Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో వేలాది ఆలయాలను గతంలో ధ్వంసం చేశారని, మసీదులు తవ్వితే శివలింగాలు బయటపడతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Hindu Ekta Yatra in Karimnagar: తెలంగాణలో ఇదివరకే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య జైశ్రీరామ్, జై హనుమాన్ నినాదాల వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో హనుమాన్ జయంతి ఉత్సవాల (Hanuman Jayanti celebration)లో భాగంగా కరీంనగర్‌లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో పాల్గొన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలోని మసీదులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వేలాది ఆలయాలను గతంలో ధ్వంసం చేశారని, మసీదులు తవ్వితే శివలింగాలు బయటపడతాయని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ విసిరారు.
శవాలొస్తే మీవి.... శివ లింగాలు వస్తే మావి
‘‘తెలంగాణలో ఉన్న మసీదులను తవ్వి చూద్దాం. శవాలొస్తే మీవి.. శివం వస్తే మావి’. అందుకు మీరు సిద్ధమా?’ అని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి హిందూ ఏక్తా యాత్రలో పాల్గొన్న బండి సంజయ్ సవాల్ విసిరారు. తెలంగాణకు పట్టిన శని పీడను వదిలించి రామరాజ్యాన్ని స్థాపించి తీరుతామని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మదర్సాలను రద్దు చేస్తామని.. మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు వర్తింపజేస్తామని సంచలన ప్రకటన చేశారు. అధికారిక భాషగా ఉన్న ఉర్దూను శాశ్వతంగా నిషేధిస్తామన్నారు.
ఢిల్లీకి రాజైనా ఎప్పటికీ తాను కరీంనగర్ బిడ్డనేనని... జిల్లా ప్రజలకు ఏ ఆపదొచ్చినా పెద్ద కొడుకుగా ముందుండి ఆదుకునేందుకు సిద్దంగా ఉన్నానన్నారు. కొనఊపిరి ఉన్నంత వరకు తెలంగాణలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసేందుకు పోరాడుతూనే ఉంటానని బండి సంజయ్ చెప్పారు. కరీంనగర్‌లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో ఆశేష జనసందోహాన్ని ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ప్రసంగంలో కీలక అంశాలు ప్రస్తావించారు.
కరీంనగర్‌కు పాదాభివందనాలు
‘నన్ను కన్న నా కరీంనగర్ కు పాదాభివందనాలు. నన్ను గెలిపించిన కరీంనగర్ ప్రజలకు శతకోటి వందనాలు. శ్రీ రాముడికి హనుమంతుడి ఎట్లా చేదోడుగా ఉన్నాడో... ఈ కరీంనగర్ కు ఏ ఆపదొచ్చినా నేనుంటా. రక్షణ కవచంగా ఉంటా. నా హిందూ సమాజ సంఘటితం కోసం నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతా. బండి సంజయ్ పై అవాకులు చవాకులు పేలుతున్న వాళ్లను తరిమి కొడతాం. బండి సంజయ్ కుటుంబం కోసం జైలుకుపోలే.. ఇదే చౌరస్తాలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోతే.. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వాళ్లను తరిమితరిమి కొట్టిన వ్యక్తి బండి సంజయ్ అన్నారు. దుర్గా మాత ఉత్సవాలకు కరెంట్ కట్ చేస్తే యుద్దం చేసి జైలుకు పోయినోడు బండి సంజయ్. మూడు సార్లు చంపే ప్రయత్నం చేసినా కాషాయం జెండాను వీడలేదు. కరీంనగర్ గడ్డను విడిచిపోలేదు బండి సంజయ్. ధర్మం కోసం, కాషాయ జెండా కోసం పనిచేసే వ్యక్తి బండి సంజయ్ అన్నారు.
