Jayashankar Bhupalapalli: వీరాపూర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి వీరంగం... వాహనాన్ని కిలోమీటర్ దూరం వెంబడించిన పులి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వీరాపూర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి బీభత్సం సృష్టిస్తోంది. పెళ్లికి వెళ్లి వస్తోన్న ఓ వాహనాన్ని పెద్ద పులి కిలోమీటర్ మేర వెంబడించింది.
తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతోంది. పెళ్లికి వెళ్లి వస్తున్న ఓ వాహనాన్ని అడ్డుకుని దాడి చేసేందుకు పులి ప్రయత్నించింది. ఆ దారిలో పలు వాహనాలను వెంబడించింది. చంద్రుపల్లి దగ్గర రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. వివాహనికి వెళ్లి వస్తున్న టాటా ఎస్ వాహనాన్ని రాంప్ కెనాల్ నుంచి కుంట్లు గ్రామం వరకు పులి వెంబడించింది. కిలోమీటర్ వరకు పెద్ద పులి వాహనాన్ని వెంబడించడంతో ప్రయాణికులు హడలిపోయారు. పులి పాదముద్రలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. స్థానికులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పులిని కట్టడి చేయాలని ఫారెస్ట్ అధికారులను కోరుతున్నారు. పులికి హాని తలపెడితే చట్టరీత్యా చర్యలు చేపడతామని ఫారెస్ట్ అధికారుల హెచ్చరిస్తున్నారు.
Also Read: అత్త గొంతుపై గడ్డ పారతో పొడిచి చంపిన అల్లుడు, ఆ తర్వాత భార్యపై కూడా.. ఇంతలో..
వీరాపూర్ అడవిలో దున్నపోతుపై పులి దాడి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత వారం రోజులుగా పెద్ద పులి బీభత్సం చేస్తోంది. కాటారం మండలంలోని ఒడిపిలవంచలో ఆవుదూడను పెద్దపులి చంపింది. వీరాపూర్ అటవీ ప్రాంతంలో గేదెల గుంపుపై పులి దాడి చేసి దున్నపోతును ఎత్తుకెళ్లింది. గుమ్మాళ్లపల్లి కొందరు రైతులు అటవీ ప్రాంతానికి గేదెలు మందను మేతకు తోలుకెళ్లారు. హఠాత్తుగా పులి గేదెల గుంపుపై దాడి చేసిందని పశువుల కాపరులు తెలిపారు. పులి దాడిని గమనించి గేదెల కాపరులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో రక్తం మరకలు, పులి పాదాల గుర్తులను అటవీ అధికారులు సేకరించారు. పెద్ద పులి ఆచూకీ గుర్తించడానికి అటవీశాఖ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని తెలిపారు.
Also Read: డ్యూటీలో చేరేందుకు బయల్దేరిన సిద్దిపేట జవాను.. ఆచూకీ గల్లంతు, అందరిలో ఆందోళన
ట్రాకింగ్ కెమెరాలో పులి ఫొటోలు
అటవీ అధికారులు పెట్టిన ట్రాకింగ్ కెమెరాలో పులి జాడను గుర్తించారు. ట్రాకింగ్ కెమెరాకు పెద్ద పులి ఫొటోలు చిక్కాయి. గేదె కళేబరం వద్ద పులి ఫొటోలు ట్రాకింగ్ కెమెరాలో రికార్డయ్యాయి. కానీ ఈ ఫొటోలు ఇక్కడవి కాదని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. వేటగాళ్ల భయంతో పులి ఫొటోలు బయటకు రాకుండా చేద్దామని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారని సమాచారం. సోషల్ మీడియాలో పులి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read: జవాను సాయితేజ మరణంపై వీహెచ్ సంచలన కామెంట్స్.. సీఎంలు కేసీఆర్, జగన్‌పైన కూడా..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి