Karimnagar Corporation: అధికారుల తీరుతో కరీంనగర్ కార్పొరేషన్ ఆదాయానికి గండి!
Karimnagar Corporation: కరీంనగర్ కార్పొరేషన్ లో ఆదాయం పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు తీరుతో ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Karimnagar Corporation: ఒకవైపు టెక్నాలజీని వాడుతూ ప్రభుత్వ శాఖలు రకరకాల పన్నుల వసూళ్లకు కొత్త విధానాలను అవలంభిస్తున్నాయి. అయితే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ జారీ విధానంలో మార్పులు చేసి సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినా కూడా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ఒక వైపు బల్దియాకు వచ్చే ఆదాయం రాబట్టుకోవాలని, బడ్జెట్ కౌన్సిల్ సమావేశంలో గతంలోనే పాలకవర్గ సభ్యులు కోరగా.. అప్పటికప్పుడు నగర మేయర్ వై. సునీల్ రావు సైతం తీర్మానం చేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా వాణిజ్యపరమైన అనుమతులు జారీ చేసేందుకు దరఖాస్తు చేసిన వారికి తిప్పలు తప్పడం లేదు. ఓ దశలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి దుకాణాల వారీగా ట్రేడ్ లైసెన్స్ జారీ చేయాలి అనే ఆలోచన సైతం మర్చిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి.
నెలల తరబడి పెండింగ్ లో ఉంచడం వల్లే..
పురపాలక శాఖ ట్రేడ్ లైసెన్సుల జారీ ప్రక్రియ పూర్తిగా ఆన్ లైన్ పరిధిలోకి తీసుకొచ్చింది. అందులోనే దరఖాస్తు చేసుకుంటే శానిటేషన్ విభాగం ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది. 2021- 22 ఆర్థిక సంవత్సరానికి గానూ పురపాలిక వెబ్ సైట్ లో ఈనెల 21 వరకు పరిశీలిస్తే నగర పాలికలో 424 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు ఆమోదం తెలపకుండా ఉన్న దరఖాస్తులు 16 ఉన్నట్లు సమాచారం. వీటిని అలాగే పెండింగ్ లో ఉంచగా, డైరెక్ట్ గా వచ్చే వాటిని మాత్రం పరిగణలోకి తీసుకుంటున్నారు. ఆన్ లైన్ లో వచ్చినవి నెలల తరబడి పెండింగ్ లో ఉంచడంతో అర్జీదారులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. దీనిపై నగరానికి చెందిన ఎంఏ జమీల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కు... నగరపాలక కమిషనర్ కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నగర పరిధిలో దుకాణాల లైసెన్స్ జారీ చేస్తుండగా ఆ ప్రక్రియలో అనేక అనుమానాలు వస్తున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఏమైనా తేడా ఉంటే సరిచేసి ఫీజు వేయాలి..
ఒకే రోజు దరఖాస్తు చేసుకుంటే పరిశీలన, అనుమతులు, జారీ ఒకేసారి జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం రహదారుల వెడల్పును బట్టి వాణిజ్య, వ్యాపార దుకాణాలకు కొలతల ఆధారంగా ఫీజుల మదింపు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఏ షాప్ అయినా సరే చదరపు అడుగుల ఆధారంగా లెక్కించి, వివరాలు సక్రమంగా ఉందో, లేదో దరఖాస్తుదారుల ముందే తనిఖీ చేయాలి.ఒకవేళ ఏవైనా తేడా ఉన్నట్లయితే వెంటనే సరిచేసి ఫీజు వేయాల్సి ఉంటుంది. అలా చేయకపోవడం, కార్యాలయానికే పరిమితం కావడం క్షేత్ర స్థాయిలో పరిశీలించక ముందే ఆమోదించడం జరుగుతుంది.
అదాయం మెరుగయ్యే అవకాశం ఎక్కువ..
పాత బకాయిలు ఉన్నట్లయితే వాటిని సైతం వసూలు చేసుకోవాలి. కొన్ని వాణిజ్యపర సంస్థలకు పాత బకాయిలు చూసి చూడనట్లుగా ఉండి కొత్తగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసి అనుమతి ఇచ్చారని ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు పరిశీలించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీనివల్ల సిబ్బందికే అధరపు భారం తగ్గి మరోవైపు ఆదాయం కూడా మెరుగయ్యే అవకాశం ఉంది. పైగా కిందిస్థాయి సిబ్బంది ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా నిరోధించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.