Bandi Sanjay: కరీంనగర్‌లో టెక్నికల్ యూనివర్సిటీ, పీవీ స్వస్థలంలో నవోదయ ఏర్పాటు - కేంద్రాన్ని కోరిన బండి సంజయ్
Telangana News | కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన ను కలిసిన ఆయన కరీంనగర్ జిల్లాలో టెక్నికల్ యూనివర్సిటీ ఏర్పాటును కోరారు.
Technical University in Karimnagar District | న్యూఢిల్లీ: కరీంనగర్ జిల్లాలో టెక్నికల్ యూనివర్సిటీని స్థాపించాలని బండి సంజయ్ కేంద్రాన్ని కోరారు. కరీంనగర్ జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ బుధవారం నాడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ని ఢిల్లీలో కలిసి వినతి పత్రం ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలో ఇంజినీరింగ్ మరియు పాలిటెక్నిక్ కోర్సులు చేసే విద్యార్థులకు టెక్నికల్ యూనివర్సిటీ వల్ల నైపుణ్య అభివృద్ధి, టెక్నికల్ విద్య లభిస్తుందని వివరించారు.
మాజీ ప్రధాని పీవీ స్వస్థలంలో నవోదయ విద్యాలయ ఏర్పాటు
మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న పీవీ నర్సింహారావు (PV NarasimhaRao) గారి స్వస్థలం వంగరలో నవోదయ విద్యాలయాన్ని (Navodaya School) ఏర్పాటు చెయ్యాలని కేంద్ర మంత్రిని బండి సంజయ్ కోరారు. తెలంగాణలో కొత్తగా 18 జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అందులో హనుమకొండ జిల్లా ప్రస్తావన లేకపోవడంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని వంగరలో, సిరిసిల్లలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించినట్లు ట్వీట్ చేశారు. భేటీ సందర్భంగా దిగిన ఫొటోలను షేర్ చేశారు.
కరీంనగర్ జిల్లాలో టెక్నికల్ యూనివర్సిటీని స్థాపించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ @dpradhanbjp గారిని ఢిల్లీలో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఇంజినీరింగ్ మరియు పాలిటెక్నిక్ కోర్సులు చేసే విద్యార్థులకు టెక్నికల్ యూనివర్సిటీ వల్ల నైపుణ్య అభివృద్ధి మరియు టెక్నికల్… pic.twitter.com/aUaJyl4NYt
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) January 8, 2025
ఎడ్యుకేషనల్ హబ్ గా కరీంనగర్
కరీంనగర్ ప్రాంతాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా కరీంనగర్ టౌన్, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ (Karimnagar Rural), మనకొండూర్, గంగాధర, రామడుగు, తిమ్మాపూర్, గన్నేరువరం, హుజూరాబాద్, వీనవంక, చొప్పదండి, ఎల్లందకుంట, శంకరపట్నం, చిగురుమామిడి, సైదాపూర్, జమ్మికుంట మండలాల్లో పీఎం శ్రీ కింద పాఠశాలలను ఏర్పాటు చెయ్యాలని ధర్మేంద్ర ప్రదాన్ ను స్థానిక ఎంపీగా బండి సంజయ్ కోరారు.
ఈ స్కూళ్లకు నిధులు కేటాయించండి - బండి సంజయ్
పీఎం శ్రీ పథకం (PM SHRI School) కింద సిరిసిల్ల జిల్లాలో ఎంపిక చేసిన 16 పాఠశాలలు, కరీంనగర్ జిల్లాలో ఎంపిక చేసిన 24 ప్రభుత్వ పాఠశాలలో ప్రతి స్కూల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు మెరుగైన బోధన కోసం రూ.40 లక్షల చొప్పున నిధులు అందించాలని కోరారు. తాను చేసిన పలు అభ్యర్థనల పట్ల కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సానుకూలంగా స్పందించారని, తన వినతిపత్రంలోని అంశాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బండి సంజయ్ వెల్లడించారు.
Also Read: KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు