KA Paul: ఆ న్యూస్ ఛానెళ్లు చూడొద్దు, నేను శపిస్తే ఆ ఓనర్లు నాశనమే - కేఏ పాల్
AP Telangana News: కొన్ని మీడియా సంస్థల ఓనర్లు అమ్ముడు పోయారని కేఏ పాల్ తీవ్రమైన ఆరోపణలు చేశారు.
KA Paul fires on Media: మీడియాలో సీఈవోలు, సీనియర్ రిపోర్టర్లు, కెమెరా మెన్లకు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక సూచనలు చేశారు. అదే సమయంలో మీడియా సంస్థల అధినేతలపై తీవ్ర విమర్శలు చేశారు. వారిని శపిస్తానని హెచ్చరించారు. తన ప్రెస్ మీట్ లు లైవ్ కవరేజీ ఇవ్వకపోవడంపై కేఏ పాల్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని మీడియా సంస్థల ఓనర్లు అమ్ముడు పోయారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఓ రెండు ఛానెళ్లు తప్ప టాప్ 10 ఛానెళ్లు తన లైవ్ ఎవరూ ఇవ్వలేదని ఆవేదన చెందారు. ఈ మేరకు కేఏ పాల్ ఓ వీడియో విడుదల చేశారు.
కోర్టు ఆదేశాలపై తాను మాట్లాడుతుంటే తన ప్రెస్ మీట్ లకు లైవ్ కవరేజీ ఇవ్వడం లేదని అన్నారు. ‘‘మీడియా ఓనర్లు గమనించండి.. నేను శపించానంటే మీరు, మీ కుటుంబాలు నాశనం అయిపోతాయ్.. పనికిమాలిన వారివి అందరివి లైవ్ కవరేజీలు ఇస్తారా? ఫ్రంట్ పేజీల్లో వేస్తారా? దేవుడు మీ కుటుంబాల్ని సర్వనాశనం చేస్తాడు. నేను దేశం కోసం వచ్చా.. రాష్ట్రం కోసం వచ్చా.. ప్రజల కోసం వచ్చా. మీ కులంలో పుట్టలేదనా నన్ను వేరుగా చూస్తున్నారు. ఆ ప్యాకేజీ స్టార్ కు డే అండ్ నైట్ లైవ్ కవరేజీ ఇస్తారా? ఒక్క పని చేయని మోదీకి లైవ్ కవరేజ్ ఇస్తారా? ఓటు బ్యాంకు లేని షర్మిలకు డే అండ్ నైట్ లైవ్ కవరేజీ ఇస్తారా? ఇదా మీరు చేస్తున్న న్యాయం?
మీడియా గురించి ప్రజలకు చెప్తాను.. ఏ ఛానెళ్లు చూడొద్దని. అలాగే మీడియా సంస్థల ఓనర్లు డబ్బు ఎలా సంపాదించారు.. ప్రజా ప్రయోజనం వేసి మీ వెంట పడతా, ఎవ్వర్నీ క్షమించను. దేవుడు క్షమించడు. ప్రజలు క్షమించరు.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. న్యాయం చేయండి. కనీసం అందరికీ ఇచ్చినట్లు మాకు కూడా కవరేజీ ఇవ్వండి. లేదా దేవుడి ఉగ్రతకు గురవండి.. చరిత్రహీనులు కండి’’ అని కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు.