Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణకు కరీంనగర్ తో సినీ రాజకీయ అనుబంధం, సంభవం మూవీ అంబేడ్కర్ డైలాగ్ ఇక్కడే!
Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణకు కరీంనగర్ తో ప్రత్యేక అనుబంధం ఉందని నగరవాసులు అంటున్నారు. కృష్ణ నటించిన సంభవం సినిమాలో కీలక సన్నివేశం కరీంనగర్ కమాన్ వద్ద షూట్ చేశారు.
Super Star Krishna : ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణకు కరీంనగర్ తో ప్రత్యేక అనుబంధం ఉందని నగర ప్రముఖులు అంటున్నారు." సంభవం" అనే సినిమా షూటింగ్ లో భాగంగా కృష్ణ మొట్ట మొదటిసారి కరీంనగర్ కు విచ్చేశారు. నగరంలోని కమాన్ ప్రాంతంలో జరిగిన షూటింగ్ లో ఆయన పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ పై ఆయన చెప్పిన డైలాగులు నేటికీ చెరగని ముద్రగా నిలిచిపోయాయని చెప్పొచ్చు. సాయుధ పోరాటం, నక్సలిజంపై ఆయన ధైర్యంగా సినిమాలు చేశారు. తెలంగాణ నేపథ్యంలో అనేక చిత్రాలలో ఆయన నటించి మెప్పించారు. సంవత్సరానికి 15 సినిమాలకు పైగా చేస్తూ.. మొత్తం 350 సినిమాల్లో ఆయన నటించారు. 1998 సంవత్సరంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మెట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి కొమిరెడ్డి జ్యోతిదేవికి మద్దతుగా ఆయన ఇక్కడ ప్రచారం చేశారు. ప్రధాని రాజీవ్ గాంధీ సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా గెలిచారు.
వెండితెరపై ఎన్నో ప్రయోగాలు
మంచి మనసు కలిగిన సూపర్ స్టార్ కృష్ణ మరణం బాధాకరమని ఫిలిం క్రిటిక్ పొన్నం రవిచంద్ర అన్నారు. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం.. వీటి కలబోతే కృష్ణ అని కొనియాడారు. అటువంటి మహా మనిషి మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని చెప్పారు. కృష్ణ వెండితెరపై ఎన్నో ప్రయోగాలు, సాహసాలు చేస్తూ... తిరుగులేని స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్నారని చెప్పారు. కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలను ఎందరినో ఆయన సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారని గుర్తుచేశారు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసి 350కి పైగా సినిమాలలో నటించిన కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులందరికీ కరీంనగర్ ఫిలిం సొసైటీ వ్యవస్థాపక సభ్యులు, సినీ విమర్శకులు పొన్నం రవిచంద్ర సంతాపం తెలిపారు.
రాజకీయ ప్రస్థానం
సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణ. సినీ పరిశ్రమలో ఎలాంటి కొత్త మార్పు తేవాలన్నా ముందుగా ఆయనే అడుగు వేస్తారని చెబుతారు. అలాంటి డేరింగ్ కృష్ణ రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేశారు. కానీ కొంచెం కాలమే. ఆయన లోక్‌సభ మాజీ ఎంపీ ఈ తరంలో చాలా మందికి తెలియదు. అప్పట్లో ఆయన రాజకీయ పోరాటం ఓ రేంజ్‌లో ఉండేది. ఆ వివరాలు మీ కోసం.
మొదట్లో ఎన్టీఆర్‌కు సపోర్ట్ తర్వాత విరోధం !
సినీ పరిశ్రమ నుంచి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయనకు సినీపరిశ్రమ పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచింది. సూపర్ స్టార్ కృష్ణ కూడా ఎన్టీఆర్ తొలి ఎన్నికలు ఎదుర్కొనే ముందు ఈనాడు అనే సినిమాను తీశారు. అది తెలుగుదేశం పార్టీ విధానాలకు అనుకూలంగా ఉండటంతో.. టీడీపీకి ప్లస్ అయింది. అయితే తర్వాత ఏం జరిగిందో కానీ.. కృష్ణ ఎన్టీఆర్‌కు దూరమయ్యారు. నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ సమయంలో కృష్ణ ఆయనకు సపోర్ట్ చేస్తూ ఫుల్ పేజీ పేపర్ ప్రకటన ఇచ్చారు. దాంతో ఎన్టీఆర్ -కృష్ణ ప్రత్యర్థులయ్యారు.
ఏలూరు ఎంపీగా గెలిచిన కృష్ణ
ఇందిరా గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రాజీవ్ గాంధీతో సూపర్ స్టార్ కృష్ణకు స్నేహం కుదిరింది. ఎన్టీఆర్‌ను అప్పటికే తీవ్రంగా వ్యతిరేకిస్తూండటంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనను ప్రోత్సహించింది. ఎన్టీఆర్ లాంటి ఛరిష్మా ఉన్న నేతకు.. కృష్ణ ధీటైన సమాధానం చెప్పగలరని భావించింది. కృష్ణ కూడా.. ఎన్టీఆర్ విధానాలను వ్యతిరేకిస్తూ అనేక సినిమాలు రూపొందించారు. కొన్ని కొన్ని సినిమాల విడుదలకు ఆటంకాలు కూడా ఎదురయ్యేవి. అయితే కృష్ణ మాత్రం వెనక్కి తగ్గలేదు. తర్వాత నేరుగా ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. రాజీవ్ గాంధీ ప్రోత్సాహంతో 1989లో ఏలూరు నుంచి లోక్‌సభకు పోటీ చేసి 71వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే తర్వాత రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడంతో రెండేళ్లకే మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. 1991లో మధ్యంతర ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడంతో కాంగ్రెస్ పార్టీలో ఆయనను గుర్తించే వారు తగ్గిపోయారు. గుంటూరు నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపినా ఎవరూ పట్టించుకోలేదని.. చెబుతారు.