Amul In Telangana : హైదరాబాద్‌లో రూ.500 కోట్లతో అమూల్ భారీ ప్లాంట్ ... ప్రభుత్వంతో ఎంవోయూ !
హైదరాబాద్‌లో రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టాలని అమూల్ నిర్ణయం తీసుకుంది. దక్షిణాదిలో అమూల్ తొలి ప్లాంట్ హైదరాబాద్‌లోనే రానుంది.
తెలంగాణలో మరో ప్రఖ్యాత కంపెనీ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. ఇప్పటి వరకూ దక్షిణాదిలో ఎలాంటి ప్లాంట్ లేని ప్రముఖ డెయిరీ ఉత్పత్తుల సంస్థ అమూల్ .. తెలంగాణలో రూ. ఐదు వందల కోట్లతో ప్లాంట్ పెట్టాలని డిసైడయింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. తెలంగాణలో ఉన్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌లో రెండు దశల్లో మొత్తం రూ. ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతారు. ఐదు లక్షల లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటయ్యే ఈ ప్లాంట్‌ను భవిష్యత్‌లో పదిలక్షల లీటర్లకు పెంచుతారు.
ఈ ప్లాంట్‌లో బట్టర్ మిల్క్, పెరుగు, లస్సి, పన్నీర్, స్వీట్స్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తారు. దీంతో పాటు అమూల్ తన బేకరీ ప్రొడక్షన్ డివిజన్ ను తెలంగాణలో ఏర్పాటు చేసి బ్రెడ్, బిస్కెట్ మరియు ఇతర బేకరీ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకు వస్తారు. తెలంగాణ లో తాము ఏర్పాటు చేయనున్న ప్లాంట్ రానున్న 18 నుంచి 24 నెలలు లోపల తమ కార్యకలాపాలను ప్రారంభిస్తుందని అమూల్ ప్రకటించింది. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా 500 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తో సమావేశమైన అమూల్ ప్రతినిధి బృందం ఈ మేరకు ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమ ఉత్పత్తులకు అవసరమైన పాలను తెలంగాణ రైతుల నుంచే సేకరిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కి అమూల్ కంపెనీ హామీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన అమూల్ కంపెనీని కేటీఆర్ అభినందించారు.
Also Read: బీజేపీ అధికారంలోకి వస్తే.. 70 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాం.. అన్ని కుదిరితే 50కే..
తెలంగాణలో మరో శ్వేత విప్లవం ప్రారంభమైందని... ఇలాంటి నేపథ్యంలో పెట్టుబడి పెట్టేందుకు అమూల్ తెలంగాణను ఎంచుకోవడం ద్వారా ఇక్కడి పాడి పరిశ్రమకు సైతం ప్రోత్సాహకరంగా మారుతుందన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. అమూల్ దేశ పాడి పరిశ్రమ రూపురేఖలు మార్చిందని, ప్రపంచానికి పాడి రంగంలో గొప్ప పాఠాలు చెప్పిన కంపెనీ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో కంపెనీ భవిష్యత్ ప్రణాళికలకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
Also Read: KTR: కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి