Daughter Birthday: కూతురి సమాధి వద్ద జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసిన తల్లిదండ్రులు, కంటతడి పెట్టించే ఘటన
అల్లారు ముద్దుగా పెంచుకున్న ముద్దుల పాప శాశ్వతంగా తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వారు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. చిన్నారి సమాధి వద్ద కేక్ కట్ చేసి మరీ బర్త్ డే వేడుకలు జరిపారు.
Birthday celebrations at daughters grave: కన్నబిడ్డలకు చిన్న దెబ్బ తగిలినా తల్లిదండ్రులు అల్లాడిపోతారు. అలాంటిది అల్లారు ముద్దుగా పెంచుకున్న ముద్దుల పాప శాశ్వతంగా తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వారు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. చిన్నారి చనపోయిన నెల రోజులకే పుట్టినరోజు కావడంతో తన కన్న కూతురి సమాధి వద్ద జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఆ తల్లితండ్రులు. కూతురిపై వారి ప్రేమను చూసి అక్కడున్న వారు కన్నీటి పర్యంతమయ్యారు. నెల రోజుల కిందటివరకూ ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపే ఆ చిన్నారిని విష జ్వరం పొట్టనపెట్టుకుంది.
తల్లిదండ్రులకు ఎంత కష్టం!
జగిత్యాల జిల్లా వెలుగటూర్ మండల కేంద్రానికి చెందిన కొప్పుల రాజు రసజ్ఞ దంపతులకు నాలుగేళ్ల కూతురు జ్ఞానన్వి ఉంది. గత నెల 8న చిన్నారి విష జ్వరంతో మృతి చెందింది. అల్లారుముద్దుగా ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపే ఆ చిన్నారిని విష జ్వరం పొట్టన పెట్టుకొని కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. అల్లారు ముద్దుగా కంటికి రెప్పలా చూసుకున్న పాప చనిపోవడాన్ని తల్లిదండ్రులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. నెలరోజుల కిందట తిరిగిరాని లోకాలకు వెళ్లిన తన కూతురిని ఆ దంపతులు తలుచుకొని కన్నీళ్లు పెట్టుకోని రోజు అంటూ లేదు.
సమాధి వద్ద కేక్ కట్ చేసిన తల్లిదండ్రులు..
తమ గారాల పట్టి, తన కన్న కూతురు జ్ఞానన్వి పుట్టిన రోజు కావడంతో పుట్టెడు దుఃఖంలో ఆ తల్లిదండ్రులు గురువారం కూతురి సమాధి వద్దకు వెళ్లారు. సమాధి వద్ద కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేట్ చేశారు. కేకుపై చిన్నారి ఫొటో, పేరు ముద్రించి జన్మదిన వేడుకలను జరిపారు. ఫొటోకు కేక్ తినిపిస్తూ తల్లి రోదించిన తీరు చూసేవాళ్లను సైతం కంటతడి పెట్టించింది. తన కళ్ళ ముందు అల్లారు ముద్దుగా పెరిగిన ఆ చిట్టితల్లి చనిపోయిన నెలకే పుట్టిన రోజు రావడంతో ఆ చిన్నారి సమాధి వద్ద జన్మదిన వేడుకలను కన్న తల్లిదండ్రులు జరిపిన సంఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో స్థానికంగా వైరల్ అవుతోంది.
‘నెల రోజుల కిందట మా పాప చనిపోయింది. పాప అంటే మాకు చాలా ప్రాణం. అనారోగ్య సమస్యలతో అనుకోకుండా పాప చనిపోయింది. పాప ఇక తిరిగిరాదని నా భార్య చాలా బాధపడుతోంది. చనిపోయిన నెల రోజులకు పుట్టిన రోజు కావడంతో చిన్నారి సమాధి వద్దకు వెళ్లాం. పాప బర్త్ డే ను కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశాం. కానీ తమ పాప ఎన్నటికీ తిరిగి రాదంటూ’ పాప తండ్రి రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. పాప అంటే వారికి ఎంత ప్రేమన్నది తమకు తెలుసునని స్థానికులు చెబుతున్నారు. అయితే చిన్నారులకు అనారోగ్యంగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స అందించాలని, లేకపోతే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరేళ్ల లోపు పిల్లలను మరీ జాగ్రత్తగా చూసుకోవాలని, ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని నిపుణులు పదే పదే చెబుతారు.