Telangana Assembly: రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు, కేఏ పాల్ ప్రశంసల వర్షం
KA Paul Visits Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీని కేఏ పాల్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
KA Paul praises Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశంసలు కురిపించారు. కేసీఆర్‌కు, రేవంత్ రెడ్డికి మధ్య అసలు పోలికే లేదని అన్నారు. కేసీఆర్ నియంత అయితే.. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రజా సేవకుడని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. వచ్చే అక్టోబర్ నుంచి తెలంగాణ ఆర్థిక పరిస్థితి మారబోతుందని తెలిపారు. రేవంత్ గొప్ప నాయకుడని, ఆయన మాట్లాడే ఇంగ్లీష్‌పై విమర్శలు చేయడం తెలివి తక్కువ తనం అని KA Paul అన్నారు. రష్యా ప్రెసిడెంట్‌కు కూడా ఇంగ్లీష్ రాదని, అయినా గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. ఇవాళ తన కొడలితో కలిసి తెలంగాణ అసెంబ్లీని కేఏ పాల్ సందర్శించారు. అన్ని పార్టీలకు చెందిన నేతలతో కాసేపు ముచ్చటించారు. అలాగే అసెంబ్లీ అధికారులను కూడా కలిశారు. తొలుత పాల్‌ను అసెంబ్లీలోకి సెక్యూరిటీ అనుమతించలేదు. ఆ తర్వాత పర్మిషన్ రావడంతో పాల్‌ను లోపలికి అనుమతించారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో పాల్ అసెంబ్లీకి రావడంతో అందరూ ఆశ్చర్యంగా చూశారు. అనంతరం పాల్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
రేవంత్ రెడ్డిని కలిసేందుకు అసెంబ్లీకి వచ్చానని, పార్లమెంట్ ఎన్నికలు అయ్యాక తాను, రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలకు వెళ్తామని పాల్ తెలిపారు. ఈ పర్యటనల ద్వారా తెలంగాణకు పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. అక్టోబర్ 2న హైదరాబాద్‌లో గ్లోబల్ పీస్ సమ్మిట్ ఏర్పాటు చేస్తున్నానని, దీని ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తామని అన్నారు. రేవంత్ రెడ్డి పాలన బాగుందని, ఆయన హయాంలో తెలంగాణ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుందనే నమ్మకం ఉందన్నారు. రేవంత్ రెడ్డి మంచి చేస్తున్నారని, ఆయనకు తన మద్దతు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అదానీ, అంబానీకి రూ.25 లక్షల కోట్లు మాఫీ చేశారంటూ బీజేపీపై పాల్ మండిపడ్డారు.
ఈ సందర్బంగా ఏపీ సీఎం జగన్‌పై పాల్ తీవ్ర విమర్శలు కురిపించారు. జగన్ పనికిరాని వ్యక్తి అని, ఏపీపై భారీ అప్పులు రుద్దాడని విమర్శించారు. జగన్ వేస్ట్ ఫెల్లో అని విమర్శించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తన పోటీపై కూడా కేఏ పాల్ క్లారిటీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాను విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానని పాల్ పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా భారతరత్న ఇవ్వాలని, పీవీ నరసింహరావుతో పాటు అడ్వానీకి భారతరత్న ప్రకటించడం హర్షనీయమని తెలిపారు. లోక్‌సభ మాజీ స్పీకర్లు బీఎంసీ బాలయోగి, పీఏ సంగ్మా, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు కూడా భారతరత్న ఇవ్వాలని పాల్ డిమాండ్ చేశారు. గొప్ప సేవలు చేసినవారికి భారతరత్న ఇవ్వాలని కోరారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని గతంలో కేంద్రమంత్రి రూపాలను కలిసి కోరానని, తన కోరిక ఇప్పుడు నెరవేరిందన్నారు. ఎన్టీఆర్ కన్నా గొప్పవారు ఎవరు ఉన్నారని, ఆయన అన్ని రంగాల్లో నెంబర్ వన్ అయ్యారన్నారు. కానీ ఎన్టీఆర్‌కు ఇప్పటివరకు సముచిత స్థానం ఇవ్వలేదని, కమ్మ కాబట్టి ఆయనకు భారతరత్న ఇవ్వలేదని పాల్ వ్యాఖ్యానించారు. భారతరత్న విషయంలో కుల, మతాలను చూడకూడదని అన్నారు.