Indira Shoban Resigns: వైఎస్ షర్మిలకు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా, మళ్లీ పాత గూటికే వెళ్తారా?
తాను పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఇందిరా శోభన్ ఓ ప్రకటనలో ఆమె తెలిపారు. తన రాజీనామా లేఖను వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పంపినట్లు చెప్పారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. పార్టీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణలో అడుగు పెట్టినప్పటి నుంచి అండగా ఉన్న కీలక నేత ఇందిరా శోభన్ రాజీనామా చేశారు. ఈ మేరకు తాను పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఇందిరా శోభన్ ఓ ప్రకటనలో ఆమె తెలిపారు. తన రాజీనామా లేఖను వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పంపినట్లు చెప్పారు. అయితే, తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే వివరాలను ఇందిరా శోభన్ వివరించారు.
మీరు కోరుకున్నట్లుగానే చేశా..
‘‘అందరికీ నమస్కారం.. నన్ను ఆదరిస్తూ, అభిమానిస్తూ ప్రజాజీవితంలో ముందుకు నడిపిస్తున్న తెలంగాణ ప్రజలకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం కలిసి కోట్లాడినం. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలని కలలుగన్నం. వాటిని సాకారం చేసుకునేందుకు ప్రజలతో మమేకమైన నన్ను.. మీరంతా ఆశీర్వదిస్తూనే ఉన్నారు. అందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటా. ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకున్నా. అది మీరు కోరుకుంటున్నట్లుగానే షర్మిలక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశా’ అని ఆమె లేఖలో పేర్కొన్నారు.
షర్మిలక్క పార్టీలో ఉండకూడదని..
‘‘నా రాజీనామాకు కారణం ఏంటంటే.. అమరవీరుల ఆశయాల సాధన కోసం, అన్నదాతల జీవితాల్లో ఆనందం కోసం, యువతకు, నిరుద్యోగులకు న్యాయం కోసం, దళిత, బహుజనుల, సబ్బండ వర్గాల సాధికారత కోసం, మైనార్టీల బతుకు బాగుకోసం, గిరిజనుల జీవితాల్లో వెలుగుల కోసం, మహిళలకు సమాన వాటా కోసం, కొట్లాడుతూనే ఉన్నాను. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడుతూనే ఉంటా. అందుకు షర్మిలక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఉండకూడదని.. అభిమానులు, శ్రేయోభిలాషులు, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు నేను ఈ పార్టీకీ రాజీనామా చేశాను’’ అని కీలక నేత తన ప్రకటనలో వెల్లడించారు.
రాజీనామా తర్వాత..
‘‘భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తా. ప్రజాజీవితంలోనే ఉంటా. జనం కోసమే కదులుతా. ప్రజల కోసమే అడుగులు వేస్తా. ఇదే ఆదరాభిమానాలను ఇక ముందు కూడా మీ నుంచి నాకు ఉంటాయని, నన్ను నడిపిస్తారని తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాను. ఇన్నాళ్లు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో నాకు సహకరించిన ప్రతీ నాయకుడికి, కార్యకర్తలకు పేరు పేరునా ధన్యవాదాలు’’ అని ఇందిరా శోభన్ ప్రకటనలో తెలిపారు.
Also Read: Hyderabad: ఇంట్లోకి చొరబడి దొంగతనం.. కానీ మంచోడట! అవాక్కైన బాధితుడు.. ఎలాగంటే..
తెలంగాణలో వైఎస్ షర్మిల అడుగు పెట్టిన వెంటనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇందిరా శోభన్ ఆ పార్టీకి రాజీనామా చేసి షర్మిలకు మద్దతు పలికారు. ఏడాది కూడా గడవక ముందే ఇందిరా శోభన్ వైఎస్ఆర్‌టీపీని వీడుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే ఒకరిద్దరు వైఎస్ఆర్‌టీపీకి రాజీనామా చేయగా తాజాగా ఇందిరా శోభన్ కూడా వెళ్లిపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె పార్టీలో చేరినప్పట్నుంచి వైఎస్ఆర్‌టీపీ తరఫున పెట్టే సమావేశాలకు ఆమె కీలక కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. అంతేకాక, పార్టీ ఆవిర్భావం రోజున ఇందిరా శోభన్ స్పీచ్ కార్యకర్తల్లో ఎంతో ఉత్తేజం నింపింది. అయితే, గతంలోనే ఆమె రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డి నియమితులు కావడంతో ఆమె మళ్లీ కాంగ్రెస్ తీర్థమే పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది.
Also Read: Avanthi Srinivas Audio Tape: మంత్రి ఆడియో టేప్ హల్‌చల్.. మహిళతో ఆ మాటలు, స్పందించిన అవంతి శ్రీనివాస్