంది మాట తీరు, ప్రవర్తన వల్ల చాలా సమస్యలు ఎదుర్కుంటున్నామని పలువురు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించవచ్చు.
నర్సును ప్రాధేయపడ్డ కుటుంబం..
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం తాట్లవాయి గ్రామానికి చెందిన షెర్ఫీ డెలివరీ కోసం ఈనెల 18వ తేదీన జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ లో చేరింది. మొదటి కాన్పు కావడంతో నార్మల్ డెలివరీ చేయాలని డాక్టర్లు, సిబ్బంది వేచి చూశారు. సోమవారం రాత్రి 11.30 గంటలకు నొప్పులు రావడం, ఉమ్మ నీరంతా పోవడంతో కుటుంబ సభ్యులు భయపడ్డారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వెంటనే ఏదో ఒకటి చేసి తమ బిడ్డను కాపాడాలంటూ నర్సును ప్రాధేయపడ్డారు. అయితే ఆ నర్సు నిర్లక్ష్యంగా మాట్లాడింది. దీంతో ఎమ్మెల్యేకు ఫోన్ చేయించారు కుటుంబ సభ్యులు. స్పందించిన ఎమ్మెల్యే ఆస్పత్రికి ఫోన్ చేసి తక్షణ వైద్య సాయం అందించాలని కోరారు. దీంతో కోపం పెంచుకున్న సిబ్బంది ఎమ్మెల్యేనే వచ్చి ఆపరేషన్ చేయమనండి అంటూ ఫైర్ అయ్యారు. అదంతా పట్టించుకోకండి, వైద్యం చేయమని కాళ్లు పట్టుకున్నా కనికరించలేరు. మీరేం చేసినా మేం వైద్యం చేయమంటూ నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పారు. దీంతో షెర్ఫీని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
"ఆదివారం రోజు ఆపరేషన్ చేస్తా హాస్పిటల్ కు రమ్మని మేడం చెప్పింది. వెళ్తే చేయలేదు. సోమవారం పొద్దున రా చేస్తా అంది. ఆరోజు వెళ్తే కూడా చేయలేదు. అయితే ఎమ్మెల్యే సార్ తెలిసి ఉండటంతో ఫోన్ చేయించినం. దీంతో ఆయన ఫోన్ చేసి చెప్పిండు కదా.. ఆయన్నే వచ్చి ఆపరేషన్ చేయమను, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం కేసీఆర్ వాళ్లనే వచ్చి చేయమను అంటూ బెదిరిచ్చిర్రు. మేం అస్సలే ఆపరేషన్ చేయము అన్నరు. అవస్థ అయితుంది ఆపరేషన్ చేయమని బతిమిలాడినా చేయలేరు. డబ్బులు లేకే ప్రభుత్వాసుపత్రికి పోతే.. ఆపరేషన్ చేయలేరు. అందుకే ప్రైవేటు హాస్పిటల్ కు వచ్చి ఆపరేషన్ చేయించుకున్న" అని బాధితురాలు షెర్ఫీ వివరించారు.
ఇటీవలే నల్గొండలో బాలింత మృతి, వైద్యుల నిర్లక్ష్యమే కారణం..!
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల పట్ల రోజు రోజుకూ వైద్యులు నిర్లక్ష్యం పెరిగి పోతుంది. మూడ్రోజుల క్రితం నల్గొండ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అఖిల అనే బాలింత మృతి చెందింది. అయితే డెలివరీ కోసం అఖిలను ఆస్పత్రికి తీసుకు రాగా... ప్రసవం చేయాల్సిన వైద్యులు, సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అఖిలకు సమయానికి వైద్యం అందించలేదు. ఒక వైపు గర్భిణీ నొప్పులతో విలవిల్లాడుతున్నా పట్టించుకోలేదు. తర్వాత ఆమె మృతి చెందింది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులు, సిబ్బంది వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా.. వారిలో ఎలాంటి మార్పు రావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
అయితే అఖిల ప్రసవం సమయంలో వచ్చే అనారోగ్య సమస్యలతోనే మృతి చెందినట్లు వైద్యులు చెబుతున్నారు. గర్భకోశం సాధారణ కాన్పుకు సహకరించలేదని వందలో ఒకటి ఇలా జరుగుతుందని తెలిపారు. కాన్పు సమయంలో వైద్యులు, సిబ్బంది ప్రవర్తించిన తీరుపై పూర్తి స్థాయిలో విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డా. రమేశ్ రెడ్డి అన్నారు. అయితే నల్గొండ ఆస్పత్రిలో జరిగే ప్రసవాల్లో 99 శాతం బాధితులకు అనుకూలంగా ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. డీఎంఈ వచ్చిన సంగతి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆస్పత్రికి చేరుకునన్నారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాలు సరిగ్గా లేవని రోగుల వెంట వచ్చిన బంధువులు చెప్పారు. బాధితుల కష్టాలు తీసుకున్న ఎమ్మెల్యే ఆస్పత్రి సూపరింటెండెంట్ లచ్చు నాయక్, సిబ్బందిపై మండి పడ్డారు. మీ ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే ఇలాంటి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటారా అని ప్రశ్నించారు. ప్రజలకు సేవలు చేయడం చేతకాకపోతే.. రాజీనామా చేసి ఇంటికి వెళ్లండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.