Indian Racing League: హైదరాబాద్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ రద్దు,ఎందుకంటే!
Indian Racing League: హైదరాబాద్ రేసింగ్ ఫ్యాన్స్‌కు చేదు వార్త. హైదరాబాద్‌లో జరగాల్సిన ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్‌ఎల్) రద్దయింది. ఎన్నికల కోడ్ కారణంగా పోటీల నిర్వహణకు అవాంతరం ఏర్పడింది.
Indian Racing League: హైదరాబాద్ రేసింగ్ ఫ్యాన్స్‌కు చేదు వార్త. హైదరాబాద్‌లో జరగాల్సిన ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్‌ఎల్) రద్దయింది. ఎన్నికల కోడ్ కారణంగా పోటీల నిర్వహణకు అవాంతరం ఏర్పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 4, 5 తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ ఫస్ట్ లెవెల్ పోటీలు హైదరాబాద్ హుసేన్‌సాగర్ తీరప్రాంతంలో జరగాల్సి ఉంది. ఈ మేరకు ఇండియన్ మోటార్ రేసింగ్ లీగ్ కోసం హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేపట్టింది. నెక్లెస్‌రోడ్డులోని స్ట్రీట్ సర్క్యూట్ పునరుద్ధరణకు అధికారులు చర్యలు ప్రారంభించారు.
గతంలో కార్ రేసింగ్ పోటీల సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్డు డివైడర్లు, బారికేడ్లు, ఎత్తైన కంచెలను తిరిగి ఏర్పాటు చేశారు. పోటీలు నిర్వహించే నాటికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అంతే కాదు ఇదే ట్రాక్‌పై ఫిబ్రవరి 10న ఫార్ములా–ఈ పోటీలు జరగాల్సి ఉంది. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎలాంటి లోపాలకు తావు లేకుండా ట్రాక్ పునరుద్ధరణ చేపట్టారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేసింగ్ లీగ్‌కు పోలీస్ భద్రత ఏర్పాట్లలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో పోటీలు రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
భద్రత ఏర్పాట్ల నేపథ్యంలో రేసింగ్ లీగ్‌ను హైదరాబాద్ నుంచి చెన్నైకి మారుస్తున్నట్లు నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేసింగ్ లీగ్ కోసం టిక్కెట్లు కొనుగోలు చేసిన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారందరికి త్వరలోనే డబ్బులు రీఫండ్ చేస్తామని తెలిపారు. వచ్చే నెల 10వ తేదీ వరకు నాలుగు లెవెల్స్‌లో ఫార్ములా-4 రేసింగ్ పోటీలు జరుగనున్నాయి.
హైదరాబాద్‌లో మరోసారి ఫార్ములా ఈ రేసింగ్
ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ రేసింగ్‌కు హైదరాబాద్ మరోమారు ఆతిథ్యమివ్వబోతోంది. దేశంలో తొలిసారి హైదరాబాద్ ఫార్ములా-ఈ రేసింగ్‌కు ఆతిథ్యమిచ్చింది. వచ్చే ఏడాది కూడా ఫార్ములా-ఈ పోటీలు హైదరాబాద్ వేదికగా జరుగనున్నాయి. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ ఆతిథ్యంపై నిరాధార వార్తలు వస్తున్న నేపథ్యంలో పోటీల నిర్వహణపై నిర్వాహకులు గురువారం ఓ ప్రకటనలో స్పష్టత ఇచ్చారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన హైదరాబాద్ వేదికగా పార్ములా-ఈ 10వ ఏబీబీ ఎఫ్‌ఐఏ సీజన్ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్‌లో మళ్లీ వచ్చే ఏడాది ఫార్ములా-ఈ కార్లు అభిమానులను అలరించబోతున్నాయి. గురువారం సమావేశమైన ఎఫ్‌ఐఏ వరల్డ్ మోటార్ స్పోర్ట్ కౌన్సిల్.. ఫార్ములా-ఈ 2024 వేదికలకు ఆమోదముద్ర వేసింది. దీంతో హైదరాబాద్‌లో మరో మారు రేసింగ్‌ను ఆస్వాదించే అవకాశం లభించింది.
ఫిబ్రవరిలో తొలి రేస్
ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కారు రేస్ అట్టహాసంగా జరిగింది. ఈ పోటీల్లో 25 పాయింట్లతో జా ఎరిక్ వా మొదటి స్థానంలో నిలవగా, నిక్ క్యాసిడి 18 పాయింట్లతో రెండో స్థానంలో, 15 పాయింట్లతో ఆంటోనియో ద కోస్తా మూడో స్థానంలో రేస్ ముగించారు. భారత మోటార్ స్పోర్ట్స్‌లో నూతన అధ్యయనానికి హైదరాబాద్ వేదికైందని నిర్వాహకులు అన్నారు. ఫార్ములా వన్ తర్వాత ఎక్కువ ఆదరణ ఉన్న ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ లో నిర్వహించడంపై ప్రశంసలు అందుకుంటున్నారు.