Bandi Sanjay : ఇరానీ ఛాయ్ అంటే ఇరాన్ లో చేస్తారా?, కేసీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్
Bandi Sanjay : మైసూర్ పాక్ , మైసూర్ బజ్జీలను మైసూర్ లో తయారు చేస్తారా అంటూ కేసీఆర్ చైనా బజార్లు విమర్శలకు కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్.
Bandi Sanjay : టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందని, ఇప్పుడు దిల్లీ పోయి వీఆర్ఎస్ అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జగిత్యాల బస్ స్టాండ్ చౌరస్తాలో ఆయన మాట్లాడారు. జగిత్యాల సీఎం కేసీఆర్ సభలో విద్యార్థులతో కుర్చీలు వేయించారని ఆరోపించారు. ఇంకా వారితో ఎన్నో పనులు చేయించారన్నారు. దేశంలో చైనా బజార్లు అని అంటున్న కేసీఆర్ కు సిగ్గుండాలన్నారు. చైనా బజార్లను భారత్ బజార్లుగా మార్చిన ఘనత మోదీదన్నారు. మైసూర్ పాక్, మైసూర్ బజ్జీలను మైసూర్ లో తయారు చేస్తారా? ఇరానీ ఛాయ్ అంటే.. ఇరాన్ లో చేస్తారా? ఆ మాత్రం తెలివి లేదా కేసీఆర్ కు అంటూ మండిపడ్డారు. వేములవాడ ఆలయాన్ని 'ప్రసాద్ స్కీం' కింద అభివృద్ధి చేద్దామంటే కేసీఆర్ సహకరించడం లేదని ఆరోపించారు. వేములవాడ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తానన్న కేసీఆర్ నేటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. బాసర ఆలయం అభివృద్ధికి రూ.120 కోట్లు అన్న కేసీఆర్ నిధులు విడుదల చేయలేదన్నారు. కొండగట్టు ప్రమాదంలో పేదోళ్లు చనిపోతే... ఒక్కసారైనా కేసీఆర్ వచ్చి, సంతాపం ప్రకటించారా? ఆ బాధిత కుటుంబాలను ఆదుకున్నారా? అని ప్రశ్నించారు.
సమైక్యాంధ్ర నేతలకు కేసీఆర్ కుమ్మక్కు
అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన వాళ్లపై సీబీఐ, ఈడీ విచారణ జరపాల్సిందే అన్నారు బండి సంజయ్. మోదీ పేరు చెప్పి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు. రైతుల మోటార్లకు కేసీఆర్ మీటర్ పెడితే బయటికి గుంజుతామన్నారు. జగిత్యాలలో ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతుబంధు, రైతు రుణమాఫీ, దళిత బంధు, దళితులకు మూడెకరాలు ఇచ్చారో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో సమైక్యాంధ్ర నాయకులతో కుమ్మక్కై, కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు ఇద్దరు కలిసి కాంట్రాక్టులు చేస్తూ కమీషన్లు తీసుకుంటున్నారని విమర్శించారు. సెంటిమెంట్ రగిలించి, రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పుట్టబోయే బిడ్డపైన లక్ష రూపాయల అప్పు పెట్టారని ఆరోపించారు.
జగిత్యాల నుంచి వలసలు
"తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత, మనం ఏం సాధించుకున్నాం?. రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కుటుంబ పోషణ కోసం టెన్త్ క్లాస్ చదివే పిల్లోడు కూడా దుబాయ్ కి వలసపోతున్న పరిస్థితి. ఈ జగిత్యాల నుంచే రోజు 5 బస్సులు ముంబయికి వలస పోతున్నాయి. కార్మికుల ఇబ్బందులను మాటల్లో వర్ణించలేను. ఇప్పటికీ విదేశాల్లో వేల మంది వలస కార్మికులు జైళ్లలో మగ్గుతున్నారు. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు 500 కోట్ల రూపాయలతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తానన్నారు కేసీఆర్. మరి ఏర్పాటు చేశారా? నేటికీ గల్ఫ్ కార్మికులు బిచ్చమెత్తుకునే పరిస్థితి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిలువ నీడలేని వాళ్లకు ఇండ్లను కట్టించి ఇస్తామని హామీ ఇచ్చాం. ఈ ఎనిమిదేళ్లలో పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్నీ కేసీఆర్ ఆదుకోలేదు. బీజేపీ వస్తే 'ఫసల్ బీమా యోజన' పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి, రైతులను ఆదుకుంటాం. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే మతతత్వం రెచ్చగొట్టినట్టా?" - బండి సంజయ్
పీఎఫ్ఐకు టీఆర్ఎస్ నిధులు!
సంఘవిద్రోహ శక్తులకు జగిత్యాల అడ్డాగా మారిందని బండి సంజయ్ ఆరోపించారు. PFI ఇక్కడ ర్యాలీలు తీస్తుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. PFI అనే ఒక దుర్మార్గపు సంస్థకు, నిషేధిత సంస్థకు కేసీఆర్ ఫండింగ్ చేస్తున్నారని ఆరోపించారు. PFI సపోర్టర్స్ ను కాల్చిపారేయండంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దిల్లీ నుంచి NIA వచ్చి, ఇక్కడ PFI వాళ్లను అరెస్ట్ చేసే వరకు ఇక్కడి ఇంటెలిజెన్స్ అధికారులకు తెలియలేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలోని రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందన్నారు. తెలంగాణలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చన్నారు. 'తెలంగాణ రాష్ట్ర సమితి' పేరు నుంచి 'తెలంగాణ' పదాన్ని తీసి పడేశారని, తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ మోసం చేశారన్నారు. బీఆర్ఎస్ అంటే లండన్ లో ఒక జిన్(మందు) పేరని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణ తల్లికి ద్రోహం చేశారని బండి సంజయ్ విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఒకసారి ఆలోచించాలన్నారు. ఆ పార్టీలో మీరెప్పటికీ ముఖ్యమంత్రి కాలేరన్నారు. కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలని చూస్తున్నారన్నారు. ఆ పార్టీలో ఇంకెవరికీ ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా? అని ప్రశ్నించారు.
మోదీ సింగిల్ వచ్చే సింహం
"కేసీఆర్ దిల్లీ పోయి రాజశ్యామల యాగం చేస్తాడట. దిల్లీలో పూజలు చేస్తున్న సందర్భంగా... నువ్వు ఎన్ని హామీలు ఇచ్చావో ముందు ప్రజలకు చెప్పు. అప్పుడే రాజశ్యామల యాగం కు సార్ధకత ఉంటుంది. ఒక మోదీని అడ్డుకునే దమ్ములేక, గుంటనక్కలన్నీ కలిసి వస్తున్నాయి. నరేంద్రమోదీ సింగిల్ గా... సింహంలా వస్తారు. తెలంగాణలో బీజేపీ ఒకసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం" - బండి సంజయ్