Mlc Kavitha : గ్యాస్ ధరల పెంపుతో మళ్లీ కట్టెల పొయ్యి రోజులు, పాలు పెరుగు నెయ్యిపై పన్ను వేసిన ఘనత బీజేపీదే - ఎమ్మెల్సీ కవిత
Mlc Kavitha : చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పాలు పెరుగు నెయ్యి పై పన్ను వేస్తున్న ఘనత బీజేపీ ప్రభుత్వానిదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.
Mlc Kavitha : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ రామ్ లీలా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత , మంత్రులు గంగుల కమలాకర్ , సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.... తెలంగాణ సాధన కోసం తన పాటతో అలుపెరుగని పోరాటం చేసిన ఘనత రసమయిది అన్నారు. గాయకుడు పాలకుడైతే అభివృద్ధి ఎలా ఉంటుందో మానకొండూరు నియోజకవర్గాన్ని చూస్తే అర్థమవుతుందన్నారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతో రాబోయే ఎన్నికల్లో రసమయి 60 వేల ఓట్ల మెజారిటీతో మరోసారి గెలుస్తారన్నారు. మహిళా సంఘాలకు దేశంలో ఎక్కడా లేనివిధంగా 54 లక్షల మందికి 18 వేల కోట్ల రూపాయలను స్వాలంబన కింద అందిస్తున్నామన్నారు. వడ్డీ లేని రుణాలు అభయహస్తం త్వరలోనే విడుదల చేస్తామన్నారు. వీఏఓలకు యూనిఫామ్ లు ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. బిడ్డ లేకుంటే ఇల్లు గడవదు... సమాజమే ముందుకు పోదన్న కవిత.. ఇన్నాళ్లు ఇంటికి పరిమితమైన ఆడబిడ్డలు ఇప్పుడు ఉద్యోగం కోసం బయటకు వస్తున్నారన్నారు.
మహిళలకు ప్రతిరోజు మహిళా దినోత్సవరం కావాలి
"ఉద్యోగం కోసం బయటకు వచ్చే ఆడబిడ్డలకు భద్రత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆడబిడ్డలో ఆత్మస్థైర్యం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ ది. గత ప్రభుత్వాల హయాంలో ఆడబిడ్డలను ఉన్నత చదువుల కోసం పక్క ఊరుకు పంపించాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉండేది. కానీ 8000 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలల్లో ఆడపిల్లలకు టాయిలెట్లు నిర్మిస్తున్నాం. ఇల్లు అద్దెకు దొరకకుండా ఇబ్బందులు పడుతున్న దళిత బిడ్డల కోసం ఎస్సీ డిగ్రీ కాలేజీలు హాస్టలను ఏర్పాటు చేశాం. పోలీస్ శాఖతోపాటు ఇతర శాఖల్లో తెలంగాణ ప్రభుత్వం 33% రిజర్వేషన్లు అమలు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల పాటు నిరంతరాయంగా కరెంటు ఇవ్వడంతో రాష్ట్రానికి కొత్తగా 20 వేల కంపెనీలు వచ్చాయి. కంపెనీల రాకతో తెలంగాణలో 30 లక్షల కొలువులు పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా రెండున్నర లక్షల కొలువులు ఇస్తుంది. ఏది తోడున్నా లేకున్నా... ఆడబిడ్డకు తాను చదువుకున్న చదువు.. జీవిత కాలం తోడుంటుంది. ఎంత కష్టమైనా సరే ఆడబిడ్డ తన చదువుకున్నంత వరకు చదివిద్దాం. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆడబిడ్డలు ఆర్థిక సాధికారత వైపు అడుగులు వేయాలి. మహిళలకు ప్రతిరోజు మహిళా దినోత్సవం కావాలి." - ఎమ్మెల్సీ కవిత
మళ్లీ కట్టెల పొయ్యి పెట్టుకునే రోజులు
తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జాతీయస్థాయిలో అమలు చేసేందుకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా అవతారం ఎత్తిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ఘనత సీఎం కేసీఆర్ ది అన్నారు. సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం త్వరలోనే మూడు లక్షల అందిస్తామన్నారు. పనిచేసే నాయకులను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందన్న ఆమె.. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పాలు పెరుగు నెయ్యి పై పన్ను వేస్తున్న ఘనత బీజేపీ ప్రభుత్వానిదన్నారు. బీజేపీ పాలనలో నిత్యవసర సరుకుల ధరలు పెరిగాయని విమర్శించారు. గ్యాస్ ధరల పెంపుతో మళ్లీ కట్టెల పొయ్యి పెట్టుకునే రోజులు వచ్చాయన్నారు. ప్రజలపై భారాన్ని తగ్గించే ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందన్నారు.