Telangana ACB: మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుకు వందల కోట్ల ఆస్తులు -తనిఖీల తర్వాత అరెస్టు చేసిన ఏసీబీ
Muralidhar Rao: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇరిగేషన్ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ గా పని చేసిన మురళీధర్ రావు దగ్గర ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఆయనను అరెస్టు చేశారు.

Former Telangana ENC Muralidhar Rao: తెలంగాణ నీటి పారుదల శాఖ మాజీ ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్ రావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆయనకు సంబంధించి పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లుగా గుర్తించారు. కొండాపూర్ బంజారాహిల్స్ యూసుఫ్ గూడా, బేగంపేట్ , కోకాపేట్ తో పాటు హైదరాబాదులోనే 4 ప్రైమ్ లొకేషన్ లో ఓపెన్ ప్లాట్స్, కరీంనగర్లో కమర్షియల్ బిల్డింగ్, వరంగల్లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్, హైదరాబాదులో ఒక కమర్షియల్ బిల్డింగ్, కోదాడలో అపార్ట్మెంట్, జహీరాబాద్ లో సోలార్ పవర్ ప్లాంట్, 11 ఎకరాల వ్యవసాయ భూమి,మోకిలాలో 6500 చదరపు గజాల భూమి, 3 కార్లు ఉన్నట్లుగా గుర్తించారు. బ్యాంకు డిపాజిట్, బంగారం అలాగే లాకర్ల గురించి వివరాలు లెక్కించాల్సి ఉన్నట్లుగా తెలుస్తోంది.
మురళీధర్ రావు అరెస్టు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో అవినీతి ఆరోపణలతో ముడిపడి ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో అక్రమాలకు సంబంధించి ఆయన ఆస్తులలో కొంత భాగం, అతని కుమారుడు అభిషేక్ వ్యాపారంలోకి మళ్లించినట్లుగా ACB అధికారులు భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి ఆరోపణలపై కమిషన్ విచారణ కొనసాగుతోంది, ఈ కేసు ఈ ప్రాజెక్ట్‌లోని అక్రమాలతో సంబంధం ఉందని చెబుతున్నారు. మురళీధర్ రావు భారత రాష్ట్ర సమితి (BRS) పాలనలో దాదాపు ఒక దశాబ్దం పాటు ఇంజనీర్-ఇన్-చీఫ్‌గా పనిచేశారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రిటైర్ అయినప్పటికీ, ఆయనకు సుదీర్ఘ కాలం పొడిగింపులు లభించాయి.
2024 ఫిబ్రవరిలో, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజ్‌లో స్తంభాలు కుంగిపోవడంపై విజిలెన్స్ శాఖ దర్యాప్తు తర్వాత ఆయనను రాజీనామా చేయమని ఆదేశించారు. ఇదే విధమైన కేసులో, జూన్ 2025లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో సంబంధం ఉన్న మరొక ఇంజనీర్ నూనే శ్రీధర్‌ను ACB అరెస్టు చేసింది. ఆయన వద్ద సుమారు 60 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు గుర్తించారు. ACB సోదాల్లో గుర్తించిన ఆస్తులలో హైదరాబాద్ , చుట్టుపక్కల ప్రాంతాల్లో లగ్జరీ విల్లాలు, వివిధ ప్రాంతాల్లో భూములు, నగదు, బంగారు ఆభరణాలు, పెట్టుబడి రికార్డులు ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. ACB అధికారులు మరింత లోతుగా మురళీధర్ రావు ఆదాయ మూలాలు, ఆస్తి పత్రాలు, ఇతర ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణకు నియమితులైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు మాజీ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) సి. మురళీధర్ రావు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు, నిర్మాణంలో లోపాలు, నిర్వహణ సమస్యలపై అనేక ప్రశ్నలు ఎదుర్కొన్నారు. అయితే ఆయన దేనికీ సూటిగా సమాధానమివ్వలేదని.. తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయానని సమాధానం ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన ఆస్తుల వ్యవహారం వెలుగులోకి రావడం.. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి చేరడానికి ముందు పెను సంచలనం అనుకోవచ్చు.





















