Karimnagar News : కరీంనగర్ వైద్యుల వినూత్న ట్రీట్మెంట్, డాన్స్ థెరపీతో యువకుడిలో చలనం!
Karimnagar News : కరీంనగర్ వైద్యులు ఓ రోగికి వినూత్నరీతిలో ట్రీట్మెంట్ చేశారు. డాన్స్, మ్యూజిక్ థెరపీతో వైద్యులు అందించిన చికిత్స సత్ఫలితాలు అందించింది. దీంతో యువకుడిలో చలనం వచ్చింది.
Karimnagar News : శంకర్ దాదా MBBS సినిమాలో రోగుల్ని ప్రేమతో పలకరించి, వారికి ట్రీట్ మెంట్ చేస్తే ఎంతటి రోగానైనా నయం చేయవచ్చు అని మెగాస్టార్ చిరంజీవి చెబుతారు. అది సినిమా కాబట్టి ఏదైనా సాధ్యం అనుకుంటారు. కరీంనగర్ వైద్యులు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అసలు చలనం లేకుండా వచ్చిన వ్యక్తికి మ్యూజిక్, డాన్స్ ట్రీట్ మెంట్ తో వైద్యం అందిస్తూ అతడి పరిస్థితిని మెరుగుపర్చారు. కోమాలోకి ఉన్న పేషెంట్లు తమ శరీర భాగాలను కదిలించలేరు. ఇటువంటి పరిస్థితుల్లో వారిని తిరిగి మామూలు మనుషులుగా చేయడానికి వైద్యులు వివిధ రకాలుగా వైద్యం చేస్తుంటారు. ఇలాగే కరీంనగర్ లోని ఓ హాస్పిటల్ నర్స్ లు వినూత్నంగా డ్యాన్సులు చేస్తూ పేషెంట్ లో కదలికలు తెచ్చేందుకు ప్రయత్నించారు.
మ్యూజిక్, డాన్స్ థెరపీ
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గొల్లపల్లికి చెందిన శ్రీనివాస్ లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. సరైన మోతాదులో ఆక్సిజన్ కూడా అందక పోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాదాపు నెల రోజుల క్రితం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చివరకు అతనికి చేసిన ట్రీట్మెంట్ ఫలించడంతో ఆరోగ్యం కుదుటపడింది. తమ వారిని గుర్తించడం, చేతుల్లోనూ కాళ్లలోనూ స్పందించే గుణం వచ్చింది. హాస్పిటల్ కి చెందిన వైద్యులు, నర్సులు చేసిన వినూత్న ట్రీట్ మెంట్ వల్లే ఇది సాధ్యపడిందని రోగి బంధువులు అంటున్నారు. డాన్స్ థెరపీ , మ్యూజిక్ థెరపీని వాడుతూ పేషెంట్ ని ఉత్సాహపడేలా ప్రోత్సహించారు. బుల్లెట్ బండి పాటతో సహా అనేక ట్రెండింగ్ పాటలకు నృత్యం చేస్తూ పేషెంట్ స్వయంగా కాళ్లు చేతులూ కదిలించేలా చేయడంతో అతను కూడా ట్రీట్మెంట్ కి స్పందించడం మొదలుపెట్టారు. నిజానికి ఇప్పటికే వివిధ దేశాల్లో, మెట్రో నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈ టైప్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. పేషెంట్ స్వయంగా స్పందించేలా ప్రయత్నం చేశామని ఆసుపత్రి డాక్టర్లు అంటున్నారు.
వైద్యులు ఏమన్నారంటే?
"25 రోజు క్రితం 28 ఏళ్ల యువకుడు చాలా సీరియస్ కండీషన్ లో మా ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. అతడికి జాండీస్ సోకింది. కాళ్లు, చేతుల్లో ఎలాంటి చలనం లేదు. నాలుగైదు రోజులు బతుకుతాడా అనే డౌట్ వచ్చింది. పది రోజుల వరకు అసలు చలనం లేదు. వెంటిలేటర్ పై ఉంచి వైద్యం చేశాం. ఫిజియోథెరపీ చేసి యువకుడి పరిస్థితిని కొంచెం మెరుగుపర్చాం. యువకుడి పరిస్థితిని చూసి మరో విధంగా వైద్యం ట్రై చేద్దామని మ్యూజిక్, డాన్స్ థెరపీ మొదలు పెట్టాం. దీంతో యువకుడిలో వేగంగా మార్పు వచ్చింది. కాళ్లు, చేతులు ఆడించడం మొదలుపెట్టాడు. తన బంధువులను గుర్తుపడుతున్నాడు. ఈ విధంగా మరికొన్ని రోజులు చేస్తే అతడు ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందనే నమ్మకం ఉంది." రవి కుమార్, వైద్యులు
(డా.రవికుమార్)