Revanth Reddy On Drugs : డ్రగ్స్ కేసులో ఈడీకి ఎందుకు సహకరించట్లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి
Revanth Reddy On Drugs : డ్రగ్స్ కేసు విచారణపై రేవంత్ రెడ్డి మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. డ్రగ్స్ పై సీఎం కేసీఆర్ ఉక్కుపాదం మోపుతానన్నారని, కానీ వాస్తవానికి అలా జరగడంలేదని ఆరోపించారు.
Revanth Reddy On Drugs : డ్రగ్స్ కేసు విచారణలో టీఆర్ఎస్ ప్రభుత్వం(TRS Govt)పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్ (CM KCR) రాష్టంలో గుట్కా లేదు మట్కా లేదు గుడుంబా లేదు, పేకాట లేదు అని ఎన్నోసార్లు చెప్పారని, కానీ అవన్నీ అవాస్తవాలని రేవంత్ రెడ్డి ఆరోపించారు. విద్యా సంస్థల్లో డ్రగ్స్(Drugs) మహమ్మారి విస్తరిస్తోందన్నారు. ఈ విషయంలో 2017 నుంచి విచారణ అధికారులను అప్రమత్తం చేస్తున్నానన్నారు. డ్రగ్స్ గురించి మాట్లాడితే హైదరాబాద్(Hyderabad) బ్రాండ్ ఇమేజ్ పోతుందని కేటీఆర్, బాల్క సుమన్ లాంటి వాళ్లు పెద్ద పెద్ద ప్రగల్బాలు పలికారని, సింగరేణి కాలనీలో బాలిక అత్యాచారం గంజాయి మత్తులో చేసింది కాదా? అని ప్రశ్నించారు. దూల్ పేట్ గుడుంబా స్థావరాలపై దాడులు చేశారు కానీ వారికీ ప్రత్యామ్నాయం కల్పించలేదన్నారు. అందుకే వాళ్లు గంజాయి అమ్ముతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
2017 డ్రగ్స్ కేసు ఏమైంది
స్కూల్స్ నుంచి కాలేజెస్ వరకు డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ పరిధిలో కాంగ్రెస్ హయాంలో 4 పబ్స్ ఉంటే, ఇవాళ 90 పబ్స్ ఉన్నాయన్నారు. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ లో నైట్ బయటికి వెళ్లాలంటే తనకు కూడా భయం అవుతుందన్నారు. 2017 డ్రగ్స్ కేసు ఏమైందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కేసు ఎందుకు అటక ఎక్కిందన్నారు. ఆకున్ సభర్వాల్ ను అర్థాంతరంగా బదిలీ ఎందుకు చేశారన్నారని ప్రశ్నించారు. అప్పుడు 12 ఎఫ్ఐఆర్ పెట్టామన్నారు అవి ఏమయ్యాయని ప్రశ్నించారు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అన్నీ విచారణ సంస్థలకు ఫిర్యాదు చేసిన ఎందుకు విచారణ చేపట్టలేదన్నారు.
ఈడీకి సాక్ష్యాలు అందించాలి
తెలంగాణ(Telangana) యువతను, ప్రజలను డ్రగ్స్ నుంచి కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. నైజీరియా నుంచి వచ్చిన వాళ్లు రాజ్యం ఏలుతున్నారన్నారు. ఈడీ విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించిందన్నారు. ప్రభుత్వం ఈడీ విచారణను వ్యతిరేకిస్తుందన్నారు. ప్రభుత్వం సహకరించట్లేదని ఈడీ(ED) క్లియర్ గా చెప్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఎక్సైజ్ శాఖ దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నా ఈడీకి ఇవ్వట్లేదని ఆరోపించారు. గుజరాత్, ముంబయి పోర్టులలో 100 క్వింటాల్ డ్రగ్స్ పట్టుబడ్డాయన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర సంస్థలతో విచారణ జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎక్సై్జ్ శాఖ సేకరించిన అన్ని ఆధారాలు, సాక్ష్యలు, వెంటనే ఈడీకి ఇవ్వాలన్నారు.
12 నెలల్లో అధికారంలోకి వస్తాం
డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతా అని సీఎం కేసీఆర్ అన్నారని, కానీ ఎటువంటి చర్యలు లేవని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సగం హైదరాబాద్ మత్తులో ఊగుతోందన్నారు. 1000 మందితో ఒక విభాగం ఏర్పాటు చేశామని చెప్తున్నారని అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీకి ఎందుకు సహకరించట్లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. "కేటీఆర్ కు వైట్ ఛాలెంజ్ విసిరాం, వైట్ ఛాలెంజ్(White Challenge) అంటే డ్రగ్స్ తీసుకోలేదని బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం, విశ్వేశ్వర్ రెడ్డికి, కేటీఆర్ కు సవాలు విసిరాను. వెంటనే కేటీఆర్ కోర్ట్ వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అందుకే నేనేమి మాట్లాడాను. మీరు సేకరించిన డేటా, ఆధారాలు, ఈడీ కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. మీ భయానికి గల కారణాలు ఏంటి, మీరు ఎవరిని కాపాడాలని చూస్తున్నారు. డ్రగ్స్ డీలర్ టోనీకి సంబంధించిన డిజిటల్ డేటా ఇవ్వాలని కోరుతున్నాను. తెలంగాణ మరో పంజాబ్ కానివ్వను. డ్రగ్స్ వాడే వాళ్లు ఎంత పెద్దవాళ్లు అయినా సరే చర్యలు తీసుకోండి. సినీ పరిశ్రమ ప్రముఖులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. డ్రగ్స్ వాడకుండా చూడండి. మీ ఇండస్ట్రీలో కొంతమంది చేసే తప్పుల వల్ల మొత్తం ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇండస్ట్రీని డ్రగ్స్ నుంచి కాపాడండి. 12 నెలల్లో కాంగ్రెస్(Congress) అధికారంలోకి వస్తుంది రాసి పెట్టుకోండి. అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ దొంగల అంతు చూస్తాం. 2023 మర్చిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది." అని రేవంత్ రెడ్డి అన్నారు.