కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో చెప్పుల స్టాండ్, కూలర్లు మాయం
దాతలు ఇచ్చిన మూడు కూలర్లలో రెండు కూలర్లు మాయం చేసిన సదరు ఉద్యోగి వాటితోపాటు దొంగకు చెప్పు లాభం అన్నట్టుగా చెప్పుల స్టాండును సైతం ఎత్తుకెళ్ళడంతో తోటి సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాసుపత్రిలో అధర్మం రాజ్యమేలుతోందీ. సరైన పర్యవేక్షణ లేక...అధికారుల అలసత్వంతో సిబ్బందీ ఆడిందీ ఆట.. పాడిందీ పాటగా సాగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాల లేమితో నేను రాను బిడ్డో సర్కారు ధవాఖానకు అన్నట్టు పరిస్థితులు వెక్కిరీస్తుంటే... ఉన్న వస్తువులు పోతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కొందరు దాతలు సర్కారు ధవాఖానకు దానం చేస్తున్న వాటినీ సిబ్బంది ఇంటికి తరలిస్తున్న దుర్బరం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిది.
కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటివరకు పర్యవేక్షణ లోపంతో అడ్డగోలు వ్యవహారాలను ఎన్నింటినో చూశారు ప్రజలు. అడిగేవారు లేక పోవడంతో ఓ వైద్యుడు ప్రైవేటు సిబ్బందితో ఆపరేషన్లు చేయించి ఏకంగా ప్రైవేటు ఆసుపత్రినే నెలకొల్పిన విషయం విన్నారు. స్వయాన ఆసుపత్రీ ఆర్.ఎం.ఓ డ్యూటికీ రాకుండానే హజరు రిజిస్టర్‌లో సంతకాలు పెట్టీ పర్యవేక్షణ ఏవిధంగా ఉందో అద్దం పట్టేలా వ్యవహరించిందీ చూశారు.
ఇంత జరుగుతుంటే మేం ఏమైన తక్కువ అనుకుందో? ఏమో! మాత శిశులో ఓ విభాగం సూపరిండెంట్... బాలింతలకు ఎండాకాలంలో వేడి నుంచి ఉపశమనం కలిగించే కూలర్లు ఎత్తుకుపోయారు. ఓ దాత మంచి మనసుతో ఇచ్చిన మూడు కూలర్లు ఎవరికీ అనుమానం రాకుండా ఆసుపత్రి సిబ్బందికి చెందిన ఓ ఆటోలో ఇంటికీ తరలించారు. ఇప్పుడు ఆ విషయం ఆసుపత్రిలో కలకలం రేపుతోంది.
ఆసుపత్రిలో ఏ.సి.లు, ఫ్యాన్స్ పని చెయ్యక రోగులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మానవత్వం లేని కొందరు ఉద్యోగులు మాత్రం వక్రబుద్దితో ఆసుపత్రికి వచ్చే కూలర్లను దోచుకెళ్ళడంతో తోటి సిబ్బంది నివ్వెరపోతున్నారు. మాత శిశు కేంద్రం పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఓ రిటైర్డ్ డిఎం&హెచ్‌వోను ఏ.వోగా నియమించింది. పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. సదరు అధికారి జీతం తీసుకోవడంలో చూపిన శ్రద్ద పర్యవేక్షణలో చూపకపోవడంతో ఎక్కడ వేసిన గోంగడి అక్కడే అన్న చందంగా తయారైంది.
దాతలు ఇచ్చిన మూడు కూలర్లలో రెండు కూలర్లు మాయం చేసిన సదరు ఉద్యోగి వాటితోపాటు దొంగకు చెప్పు లాభం అన్నట్టుగా చెప్పుల స్టాండును సైతం ఎత్తుకెళ్ళడంతో తోటి సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పైగా సదరు ఉద్యోగి ఎవరికీ అనుమానం రాకుండ విధులకు సెలవు పెట్టి సివిల్ డ్రెస్‌లో వచ్చి ఆటోను పిలిచి ఎత్తుకెళ్ళడం దొంగతనం కూడా దొరలాగా చేయాలి అనే నానుడిని తలపిస్తుంది.
లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ ఇదేం బుద్ది అంటూ తోటి ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఇప్పటీకే సదరు ఉద్యోగిపై ఆసుపత్రిలో పలు ఆరోపణలు ఉన్నా... క్రమశిక్షణ చర్యలు లేకపోవడంతో రెచ్చిపోయి ఆసుపత్రి సొమ్ము దోచేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైన అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారో.. లేక ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు దోచుకునేందుకు తలుపులు తెరుస్తారో అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు జనం. అయితే ఈ విషయం మీడియాకు చేరిందని తెలుసుకున్న సదరు ఉద్యోగి తిరిగి వాటిని తీసుకుని వచ్చినట్లు సమాచారం.