కరీంనగర్ బస్టాండ్ లో బాంబు పెట్టింది మీరే. కోరుట్లలో, జగిత్యాలలో బాంబులు పెట్టింది మీరే. లుంబినీ పార్కులో, గోకుల్ చాట్ లో, సాయి బాబా గుడిలో బాంబులు పెట్టి అమాయకుల ప్రాణాలు తీశారు. వరంగల్ నడిబొడ్డున పేద పూజారిని హత్య చేసింది మీరే. నిన్నగాక మొన్న నాగరాజును హత్య చేసింది మీరే. ఇలాంటోళ్లకు వ్యతిరేకంగా కొట్లాడలా? వద్దా? బరాబర్ కొట్లాడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు కరీంనగర్ జిల్లాలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసేందుకు కొట్లాడిన తాను ఇకనుంచి తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని కాపాడాలంటూ రాష్ట్రానికి పంపింది కరీంనగర్ ప్రజలే. తెలంగాణ గడ్డను కాషాయ మయం చేస్తున్నా. తెలంగాణకు పట్టిన శనిని కాషాయంతో తుడిచేసి రాష్ట్రాన్ని పవిత్రం చేసే బాధ్యతను తీసుకున్నానని, తప్పకుండా రామరాజ్యం రావాల్సిందే అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
దేశంలో 36 వేల ఆలయాలను ధ్వంసం చేశారు
‘36 వేల ఆలయాలను ధ్వంసం చేసి మసీదులు కట్టిన దీనస్థితిలో భారత దేశం ఉంది. ఏ మసీదును తవ్వినా శివలింగాలు బయటపడుతున్నయి. కాశీలోని మసీదులో శివలింగం బయటపడింది. నేను ఒవైసీకి, సెక్యులర్ వాదులకు సవాల్ చేస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో మసీదులను తవ్వి చూద్దాం. అందులో శవాలు బయటపడితే మీరు తీసుకోండి. శివం బయటపడితే మాకు అప్పగించండి. శవం మీది... శివం మాది... సిద్ధమా? అని సవాల్ విసిరారు. లవ్ జిహాదీ పేరుతో అక్కా చెళ్లెళ్లను ట్రాప్ చేస్తే ఊరుకుందామా? పేదరికాన్ని అడ్డుపెట్టుకుని మత మార్పిళ్లు చేస్తే ఊరుకుందామా? ఊరుకునే ప్రసక్తే లేదు... లవ్ జిహాదీ అన్నోడికి లాఠీ రుచి చూపిస్తం అంటూ మండిపడ్డారు.
ఇప్పటి వరకు కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూశారు. అతి త్వరలో రజాకార్ ఫైల్స్ సినిమా రాబోతోందన్నారు. 15 శాతం ఓట్ల కోసం పొత్తులు పెట్టుకుంటున్న పార్టీలున్నయ్. దేశంలో ఎక్కడ బాంబు దాడులు జరిగినా ఇక్కడే మూలాలుంటున్నాయి. ఉగ్రవాద శిక్షణా కేంద్రాలుగా మదర్సాలున్నాయని ఆరోపించారు. వాళ్లకు ఇంకా కంప్యూటర్లు, ఇతర ఆర్దిక సాయం చేస్తుండటం సిగ్గు చేటు అన్నారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని పాతరేస్తాం. రామరాజ్యాన్ని స్థాపించి తీరుతామని చెప్పారు.
తెలంగాణలో ఉన్న ప్రతి హిందువు ‘నేను హిందువునని గర్జిస్తూ... గాండ్రిస్తూ జై తెలంగాణ అంటూ సగర్వంగా తలెత్తుకునే పరిస్థితిని తీసుకొస్తాం... హిందూ ధర్మాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఇన్నేళ్లుగా హిందూ ధర్మ రక్షణ కోసం ఇబ్బంది పడుతున్నాం.. ఇంకొక్క సంవత్సరం కష్టపడండి. రామరాజ్యాన్ని తీసుకొస్తాం. 80 శాతం మంది ఉన్న తెలంగాణ హిందువులు కష్టాలు పడుతున్నరంటే మనం తల దించుకోవాల్సిన పరిస్థితి ఉందంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఏ హిందువుకు కష్టమొచ్చినా హనుమంతుడి భక్తుడిగా ఛత్రపతి శివాజీ వారసుడిగా ఆదుకుంటా. నా చివరి రక్తపు బొట్టును సైతం ధారపోసేందుకు సిద్ధంగా ఉన్నా. తనను ఎంపీగా గెలిపించినందునే ఈరోజు తెలంగాణలో హిందూ సమాజం కోసం యుద్దం చేసే అవకాశం వచ్చిందన్నారు. కరీంనగర్ జిల్లా ప్రజలకు పాదాభివందనం చేసి చెబుతున్నా.. మీ నమ్మకాన్ని, ఆశయాన్ని ఏనాడూ వమ్ము చేయను. మీరంతా తలెత్తుకుని గర్వంగా తిరిగేలా చేస్తా అన్నారు.