Bandi Sanjay: బీజేపీ ప్రశ్నిస్తే తప్ప ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సీఎం కేసీఆర్ ఇవ్వడం లేదు: బండి సంజయ్
గ్రామాలకు పైసా ఇయ్యకుండా నిర్వీర్యం చేయడంతోపాటు కేంద్రం ఇచ్చే నిధులను దొంగిలించిన సీఎం కేసీఆర్... నేడు గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలిస్తానని చెప్పడం హాస్యాస్పదం అన్నారు బండి సంజయ్ కుమార్.
‘‘8 ఏండ్లుగా గ్రామాలకు పైసా ఇయ్యకుండా నిర్వీర్యం చేయడంతోపాటు కేంద్రం ఇచ్చే నిధులను దొంగిలించిన సీఎం కేసీఆర్... నేడు గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలిస్తానని చెప్పడం హాస్యాస్పదం. దొంగలించిన సొమ్మును వడ్డీతోసహా చెల్లించేదాకా సర్పంచులు, వార్డు సభ్యులుసహా ప్రజలు కేసీఆర్ ను క్షమించే ప్రసక్తే లేదు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతి, అక్రమాలపై కేంద్రం విచారణ చేస్తున్నారనే అక్కసుతోనే టీఆర్ఎస్ నేతలు ప్రధాని నరేంద్ర మోదీని బదనాం చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థత, చేతగానితనంవల్లే తెలంగాణ అప్పుల కుప్పగా మారిందన్నారు.
అభివృద్ధి చెందిన తెలంగాణగా తీర్చిదిద్దే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు. కేసీఆర్ పాలనను బొంద పెట్టేదాకా యువత విశ్రమించొద్దని, ఈ విషయంలో బీజేపీ చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోరుతూ గత 35 రోజులుగా పాదయాత్ర చేస్తున్న జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయనతో కలిసి నడిచారు. అనంతరం కొల్లాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు......
కొల్లాపూర్ సమగ్ర అభివృద్ధి కోరుతూ 35 రోజులుగా పాదయాత్ర చేస్తూ 500 కిలోమీటర్లు నడిచిన ఎల్లేని సుధాకర్ రావు పట్టుబడితే వదలకుండా సాధించేదాకా శ్రమించే నాయకుడు. సోమశిలపై ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. జోగులాంబ నుండి దేవరకొండ దాకా జాతీయ రహదారి నిధులు మంజూరు చేయించేందుకు పాటుపడ్డారు ఎల్లేని సుధాకర్ రావు. తెలంగాణకు కేంద్రం నుండి ఏ మంత్రి, అధికారి వచ్చినా నిరంతరం కొల్లాపూర్ అభివృద్ధి కోసం నిధులు తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరిస్తాం. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ 3.5 కోట్ల ఇండ్లు నిర్మిస్తున్నారు. తెలంగాణకు 2.4 లక్షల ఇండ్లకు కేంద్రం నిధులు మంజూరు చేస్తే కేసీఆర్ మాత్రం వాటిని పేదలకు అందజేయడం లేదు. ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో లక్షలాది మంది డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నా ఒక్కరికీ ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదో ప్రజలంతా కేసీఆర్ ను నిలదీయండి. పేదల పక్షాన బీజేపీ చేస్తున్న లడాయితో ఫాంహౌజ్ నుండి దిగొచ్చి కేసీఆర్ జనంలోకి పోతున్నాడని ఎద్దేవా చేశారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండు నెలల్లో 1.46 లక్షల మందికి అపాయిట్ మెంట్ లెటర్లు ఇచ్చింది. ఈ ఏడాది 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నడు కేసీఆర్. ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారో చెప్పాలి. నోటిఫికేషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప ఒక్కరికి కూడా అపాయిట్ మెంట్ లెటర్ ఇవ్వలేదు. నిరుద్యోగులు ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకుంటూ గడ్డాలు పెంచుకుంటూ తిరుగుతున్నరు. రుణమాఫీ చేయ్యలేదు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరినా ముందుకు రాని నాయకుడు కేసీఆర్. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనుల కోసం కేంద్రం సర్పంచుల అకౌంట్లో నిధులు జమ చేస్తే... ఆ సర్పంచులకు తెల్వకుండా ఆ సొమ్మును దొంగలించిన నాయకుడు కేసీఆర్ అని ఆరోపించారు.
గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు ఇస్తాడట. 8 ఏళ్లు నయాపైసా ఇయ్యకుండా పంచాయతీలను నిర్వీర్యం చేసిన కేసీఆర్... పంచాయతీ నిధులను దారి మళ్లించిన సొమ్ముకు వడ్డీతో సహా చెల్లించాలి. లేనిపక్షంలో సర్పంచులు, వార్డు సభ్యులు సహా గ్రామాల ప్రజలెవరూ కేసీఆర్ ను క్షమించబోరు. కేంద్రం పేదలకు ఉచితంగా 5 కిలోల బియ్యం ఇస్తే... వాటిని అందివ్వని నీచుడు కేసీఆర్.. ఈ అంశంపై సీఎంను నిలదీస్తూ లేఖ రాస్తే దిగొచ్చి బియ్యం ఇస్తున్నడు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలియ్యడం లేదు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ఇస్తలేరు. బీజేపీ నిలదీస్తే తప్ప నెలనెలా జీతాలియ్యడం లేదు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన నేత కేసీఆర్ అన్నారు.