హత్య కేసులో పరారయ్యారు- చైన్ స్నాచింగ్‌తో పట్టుబడ్డారు
Jogayyapalli Astrologer Murder: ఈ ఏడాది మే 3వ తేదీన కరీంనగర్ జిల్లా జోగయ్యపల్లికి చెందిన జ్యోతిష్యుడు చేల్ పూరి పెద్దస్వామి హత్య కేసులో.. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
Jogayyapalli Astrologer Murder: ఈ ఏడాది మే 3వ తేదీన కరీంనగర్ జిల్లా జోగయ్యపల్లికి చెందిన జ్యోతిష్యుడు చేల్ పూరి పెద్దస్వామి హత్య కేసులో.. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10.5 తులాల బంగారు ఆభరణాలు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను నగర క్రైమ్స్ అండ్ సిట్ అదనపు సీపీ ఏఆర్. శ్రీనివాస్ వెల్లడించారు.
జోగయ్యపల్లికి చెందిన జ్యోతిష్యుడు చేల్ పురి పెద్దస్వామి వద్ద జ్ఞానేశ్వర్, నీలం శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు శిష్యులుగా చేరారు. ఆయనకు సేవ చేస్తున్నట్లు నటించి 3 రోజులు ఆశ్రమంలో గడిపారు. మే 3వ తేదీ అర్ధరాత్రి సమయంలో పెద్దస్వామిని హత్య చేసి బంగారం, రూ. 32 వేల నగదుతో పారిపోయారు. అప్పటినుంచి వారు పరారీలో ఉన్నారు.
చిక్కారిలా..
ఇటీవల ఎస్సార్ నగర్ చైన్ స్నాచింగ్ కేసులు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా జోగయ్యపల్లి జ్యోతిష్యుడిని హత్య చేసింది వీరేనని తేలినట్లు సీపీ తెలిపారు. ఇంకా వారికి సంబంధించి అనేక విషయాలు వెల్లడించారు. స్వామిజీ వద్ద దొంగిలించిన డబ్బును షేర్ మార్కెట్ లో పెట్టుబడిగా పెట్టారు. అయినప్పటికీ అది సరిపోకపోవటంతో చైన్ స్నాచింగ్ లకు, దొంగతనాలకు పాల్పడడం మొదలుపెట్టారు. సూర్యాపేటలో బైక్ దొంగిలించారు. ఏపీ, తెలంగాణలలో చైన్ స్నాచింగ్ లు చేశారు. ఈ క్రమంలోనే ఎస్సార్ నగర్ లో పట్టుబడ్డారు. నిందితులకు విజయవాడకు చెందిన గంటా నాగబాబు సహకరించాడు.