అంతా సైలెన్స్- ఈడీ ప్రకటనతో గ్రానైట్ పరిశ్రమ యాజమాన్యాల్లో టెన్షన్
దుబాయ్ పర్యటనలో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ వెంటనే తిరిగి వచ్చి ఈడికి సహకరిస్తానంటూ ప్రకటించారు. ఇతర కంపెనీలు సైతం వీలైనంత వరకు మౌనం పాటించాయి.
అప్పటి వరకు రోజువారి కార్యకలాపాలతో హడావిడిగా ఉండే గ్రానైట్ పరిశ్రమ కంపెనీల యజమానులు ఈడీ దాడుల తర్వాత మౌనంగా ఉన్నాయి. ఇక్కడ 30 ఏళ్ల నుంచి కంపెనీలను నిర్వహిస్తున్న శ్వేతా గ్రానైట్స్ లాంటి కంపెనీపై కూడా ఈడీ దాడులు చేసింది. మంత్రి కమలాకర్ కుటుంబానికి చెందిన ఈ కంపెనీ కార్యాలయం, మంత్రి ఇంట్లో కూడా ఈడి బృందాలు సోదాలు జరిపింది. ఈ సోదాలు జిల్లాలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపాయి.
దుబాయ్ పర్యటనలో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ వెంటనే తిరిగి వచ్చి ఈడికి సహకరిస్తానంటూ ప్రకటించారు. ఇతర కంపెనీలు సైతం వీలైనంత వరకు మౌనం పాటించాయి. పదో తారీఖున మళ్లీ గ్రానైట్ కంపెనీల తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించిన ఈడీ, ఐటి బృందాలు అక్కడే పలువురిని విచారించాయి. గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న కార్యకలాపాలకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించాయి. మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నందున క్లారిటీ ఇచ్చేందుకు ఈడీీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈడీ దాడుల కారణంగా నడుస్తున్న చర్చకు ఈ ప్రకటన మరింత ఆజ్యం పోసింది. ఒక్కసారిగా కరీంనగర్‌లో కలకలం రేగింది. మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నట్టుగానే గ్రానైట్ కంపెనీలు పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డాయని ఈడి అందులో స్పష్టంగా పేర్కొంది. ఎలాంటి ఆధారాలు లేనిదే ఈడి లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థ ఇలాంటి ఆరోపణలు చేయదన్న చర్చ నడుస్తోంది. పలువురు ఉద్యోగులను బినామీలుగా చూపించి వారి అకౌంట్లో పెద్ద ఎత్తున నగదు బదిలీ అయ్యేవిధంగా వ్యవహరించారని ఈడీ తన ప్రకటనలో తెలిపింది. ఇలా చేయడం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టడమేనని ఇది తీవ్రమైన ఆర్థిక నేరంగానే పరిగణిస్తారని గత కేసుల చెబుతున్నాయి.
కావాల్సినంత సమయం దొరికినప్పటికీ విజిలెన్స్ నివేదిక ఇచ్చిన విధంగా కోట్ల రూపాయల పన్ను ఎగవేతకి పాల్పడి.. అవకాశం ఇచ్చినా కట్టలేదని పేర్కొంది. అక్రమంగా దొరికిన సొమ్ము ఎంత తక్కువైనా.. ఈడీ దానిని నేరంగానే పరిగణిస్తుంది. అలాంటిది కోటి ఎనిమిది లక్షల రూపాయలు లెక్కలో లేని సొమ్ము ఈ దాడుల్లో దొరికాయని ప్రకటనలో పేర్కొంది. పలు కీలక పత్రాలలో స్వాధీనం చేసుకున్నామని దీనికి సంబంధించి విచారణ సైతం కొనసాగుతోందని స్పష్టం చేసింది.
ఏమరుపాటే కొంపముంచిందా?
గత పది ఏళ్ళుగా పలుమార్లు గ్రానైట్ కంపెనీలపై నేతల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు బిజెపి నేతలు బండి సంజయ్, పేరాల శేఖర్‌రావు గ్రానైట్ కంపెనీలపై విచారణ జరిపించాలని కేంద్రంలో ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌కు చెందిన లాయర్ బేతి మహేందర్ రెడ్డి పూర్తి గణాంకాలతో సహా ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీకి చెందిన మరో స్థానిక నేత సైతం దీనిపై కేంద్రంలో ఫిర్యాదు చేశారు. అయితే గ్రానైట్ కంపెనీలకు ఇవేవీ సీరియస్‌గా కనిపించలేదు.
పదేళ్లుగా గ్రానైట్ కంపెనీలపై ఆరోపణలు రావడం... దాడులు చేస్తారంటూ ప్రచారం జరగడం మామూలైపోయింది. కానీ ప్రస్తుత పరిస్థితులు వేరు. అందుకే కొందరు పరిణామాలకు అనుగుణంగా మారి తప్పులను సరిదిద్దుకున్నట్లు తెలిసింది. మరికొందరు మాత్రం నిర్లక్ష్యం చేసి ఆధారాలతో దొరికిపోయారని టాక్. రానున్న రోజుల్లో ఈ కేసు ఎంత సీరియస్‌గా మారుతుందోనని టెన్షన్ పడుతున్నారు. వారిపై ఆధారపడి బతుకుతున్న వేలా కార్మికులు సైతం జరుగుతున్న పరిణామాలపై ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.