Bandi Sanjay: కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ డబ్బు సాయం చేసింది - కర్ణాటక ఫలితాలపై బండి సంజయ్
దేశంలో ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఇవి.. ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు అన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. కర్ణాటకలో బీజేపీ ఓట్లు తగ్గలేదని, 36 శాతం ఓట్లు సాధించాం అన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో క్లియర్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కర్ణాటకలో అధికార పార్టీ బీజేపీ ఓటమిపై పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పందించారు. దేశంలో ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఇవి.. ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు అన్నారు. కర్ణాటకలో బీజేపీ ఓట్లు తగ్గలేదని, 36 శాతం ఓట్లు సాధించాం అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో సీఎం కేసీఆర్ డబ్బులు ఖర్చు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి 5 శాతం ఓటింగ్ పెరిగింది, జేడీఎస్ ఓట్లు 7 శాతం తగ్గాయన్నారు.
కర్ణాటకలో అన్ని పార్టీలు కలిసి మతతత్వ రాజకీయాలు చేశాయని బండి సంజయ్ ఆరోపించారు. అన్ని పార్టీలు ఏకమై బీజేపీని ఓడించాయి 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. భజరంగ్ దళ్ ని నిషేధిస్తామని, ముస్లిం రిజర్వేషన్లు అని ఇతర పార్టీలు మతతత్వ రాజకీయాలు చేశాయి. జేడీఎస్ అధ్యక్షుడు బహిరంగంగానే తమ పార్టీ ఓట్లను కాంగ్రెస్ కు వేయాలని సూచించారని గుర్తుచేశారు. ఎంఐఎం, ఎన్డీపీఐ, జేడీఎస్, కాంగ్రెస్ అందరూ కలిశారని బండి సంజయ్ ఆరోపించారు.
రేపు బజరంగ్ దళ్ ని నిషేదించి.. pfiపై నిషేధం ఎత్తివేస్తారు. 4శాతం ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రేపు తెలంగాణలో కలిసే పోటీ చేస్తాయని, కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నేతలకు డబ్బు సాయం చేసిందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్ హైదరాబాద్ లో పెట్టేందుకు కేసీఆర్ సహాయం చేస్తారన్నారు.