Satavahana University: శాతవాహన యూనివర్శిటీలో ఎలుగుబంటి హల్ చల్, ఆందోళనలో విద్యార్థులు
Satavahana University: కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్శిటీలో ఎలుగుబంటి హల్ చల్ చేసంది. యూనివర్శిటీలోని గర్ల్స్ హాస్టల్ గేటు ముందు ఎలుగుబంటిని ఓ విద్యా్ర్థిని చూసి వీడియో తీసింది.
Satavahana University: కరీంనగర్(Karimnagar) జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్(Girls Hostel) గేటు ముందు వెళ్తోన్న ఎలుగు బంటిని ఓ విద్యార్థిని గుర్తించింది. వెంటన తన సెల్ ఫోన్ లో వీడియో తీసింది. శుక్రవారం ఉదయం మూడున్నర నాలుగు గంటల ప్రాంతంలో హాస్టల్ ముందు కుక్కల అరుపులు వినబడడంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఎలుగుబంటిని చూసి వెంటనే గేట్లు మూసివేశారు. గతంలో కరీంనగర్ పట్టణంలోకి వన్యమృగాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
గ్రానైట్ తవ్వకాలతో గుట్టలు మాయం
కరీంనగర్ గతంలో ఒక చిన్న పట్టణం మాదిరిగా ఉండేది. చుట్టుపక్కల విస్తారమైన అడవులు, భారీ గుట్టలతో పచ్చగా కళకళలాడుతూ ఉండేది. అయితే గ్రానైట్(Granite) క్వారీల వల్ల చుట్టూ ఉన్న గుట్టలు క్రమక్రమంగా మాయమవడం మొదలయ్యాయి. గ్రానైట్ తవ్వకాలతో ఒక్కోక్క గుట్ట అదృశ్యమవుతూ వచ్చింది. మరోవైపు అటు పర్యావరణ శాఖ నుంచి కానీ ఇటు అటవీశాఖ నుంచి కానీ ఎలాంటి చర్యలు లేకపోవడంతో దాదాపు 25 కిలోమీటర్ల ప్రాంతం వరకూ వన్యప్రాణులకు ఉండేందుకు అవకాశాలు లేకుండా పోవడంతో ఎలుగుబంట్లు, చిరుతపులులు, కోతులు, నెమళ్లు లాంటి అనేక అడవి మృగాలు, పక్షులు పట్టణంలోకి ప్రవేశించడం మొదలైంది.
ఫారెస్ట్ రేంజ్ అధికారులను అప్రమత్తం చేసిన రిజిస్ట్రార్
ప్రస్తుతం ఉన్న శాతవాహన యూనివర్సిటీ గతంలో ఒక అడవి(Forest) మాదిరిగా ఉండేది. ఇక్కడ 200 ఎకరాల్లో శాతవాహన యూనివర్సిటీ ప్రారంభించడంతో దీనికి సంబంధించిన భూములను పూర్తిస్థాయిలో కాపాడుకోవడానికి ప్రహరీగోడతో పాటు వివిధ రకాల భవనాలను నిర్మించారు. ఇందులో భాగంగానే గర్ల్స్ హాస్టల్ సైతం ప్రధాన బిల్డింగ్ కి పడమర వైపుగా నిర్మించారు. అయితే ఇక్కడ దాదాపు 300 మంది విద్యార్థినులు ఉంటున్నారు. ఎలుగుబంటి సంచారం గురించి తమకు తోటి విద్యార్థినుల ద్వారా సమాచారం అందడంతో అప్రమత్తమయ్యామని హాస్టల్ విద్యార్థినులు అంటున్నారు. మరోవైపు ప్రత్యక్షంగా సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఉండి ఆ ఎలుగుని చూశానని, కుక్కల అరుపులతో ఎలుగుబంటి చెరువు ఉన్న ప్రాంతం వైపు పారిపోయిందని సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి అంటున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఫారెస్ట్ రేంజ్(Forest Range) అధికారులు, పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశామని విద్యార్థినులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రిజిస్ట్రార్ వరప్రసాద్ అంటున్నారు.